జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ, సినిమా బిజీ లైఫ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీకి బయల్దేరారు. తన భార్యతో కలిసి పయనమయ్యారు. తన అన్నయ్య నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న మెగా కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. వీరి వివాహానికి హాజరవడానికి పవన్ ఇటలీకి బయల్దేరారు. వాస్తవానికి ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్… ఇటలీకి వెళ్తారా? లేదా? అనే విషయంలో కొంత సందేహం ఉండేది. అయితే ఈ సందేహాలకు ముగింపు పలుకుతూ పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. మరోవైపు ఇప్పటికే కొందరు మెగా కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నారు. ఈరోజు, రేపటి లోగా మిగిలిన వారందరూ చేరుకోబోతున్నారు.
Andhra Pradesh
గుంటూరు జిల్లా లాడ్జి సెంటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. నారా భువనేశ్వరికి అండగా చంద్రన్న తోడుకు టిడిపి శ్రేణులు శాంతియుత ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ ప్రదర్శనకు అనుమతి లేదని గుంటూరు పోలీసులు అన్నారు. యాక్ట్ 30 అమల్లో ఉందని చెప్పడంతో, పోలీసులకి టిడిపి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలను చేసి, ప్రభుత్వం అక్రమ అరెస్టులతో కట్టడి చేయలేదంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుటుంబసభ్యులు ములాఖత్ కానున్నారు. బాబును నారా భువనేశ్వరి, నారా లోకేష్ కలవనున్నారు. తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్ర ముగించుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానంలో భువనేశ్వరి బయల్దేరారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కుటుంబసభ్యుల ములాఖత్ ప్రాధాన్యతను సంతరించుకుంది. చంద్రబాబు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఇటీవల భువనేశ్వరికి రిపోర్ట్ పంపించారు. అలాగే జైల్లో తన భద్రతకు ముప్పు ఉందని ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. ఇలాంటి తరుణంలో కుటుంబసభ్యులు ములాఖత్ కానుండటం కీలకంగా మారింది. గత రెండు ములాఖత్‌ల తర్వాత కుటుంబసభ్యులు మీడియాతోనే మాట్లాడకుండా వెళ్లిపోయారు. దీంతో రేపు చంద్రబాబుతో ములాఖత్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడతారా..? లేదా? అనేది కీలకంగా మారింది.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం శివాలయం వద్ద బస్సు ప్రమాదం త్రుటిలో తప్పింది. బుట్టాయిగూడెం బస్ షెల్టర్‌లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. జంగారెడ్డిగూడెం నుండి దొర మామిడి వెళుతున్న ఆర్టీసి బస్ బ్రేక్ ఫెయిల్యూర్ కావడంతో ప్రమాదం జరిగిందని ఆర్టీసీ డ్రైవర్ తెలిపారు. బస్సు అటువైపు కాకుండా మరోవైపు వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెప్పారు.
ఏపీలోని ప్రముఖ దేవాలయాలు మూతపడనున్నాయి. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం గుడి తలపులు మూయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నేడు మూతపడనుంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. 29 న ఉదయం 8 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఈ గ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. శనివారం రాత్రి ఆలయాలు తలుపులు మూయనున్నారు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున తలుపులు తెరుచుకోనున్నాయని అధికారులు తెలిపారు.
సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని.. తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న ఆరోపణలు సరికాదని కేటీఆర్ అన్నారు. రుణాలు తెచ్చి ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టామన్నారు. రుణాల మొత్తాన్ని సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు. 9 ఏళ్ల క్రితంతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు. తెలంగాణది సమ్మిళిత, సమగ్ర, సమీకృత మోడల్ అన్నారు. 9 ఏళ్లలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదన్నారు. పేదరికంలో దేశం నైజీరియాను దాటిపోయింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే పారిశ్రామికీకరణలో దూసుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడిందన్నారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ 24 వేలు ప్రభుత్వ ఉద్యోగాలను మాత్రమే ఇచ్చిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. 9 ఏళ్ల అభివృద్ధి ఇప్పుడు ప్రజలకు కనిపిస్తోందన్నారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామన్నారు. ఐటీలో హైదరాబాద్, బెంగళూరును మించిపోయిందన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పందించారు. ఓటర్లు రెండు చోట్లా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు పార్టీలు తమ దృష్టికి తెచ్చాయని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్వేర్ తమ వద్ద లేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను బట్టి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న వారిని ఓటు వేయకుండా అడ్డుకోలేమన్న విషయం స్పష్టమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉందని ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. నిన్న ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. జనవరి 1 నాటికి పూర్తి జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటి వరకు ఆ పనిచేయని వారు డిసెంబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 లేదంటే జులై 1 లేదా, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండితే కనుక అలాంటి వారు కూడా ముందస్తుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అలాగే, 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్టు వెల్లడించారు.
రాజమండ్రి జైల్లో తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. తన ప్రాణాలకు ఏ విధంగా ముప్పు ఉందో చంద్రబాబు గారు రాసిన లేఖ తనను నిలువునా కుదిపేసిందని తెలిపారు. జైలులో చంద్రబాబు ఎదుర్కొంటున్న అవాంఛనీయ పరిస్థితులను తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని వెల్లడించారు. జైలు గోడల ఆవల ఉన్న తన భర్త క్షేమం కోసం తనతో కలిసి ప్రార్థించాలని రాష్ట్రంలోని సోదరీమణులందరినీ అర్థిస్తున్నానన్నారు. నారా బ్రాహ్మణి కూడా స్పందిస్తూ వారిని ఆ లేఖ తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందన్నారు. జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు నారా బ్రాహ్మణి.
వైసీపీ వాళ్లది ధన బలమైతే.. తెలుగుదేశం పార్టీది ప్రజా బలమని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో వచ్చే కురుక్షేత్ర సంగ్రామంలో తెదేపా-జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో భువనేశ్వరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అమలు చేసే పాలకులు మంచివారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని, చెడ్డవారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా మారిందని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబును 49 రోజులుగా జైల్లో పెట్టారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం తప్పా, అమరావతి రాజధాని నిర్మించడం తప్పా, పోలవరం కట్టడం తప్పా. ఆయన చేసిన నేరం ఏమిటి? అని భువనేశ్వరి ప్రశ్నించారు.
తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను చిరుతపులి పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ ఘటన జరిగాక నడకదారి వెంబడి సంచరించే పలు చిరుతలను అటవీశాఖ సహకారంతో టీటీడీ బంధించింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చిరుతల సంచారం లేదు. తాజాగా, అలిపిరి నడకమార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి కమ్యూనికేషన్స్ రిపీటర్ స్టేషన్ మధ్య ప్రాంతంలో చిరుత సంచరిస్తూ కనిపించింది. ట్రాప్ కెమెరాలో ఈ మేరకు రికార్డయింది. ఈ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి కూడా తిరుగుతున్నట్టు కెమెరా ఫుటేజిల్లో వెల్లడైంది.ఈ నేపథ్యంలో, టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. నడకదారిలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని స్పష్టం చేసింది. లక్షిత ఘటన జరిగాక, ఘాట్ రోడ్లలో బైకులపై వెళ్లేవారిపై ఆంక్షలు విధించిన టీటీడీ. కొన్ని రోజుల కిందటే ఆ ఆంక్షలు సడలించింది. ఇప్పుడు మరోసారి చిరుత కలకలం రేగిన నేపథ్యంలో, మరోసారి ఆంక్షలు విధిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.




Total views : 202964