శ్రీశైలం మల్లన్న సేవలో ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు దర్శించుకున్నారు శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రి కొట్టు దంపతులకు ఆలయ అర్చకులు,ఆలయ ఈవో పెద్దిరాజు సాదర స్వాగతం పలికారు అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.
Devotional
తిరుమల శ్రీవారిని అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, కూతురు అల్లు అర్హతో స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయంలోకి వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. టిటిడి అధికారులు వీరికి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది, రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలను అందించారు.
పేదల దేవుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కొలువైయున్న వేములవాడ క్షేత్రంలో భక్తులపై వసతి గదుల భారం పెరిగింది. వసతి గదుల అద్దెను పెంచడంతోపాటు 100 రూపాయల అద్దె ఉన్న గదికి సైతం 12 శాతం జీఎస్టీ వసూలు చేయాలని నిర్ణయించడం వల్ల భక్తులపై భారం తడిసి మోపెడవుతోంది. గదుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న రాజన్న ఆలయ అధికారులు కొత్త ధరల ప్రకారం అద్దెలు వసూలు చేస్తున్నారు.. గతంలో వెయ్యి రూపాయలు దాటిన గదికి మాత్రమే జీఎస్టీ పన్ను వసూలు చేయగా, తాజాగా వంద రూపాయల గదికి కూడా 12 రూపాయల జీఎస్టీని వసూలు చేస్తున్నారు. అద్దె గదుల ధరలను స్వల్పంగానే పెంచినప్పటికీ ప్రతి గదికి జీఎస్టీ పన్ను వసూలు చేయాలని నిర్ణయించడంతో భక్తులపై భారం అధికమవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భీమేశ్వర అతిథి గృహం, నందీశ్వర కాంప్లెక్స్ లోని ఏసి సూట్ గదులకు 2200 రూపాయల అద్దె ఉండగా దానిని 2500 పెంచారు. 300 రూపాయల జీఎస్టీతో కలిపి వీటి అద్దె 2800 వందలకు చేరింది. అమ్మవారి అతిథి గృహంలో వెయ్యి రూపాయల అద్దె ఉండగా దానిని 1500 రూపాయలకు పెంచారు. జీఎస్టీతో కలిపి భక్తులు 1680 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నందీశ్వర కాంప్లెక్స్ లో నాన్ ఏసీ గది 350 రూపాయలు ఉండగా దానిని 150 రూపాయలు పెంచి 500 రూపాయలు చేశారు. దీంతో జీఎస్టీ కలిపి 560 చెల్లించాల్సి ఉంటుంది. పార్వతీపురం బ్లాకులలో 500 రూపాయల అద్దె ఉండగా 600 కు పెంచారు. జీఎస్టీతో కలిపి 672 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పార్వతిపురంలో సాధారణ 200 రూపాయలు ఉండగా వంద రూపాయలు పెంచి 300 రూపాయలు చేయగా జీఎస్టీతో కలిపి 336 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ లో 250 రూపాయలు ఉండగా 150 రూపాయలు పెంచి 400 రూపాయలు చేశారు. జీఎస్టీతో కలిపి 448 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. శంకరపురం ధర్మశాలలో 50 రూపాయలు ఉండగా దానిని వంద రూపాయలు చేశారు. జీఎస్టీతో కలిపి 112 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. భీమేశ్వర సదన్ లోని గదుల అద్దెలను యధావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.
