భారత్‌లో కాస్మెటిక్ ఇంజెక్షన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తూ.. ఇంజెక్షన్ రూపంలో ఉపయోగించే ఎలాంటి కాస్మెటిక్ ఉత్పత్తులను తయారు చేయడం,దిగుమతి చేసుకోవడం, వినియోగించడం అనుమతించబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నోటీసు విడుదల చేసింది.
డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940 ప్రకారం కాస్మెటిక్స్ అంటే శరీరాన్ని శుభ్రపరచడం,అందంగా చూపించడం,ఆకర్షణ పెంచడం లేదా రూపాన్ని మార్చేందుకు బయటకు రాసుకునే ఉత్పత్తులేనని డీసీజీఐ పేర్కొంది.
అయితే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఉత్పత్తులు కాస్మెటిక్స్ నిర్వచనంలోకి రావని తెలిపింది. అందువల్ల బ్యూటీ క్లినిక్స్, ప్రొఫెషనల్స్ లేదా వినియోగదారులు కాస్మెటిక్ ఉత్పత్తులను ఇంజెక్షన్ల రూపంలో ఉపయోగించరాదని హెచ్చరించింది. కాస్మెటిక్ ఉత్పత్తులను శరీరంపై రాసుకోవడం, చల్లడం లేదా స్ప్రే చేయడానికే అనుమతి ఉంటుందని, చికిత్స కోసం లేదా ఇంజెక్షన్ ద్వారా ఉపయోగించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. అలాగే నిషేధిత పదార్థాలను ఉపయోగించడం, తప్పుడు ప్రచారం చేయడం, లేబుళ్లపై తప్పుదారి పట్టించే వివరాలు ఇవ్వడం కూడా చట్ట విరుద్ధమని పేర్కొంది. తయారీదారులు ఉత్పత్తులపై ఇచ్చిన వివరాలను ఎవరూ మార్చకూడదని డీసీజీఐ ఆదేశించింది. కాస్మెటిక్ ఉత్పత్తులు వైద్య చికిత్సలకు ఉపయోగపడతాయని చెప్పడం లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం పై కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
National
వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది..
వరల్డ్స్ మోస్ట్ పాపులర్, మోస్ట్ ట్రెండింగ్ మెలోడీ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయింది. ఎస్.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.. ఈ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ ఒకే ఫ్రేమ్‌లోకి వస్తే చాలు.. ఇంటర్నెట్ సర్వర్లు క్రాష్ అయిపోవాల్సిందే, లైకులు, షేర్ల వర్షం కురవాల్సిందే..వీరిద్దరి మధ్య ఉన్న డిప్లమాటిక్ కెమిస్ట్రీ, స్నేహం, మర్యాదపూర్వకమైన ర్యాపోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేయాల్సిందే.. ఎంతలా అంటే.. వీరిద్దరి పేర్లు కలిపి మెలోడీగా మార్చేసి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. రోమ్ వేదికగా మరోసారి ఈ గ్లోబల్ కాంబో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఐదు దేశాల సుదీర్ఘ పర్యటన ముగింపులో భాగంగా ఇటలీలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి… మెలోనీ ఇచ్చిన వెల్కమ్ చూస్తే అక్కడ కేవలం ప్రొటోకాల్స్ లేవు, అంతకుమించిన ప్యూర్ ఫ్రెండ్షిప్ కనిపిస్తోంది.
ఝార్ఖండ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లకు మరో కీలక విజయంగా 27 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ తదాషా మిస్త్రీ సమక్షంలో జరిగిన ఈ సరెండర్ కార్యక్రమంలో పలువురు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ నవజీవన్’ ప్రభావంతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని పేర్కొన్నారు.2026లో ఇప్పటివరకు 22 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు ఎన్కౌంటర్లో హతమార్చగా..44 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మరో 29 మంది స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. నేడు లొంగిపోయిన 27 మందికి ప్రభుత్వం తరఫున పునరావాసం కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.
