రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాలతో పాటు దేశవ్యాప్తంగా పలు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రాజెక్టుల ద్వారా రైల్వే మార్గాల్లో రద్దీ తగ్గడంతో పాటు రైళ్ల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
కేబినెట్ నిర్ణయం ప్రకారం తెలంగాణలోని ఘట్కేసర్–కాజీపేట సెక్షన్లో నాలుగో లైన్ నిర్మాణానికి ఆమోదం లభించింది. 110 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు రూ.2,419 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా సాగే అరక్కోణం–రేణిగుంట మార్గంలో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మార్గాల్లో కొత్త లైన్ల నిర్మాణంతో రైళ్ల రాకపోకలకు మరింత వెసులుబాటు కలగనుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలోని 17 జిల్లాల పరిధిలో నాలుగు లైన్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.10,021 కోట్లుగా పేర్కొంది. కొత్త లైన్లతో రైల్వే నెట్వర్క్ సామర్థ్యం పెరగడంతో పాటు సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్ల వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.