శివ పార్వతులు ఈ భూమిపై వివాహం చేసుకున్న ప్రదేశం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఇక్కడ చాలా జంటలు వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. చాలా మందికి సరైన జీవిత భాగస్వామితో పాటు వివాహానికి సరైన ప్రదేశం వెతకడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. కొంతమంది తమ వివాహాన్ని హోటల్ లో, రిసార్ట్స్ లో, బాంకెట్ హాలులో చేసుకుంటే మరికొంత మంది యువ జంటలు డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ కొన్ని జంటలు మాత్రం తమ వివాహం ఆధ్యాత్మిక వాతావరణంలో, గొప్ప ప్రాశస్త్యం గల ప్రదేశాల్లో జరగాలని కోరుకుంటారు. అలాంటి జంటలకు సరైన ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న త్రియుగినారాయణ్ గ్రామం. ఈ గ్రామంలో ఉన్న త్రియుగినారాయణ్ ఆలయం విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. ఇదే ఆలయంలో కొన్ని యుగాల క్రితం మహా శివుడు, పార్వతి దేవి వివాహం చేసుకున్నట్లు నమ్ముతారు. త్రియుగినారాయణ్ పేరులో “త్రి అంటే మూడు, యుగి అంటే శకము, నారాయణ్ అంటే మహా విష్ణువు మరో నామం” అని అర్ధం. పురాణాలకు సాక్ష్యంగా నిలిచే ఎన్నో చిత్రాలు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ ఆలయంలో 24 గంటలు ఒక ధుని వెలుగుతూ కనిపిస్తుంది. ఇది శివ పార్వతుల వివాహం సమయంలో వెలిగించినదిగా చెబుతారు. ఇక్కడ నాలుగు నీటి కొలనులు కూడా కనిపిస్తాయి. వీటిలో రుద్ర కుండ్ ను స్నానాల కొరకు, విష్ణు కుండ్ ను ప్రక్షాళన కొరకు, బ్రహ్మ కుండ్ ను తాగేందుకు, సరస్వతి కుండ్ ను తర్పణాల కోసం వినియోగిస్తారు. త్రియుగినారాయణ్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు కేదార్ నాథ్ పర్వతారోహణకు బేస్ క్యాంప్ అయిన గౌరీ కుండ్ ఆలయంలో కూడా నమస్కారం చేస్తారు.
ఆలయ ప్రాముఖ్యత ఏమిటి?
స్థానిక సిద్ధాంతం ప్రకారం ఇక్కడ శివ పార్వతుల వివాహంలో బ్రహ్మ అర్చక సేవలను చేయగా, విష్ణు మూర్తి వధువు సోదరుడిగా చేయాల్సిన అన్ని ఆచారాలను నిర్వహించినట్లు చెబుతారు. ఈ వివాహం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానికి ఆలయంలో బ్రహ్మ శిల అని పిలువబడే రాయి ఉంటుంది. ఇక్కడ పవిత్రమైన అగ్ని నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లి ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచుకుంటే నూతన జంట సంతోషంగా ఉంటారని నమ్ముతారు.
త్రియుగినారాయణ్ & కేదార్ నాథ్ ఆలయం
నిర్మాణశైలిలో త్రియుగినారాయణ్ ఆలయం ప్రసిద్ధ కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి ఉండడం విశేషం. ఆలయ పురాణాల ప్రకారం ప్రస్తుతం ఇక్కడ ఉన్న నిర్మాణం ప్రముఖ సిద్ధ సాధువు, తత్వవేత్త అయిన ఆది శంకరాచార్యచే 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు కధనం.
Read Also..
Read Also..
భారతదేశంలో నమ్మశక్యం కానీ వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ భజిస్తారు, కొన్ని చోట్ల దెయ్యాల్ని వదిలిస్తారు, మరికొన్ని చోట్ల భక్తులు తలలు పగలకొట్టుకుని రక్తాన్ని చిందిస్తారు. ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు మనం చూడవచ్చు. కానీ విచిత్రమైన, అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలం. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం. అసలు ఈ అసాధారణ దేవాలయాల విశేషాలు ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. మహేందిపుర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్ :
రాజస్థాన్ లోని డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దెయ్యాల్ని, ఆత్మల్ని వదిలించుకోవడానికి వస్తుంటారు. వీపరీతమైన చర్యల ద్వారా, ఉదాహరణకు శరీరంపై వేడి నీరు పోయడం, పై కప్పు నుంచి వేలాడదీయడం, గోడలకు తలను కొట్టడం, గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటివి దుష్టశక్తుల నుంచి బాధితున్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు. భారతదేశంలో ఇప్పటికీ భూతవైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతారు. ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు.
2. కామఖ్య దేవి ఆలయం, అస్సాం :
అస్సాంలోని గువహతిలో ఉన్న నీలాచల్ కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయం ఉంది. భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలందుకుంటుంది. దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతుంటారు. ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ దేవత రుతుక్రమం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసి వేస్తారు. ఆలయం తెరిచే నాల్గవ రోజు వరకూ ఇక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా అంబుబచి మేళాను జరుపుతుంటారు. ఈ మూడు రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెబుతారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తుంటారు.
