Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ మూతతో కార్మికుల జీవితం ఛిద్రం ..

జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ మూతతో కార్మికుల జీవితం ఛిద్రం ..

by CVR NEWS
జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ మూతతో కార్మికుల జీవితం ఛిద్రం

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జీగిరాంలో ఒకప్పుడు వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన జ్యూట్ ఫ్యాక్టరీ నేడు మూతపడిన గేట్లతో కార్మికుల కన్నీటి గాథగా మారింది. 1986 డిసెంబర్ 9న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మొదట 400 మంది కార్మికులతో ప్రారంభమై, తర్వాత అభివృద్ధి చెంది మూడు వేల మందికి ఉపాధి కల్పించింది. ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి 15 వేల మందికి పైగా కుటుంబ సభ్యులు జ్యూట్ కాలనీలో జీవనం సాగించారు. కానీ గన్ని బ్యాగులకు డిమాండ్ తగ్గిందనే కారణాలతో 2022లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో కార్మికుల జీవితాలు ఒక్కసారిగా అస్తవ్యస్తమయ్యాయి. నాలుగేళ్లుగా ఉపాధి లేక అనేక కుటుంబాలు ఆకలి కేకలతో బతుకుతున్నాయి. ప్రజాప్రతినిధులను కలిసినా, ఫ్యాక్టరీ ఎదుట నిరాహార దీక్షలు చేసినా ప్రయోజనం లేకపోయిందని కార్మికులు వాపోతున్నారు. పిల్లలకు రెండు పూటల భోజనం పెట్టలేని పరిస్థితుల్లో కొందరు హోటళ్లలో చిన్న పనులు చేస్తుండగా, మరికొందరు వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు.

జీగిరాం జ్యూట్ కాలనీలో ఒకప్పుడు కార్మికుల సందడితో కళకళలాడిన వీధులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఫ్యాక్టరీ మూతపడటంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. జ్యూట్ మిల్లుపై ఆధారపడి నడిచిన చిన్న వ్యాపారాలు, దుకాణాలు, రవాణా రంగం కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఉపాధి కోల్పోయిన కార్మికులు కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తూ అవస్థలు పడుతున్నారు. కొందరు పిల్లల చదువులు ఆపివేసి జీవన పోరాటంలో దిగాల్సి వచ్చింది. “మాకు హామీలు కాదు… పని కావాలి” అంటూ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాజకీయ నాయకులు ఇప్పటికైనా చొరవ తీసుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపి జ్యూట్ మిల్లును తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే వేలాది కుటుంబాలకు మళ్లీ జీవనోపాధి లభిస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా మూతపడిన ఈ పరిశ్రమ మళ్లీ పనిచేస్తే జీగిరాం ప్రాంతంలో తిరిగి వెలుగులు నిండతాయని స్థానికులు చెబుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

040033
Total views : 203168

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: