Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh మార్కాపురం ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య..

మార్కాపురం ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య..

by CVR NEWS

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనలో 14 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. మరో 28 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేక లోపలే వారంతా కాలిబూడిదయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు. పెదారికట్లకు చెందిన అంబటి అనిల్‌తో పాటు 5 నెలల పసికందు అంబటి లియో కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే చల్లగిరిగలకు చెందిన తమ్మిశెట్టి పిచ్చమ్మ, తమ్మిశెట్టి రుక్మిణి, తింగారెడ్డిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి, బత్తుల పద్మ ఈ దుర్ఘటనలో మరణించినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన మృతుల్లో దాసరిపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు, ఉన్నగురువాయపాలెం వాసులు నర్సింగ్ ప్రభావతి, నర్సింగ్ క్షేత్ర ఉన్నారు. వీరితో పాటు పనుగోడుకు చెందిన దేవాండ్ల రామయ్య, మంగళకట్టకు చెందిన జయరామయ్య కూడా అగ్నిప్రమాదానికి బలయ్యారు. ఈ ఘటనతో ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు అనిత, జనార్దన్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రమాదం తీరుపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ క్యాబినెట్‌లో చర్చ జరిగింది. మృతులకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు, గాయపడిన వారికి 2లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించాలని మంత్రులు, అధికారులకు సూచించారు.

బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌ రామకృష్ణారావును ఆదేశించారు. బస్సు జగిత్యాల నుంచి బయల్దేరిన నేపథ్యంలో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో ఏపీ సీఎస్‌తో తెలంగాణ సీఎస్‌ మాట్లాడారు.
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం అత్యంత విషాదకరమని మోదీ అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు

Advertisements

You may also like

Our Visitor

013868
Total views : 78236

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.