3. దేవ్ జీ మహరాజ్ మందిర్, మధ్య ప్రదేశ్ :
ప్రతి నెలా పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను, దుష్ట శక్తులను వదిలించుకోవడానికి మధ్య ప్రదేశ్ లోని దేవ్ జీ మహరాజ్ ఆలయానికి వస్తుంటారు. దుష్ట శక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడి సాధారణ పద్ధతి. వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపురుతో కొట్టడం వంటివి కూడా చేస్తుంటారు. దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ ‘భూత్ మేళా’ లేదా ‘దెయ్యాల ఉత్సవం’ నిర్వహిస్తుంటారు. భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది ఒకటి.
4. కాలభైరవనాథ్ దేవాలయం, వారణాసి :
పవిత్ర వారణాసి నగరంలో గల కాల భైరవ్ నాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఇక్కడ నమ్మశక్యం కానీ నిజం ఏమిటంటే కాల భైరవ్ నాథ్ కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, స్వీట్స్ ను అమ్ముతుంటారు. కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం.
5. కొడంగల్లూర్ భగవతి ఆలయం, కేరళ :
కాళీ దేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళి దేవికి కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ప్రతి ఏటా ఏడు రోజుల వింత భరణి పండుగ నిర్వహిస్తుంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి, కత్తులు పట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతుంటారు. రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు. ఆ తరువాత ఆలయం స్తంభాలను కర్రలతో పదేపదే కొడతారు. పండుగ తరువాత 7 రోజులు ఆలయాన్ని మూసి వేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు.
6. స్తంభేశ్వర్ మహదేవ్, గుజరాత్ :
మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా? గుజరాత్ లోని వడోదరకు దగ్గర్లో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం అటువంటిదే. ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతారు. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటి. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యపడుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్లి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు. మరలా కొన్ని గంటల తరువాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తారు.
7. బ్రహ్మ ఆలయం, పుష్కర్, రాజస్థాన్ :
ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబు కంట పడినా కూడా నేటికీ చెక్కుచెదరక మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మ దేవుని ఆలయం ఒకటి. ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం ఇదే. హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేకపోవడం విశేషం. పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇవి దాతలు, భక్తుల పేర్లతో కనిపిస్తాయి.
8. దేవరగట్టు ఆలయం, ఆంధ్రప్రదేశ్ :
భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకూఒకరి తలలపై ఒకరు కొట్టుకుంటారు. ఇక్కడి మాల మల్లేశ్వరుడు (శివుడు) చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకు బదులు గొడ్డలి, బాకులను వాడే వారు.
విజయవాడ దుర్గగుడికి చేరుకున్న సీఎం జగన్. పూర్ణకుంభం స్వాగతం పలికిన వేద పండితులు,ఆలయ అధికారులు,ప్రజాప్రతినిధులు.
అలయప్రాంగణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన సీఎం జగన్. 216 కోట్లతో చేపడుతున్న పలు అబ్బివృద్ది పనులకు సీఎం శంఖుస్థాపన.
70 కోట్ల ప్రభుత్వ నిధులు,131 కోట్ల ఆలయ నిధులు,5 కోట్ల దాతల నిధులు,33 కోట్ల ప్రవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు. ప్రసాదం పోటు,అన్నప్రసాద భవనం,ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్,కేశఖండన శాల నిర్మాణాలు.
ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబులం పూజలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి. అయ్యప్ప మాలధారణం నియమాల తోరణమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లెలో ని వారి స్వగృహంలో ఘనంగా జరిగిన అయ్యప్ప స్వామి అంబలం పూజలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు గావించారు. అంబులం పూజ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 18 మెట్ల మండపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అయ్యప్ప మాలధారణ స్వాములు, గురుస్వాముల భక్తి పాటలతో ఈ ప్రాంతం పులకరించింది. పూజ అనంతరం సుదర్శన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున భిక్ష ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప దీక్ష ఆరోగ్య రక్ష అని అన్నారు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతి వ్యక్తిని దైవ స్వరూపంగా భావించడమే దీక్ష పరమార్థమన్నారు. ఆధ్యాత్మిక చింతన పెరగడమే కాకుండా దురలవాట్లకు దూరమై సంపూర్ణ ఆరోగ్యం క్రమశిక్షణతో కూడినజీవన విధానం , ధార్మిక భావాలు అలవడు తున్నాయన్నారు. కార్తీక మాసంచాలా విశిష్టమైనదని, నియోజకవర్గంలో కార్తీక మాస శోభ సంతరించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మాజీ ఎంపిపి అంపాబత్తిన రెడ్డెయ్య,వైస్ ఎంపిపి సుబ్బరాయుడు, సర్పంచులు వెంకట నారాయణరెడ్డి , జనార్దన్ రెడ్డి, ఎంపిటిసి లు లక్ష్మీ నారాయణ,జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ ఉమా మహేశ్వర స్వామి వార్షికోత్సవం ను పురస్కరించుకొని ఆలయంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పూజ. పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. హర హర సుతన. స్వామియే శరణం ఆయప్ప శరణం అంటూ అయ్యప్ప స్వామి శరణు గోషతో మార్మోగిన రాయచోటి. ఆలయం చూట్టు ఉత్సవ విగ్రహాలతో ప్రదక్షిణలు. మౌచింగ్ తుఫాన్ ప్రభావం కారణంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఆలయంలోనే నిర్వహించినట్లు తెలియజేసిన ఆలయ కమిటి సభ్యులు అరమాటి శివగంగి రెడ్డి.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం శివాలయం చెక్ పోస్ట్ సర్కిల్ నందు వెలిసిన శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో మంగళవారం వార్షికోత్సవం ను పురస్కరించుకొని ఆలయంలో నే ప్రధాన అర్చకులు నటరాజ స్వామి ,ఆలయ కమిటి సభ్యులు అరమాటి శివగంగి రెడ్డి అధ్వర్యంలో అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచి కుడా ముందుగా శ్రీ ఉమా మహేశ్వర స్వామి అమ్మవార్లతో పాటు అయ్యప్ప స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన అర్చకులు.మంగళ వారం రాత్రి అయ్యప్ప స్వామిని ప్రత్యేకంగా పుష్ప అలంకరణ గావించి గురు స్వాములు చే పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు .అనంతరం అయ్యప్ప స్వామి వారు, శ్రీ ఉమా మహేశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయం చుట్టూ స్వాములు మూడు ప్రదక్షిణలు నిర్వహించారు.అనంతరం స్వామి వారికి ముగింపు మంగళ హారతులు అందజేశారు.స్వాములకు కమిటీ అధ్వర్యంలో అల్పాహార బిక్షను ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు స్వామి వారి వార్షికోత్సవాన్ని ఎంతో వైభవంగా చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేశామన్నారు .కాని మౌచింగ్ తుఫాన్ ప్రభావం తో కురుస్తున్న వర్షానికి ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి రావడం చాల దురదృష్టకరం అన్నారు.అందువల్ల ఆలయం లోనే స్వామి వారి వార్షికోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు .శివుని ఆలయంలో అయ్యప్ప స్వామి పూజలో పాల్గొనడం అయ్యప్ప స్వాములు అదృష్టంగా బావించ వచ్చాన్నారు .స్వామి వారి ఆలయంలో బిక్ష చేయడం కుడా పూర్వజన్మ సుకృతం అన్నారు .అయ్యప్ప స్వామి కృపా కటాక్షాల తో మీరు,మీ కుటుంబ సభ్యులందరూ కుడా ఆయురారోగ్యాలు తో పాటు సుఖ సంతోషాలతో,సిరి సంపదలు సిద్దించాలని అందరికీ దేవ దేవుడు అయినటువంటి పరమశివుడిని వెడుక్కొన్నట్లు వారు తెలియజేశారు.
ఆధునిక నగరమైన బెంగళూరు నగరంలో ఆశ్చర్యపరిచే మిస్టరీలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇక్కడ బయటపడిన 7వేల సంవత్సరాల నాటి నంది తీర్ధంలో నంది నోటి నుంచి నిరంతరం నీరు రావడం విశేషం. బెంగళూరు నగరంలో దాదాపు 7 వేల సంవత్సరాల చరిత్ర గల శ్రీ దక్షిణముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం ఉంది. భారతదేశంలో ఇటీవల కనుగొన్న మర్మ దేవాలయాల్లో ఇది ఒకటి. బెంగళూరు సిటీకు వాయువ్యంలోని మల్లేశ్వరం లేఅవుట్ లో ఉన్న గంగమ్మ ఆలయానికి అభిముఖంగా ఈ ఆలయం ఉంటుంది. ఈ దేవాలయాన్ని నంది తీర్ధ, నందీశ్వర తీర్ధ, బసవ తీర్ధ లేదా మల్లేశ్వరం నంది గుడి అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ మహా శివుడు శివలింగ రూపంలో పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయానికి కేంద్ర బిందువుగా నంది విగ్రహం ఉంటుంది. ఇది దక్షిణ ముఖంగా భక్తులకు దర్శనమిస్తుంది. అందుకే దీనికి దక్షిణ ముఖ నంది అనే పేరు వచ్చింది. ఈ నంది నోటి నుంచి నిరంతరం జలం రావడం ఇక్కడ ప్రత్యేకత. దీన్ని భక్తులు పవిత్ర జలంగా భావిస్తారు. నంది నోటి నుంచి వచ్చిన నీరు ఆలయం మధ్యలో ఉన్న కళ్యాణి అనే మెట్ల తొట్టెలోకి వెళ్తుంది. క్షేత్రం అంటే కన్నడలో స్థలం అని అర్ధం. కొన్ని సందర్భాల్లో చారిత్రక, మత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను లేదా ప్రాంతాలను సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తారు. అయితే పైన చెప్పబడిన ఈ ప్రత్యేకతలు అన్నీ కలిపి ఈ ఆలయానికి అధికారిక నామంగా మారాయి.
ఆలయం చరిత్ర:
1997లో బెంగళూరు నగరంలోని కడు మల్లేశ్వర ఆలయానికి అభిముఖంగా ఉన్న ఖాళీ స్థలంలో ఓ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే తవ్వకాలు చేస్తున్న సమయంలో కార్మికులు ఇక్కడ ఓ ఆలయం ఉన్నట్లు గుర్తించారు. ఇంకాస్త లోతుగా తవ్వగా ఈ శివాలయం బయటపడినట్లు చెబుతారు. భారత పురాతత్వ పరిశోధన శాఖ ఇక్కడ తవ్వకాలు చేపట్టి ఆలయం మధ్యలో ఉన్న కొలను, గ్రానైట్ మెట్ల నిర్మాణాలను, మండప స్తంభాలను కనుగొన్నారు. ఈ ఆలయంలో నంది విగ్రహం నోటి నుంచి నిరంతరం వచ్చే జలం ద్వారా శివలింగానికి నిత్యం అభిషేకం జరుగుతుంటుంది. ఈ ఆలయ వయస్సుపై విరుద్దమైన నివేదికలు ఉన్నాయి. ఇది 400 సంవత్సరాల క్రితం నాటిదని కొన్ని నివేదికలు చెబితే, కొన్ని ఆధారాల ప్రకారం ఇది 7000 సంవత్సరాల పూర్వందని చెబుతున్నారు.
ఎందుకంత ప్రత్యేకం:
ఈ ఆలయంలో ప్రత్యేకమైన నంది విగ్రహాన్ని పురావస్తు పరిశోధన శాఖ వారు పరిశీలించారు. నంది నోటి నుంచి నిరాటంకంగా జలం రావడాన్ని గుర్తించారు. ఈ నీరంతా ఆలయం మధ్య భాగంలో ఉన్న కళ్యాణి అనే ప్రదేశానికి వెళ్లి శివలింగంపై పడుతున్నట్లు నిర్ధారించారు. అయితే నంది నోట్లో నుంచి వస్తున్న నీరు మాత్రం ఎక్కడి నుంచి వస్తుందో పరిశోధకులు కనుగొనలేకపోయారు. వృషభావతి నదికి దీనిని జన్మ స్థానంగా భావిస్తారు. చరిత్రలో నంది తీర్ధ ఆలయం చాలా కాలం వినియోగంలో లేకుండా క్రమంగా భూ గర్భంలో కలిసినట్లు చెబుతారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సాధారణ భూస్థాయి కంటే ఈ ఆలయం తక్కువ ఎత్తులో ఉంటుంది. దీనికి తోడు ఆలయంపై గోపుర శిఖరం కూడా లేకపోవడంతో ఇది కాల క్రమంలో ప్రజల దృష్టి నుంచి దూరమైనట్లు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో ప్రజలు నివసించారనడానికి, ఈ ఆలయం ప్రజల నుంచి పూజలు అందుకుందని చెప్పడానికి ఆలయంలో ఉన్న కళ్యాణి ప్రదేశం ఒక జ్ఞాపకంగా, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది. కాలక్రమంలో బెంగళూరు నగరంలో మల్లేశ్వరం ప్రాంతం నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ప్రముఖమైనదిగా అభివృద్ధి చెందింది. దీంతో ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. 1997లో నగరంలో కాస్త ఖాళీగా స్థలంగా ఈ ఆలయం ఉన్న ప్రదేశం కనిపించడంతో ఇక్కడ నిర్మాణాలకు పనులు మొదలయ్యాయి. అయితే ఈ ప్రదేశంలో పురాతన ఆలయం బయట పడడంతో స్థానికుల ఆందోళనల మేరకు దీనిని బయటకు తీసే ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే మట్టి, బురద నుంచి దక్షిణ ముఖ నంది తీర్ధ కళ్యాణి క్షేత్రం బయటపడినట్లు చెబుతారు.
ఈ ఆలయం స్తంభాలతో కూడిన కళ్యాణి ప్రాంగణం చుట్టూ నిర్మించబడింది. సాధారణంగా అన్ని శివలింగ క్షేత్రాల్లో శివలింగానికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం నంది పైన, శివలింగం కింద ఉండడం విశేషం. శివలింగానికి ఎడమ వైపు మూలన చిన్న గణేశుని విగ్రహం ఉంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రధాన విగ్రహానికి కుడి వైపు నవగ్రహ మండపం ఉంటుంది. శివాలయం కావడంతో ఇక్కడ శివుడికి సంబంధించిన ప్రతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. కార్తీక మాసం, మహా శివరాత్రి సమయాల్లో భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. బెంగళూరు ప్రధాన నగరం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 వరకూ ఆలయం తెరిచి ఉంటుంది. ఈ ఆలయ ప్రాచుర్యం, ప్రత్యేకతలు రోజురోజుకూ విస్తరించడంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.
శ్రీకాళహస్తిలో ఏడు గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు గంగమ్మలు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. దక్షిణ కైలాసనాథుడు కొలువులో ఏడు గంగమ్మ ల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి.. మంగళవారం అర్ధరాత్రినుంచి బుధవారం తేల్లావారు జామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూలవిరాట్ కు విశేష అభిషేక పూజలు శాస్త్రయోక్తంగా నిర్వహించారు. అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభం వేసి మహా నైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు.
మహా నైవేద్యం, మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు. గంగమ్మ నామస్మరణ చేస్తూ బలి పూజలు నిర్వహించారు. అనంతరం రజకుల ఆధ్వర్యంలో ఏడు గంగమ్మల మట్టి ప్రతిములు పసుపు ముద్దలు ప్రతిములను విశేష పూజలు జరిపి ఏడు గంగమ్మ కమిటీలకు అందజేశారు. ఏడు గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ తమ గంగమ్మ తీసుకొని తమతమ చెప్పరాల వద్దకు తీసుకువెళ్లి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు.
మూల విరాట్ పూజల అనంతరం ఏడుగంగమ్మలు ఒకరి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువు తీరారు,ఏడు గంగమ్మ కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చెప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళస్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పొన్నాలమ్మ, అంకాలమ్మ భువనేశ్వరి దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పట్టుతూ కొబ్బరికాయలు కొట్టి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు. కొందరు బలిలిచి అమ్మవారిని సంతృప్తి పరిచారు. పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు. అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూలస్థానాలకు అత్యంత వేడుకగా బయలుదేరి వెళ్లాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూలస్థానాల్లో అమ్మవాళ్ళు కొలువుతిరి భక్తులకు కరుణాకటాక్షాలు అనుగ్రహించునున్నారు.