రాత్రి వేళ రోడ్లపై ప్రయాణం ఇప్పుడు ప్రజలకు భయానక అనుభవంగా మారుతోంది. ఎదురుగా వచ్చే వాహనాల ఎల్ఈడీ హెడ్లైట్ల కాంతి డ్రైవర్ల కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హైవేలపై, గ్రామీణ రహదారులపై ఈ సమస్య మరింత ప్రమాదకరంగా మారింది. ఒక్కసారిగా కళ్ల ముందు తెల్లటి వెలుగు పడటంతో కొన్ని క్షణాలు ఏమీ కనిపించకపోవడం, అదే సమయంలో ప్రమాదాలు జరగడం సాధారణమవుతోంది. గతంలో హెడ్లైట్లకు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ లేదా బ్లాక్ పెయింట్ తప్పనిసరి అన్న నిబంధన అమల్లో ఉండేది. ఇప్పుడు ఆ నిబంధన అమలులో ఉందో లేదో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. మరోవైపు కంపెనీ ఫిట్మెంట్ కాకుండా మార్కెట్లో దొరికే హై పవర్ LEDలు, ప్రొజెక్టర్ లైట్లు వాహనాలకు అమర్చడం పెరిగిపోయింది. ఆర్టీవో, ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేయకపోవడంతో నియంత్రణ పూర్తిగా సడలిపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. రాత్రి 7 గంటల తర్వాత వాహనం నడపాలంటేనే భయమేస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారత మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం హెడ్లైట్ల వినియోగంపై ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. లో-బీమ్‌కు 55 వాట్స్, హై-బీమ్‌కు గరిష్టంగా 60 నుంచి 70 వాట్స్ వరకు మాత్రమే అనుమతి ఉంది. కానీ మార్కెట్లో 100 వాట్స్ పైగా కాంతి ఇచ్చే బల్బులు విస్తృతంగా అమ్ముడవుతున్నాయి. కంపెనీ ఇచ్చిన సాధారణ లైట్ల స్థానంలో అధిక కాంతి ఇచ్చే LEDలు అమర్చడం చట్టవిరుద్ధం అయినా ఎక్కడా నియంత్రణ కనిపించడం లేదు. సుప్రీంకోర్టు కూడా ఇతరులకు కళ్లు మిరుమిట్లు గొలిపే లైట్లు ప్రమాదకరమని స్పష్టం చేసింది. నగరాల్లో, స్ట్రీట్ లైట్లు ఉన్న ప్రాంతాల్లో తప్పనిసరిగా డిమ్ లైట్ వాడాలనే నిబంధన ఉన్నా చాలామంది డ్రైవర్లు హైబీమ్‌ను ఆఫ్ చేయడం లేదు. ఫలితంగా ఎదురుగా వచ్చే వాహనదారులు క్షణాల్లో విజిబిలిటీ కోల్పోతున్నారు. ఇది చిన్న ప్రమాదాలకే కాదు ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి అక్రమ LEDలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డు భద్రతలో హెడ్లైట్ల నియంత్రణ అత్యంత కీలకమైన అంశంగా నిపుణులు చెబుతున్నారు. వాహనానికి గరిష్టంగా నాలుగు లైట్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉన్నా కొందరు అదనపు ఫాగ్ లైట్లు, LED బార్లు అమర్చి రోడ్లపై తిరుగుతున్నారు. తెలుపు లేదా పసుపు రంగు లైట్లు మాత్రమే అనుమతించబడినా బ్లూ, వైట్ ఫ్లాషింగ్ లైట్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవి ఇతర డ్రైవర్ల దృష్టిని మరింత దెబ్బతీస్తున్నాయి. రాత్రి సమయంలో కొన్ని క్షణాల విజిబిలిటీ కోల్పోవడమే భారీ ప్రమాదాలకు కారణమవుతుందని ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, కంటి సమస్యలు ఉన్నవారికి ఈ LED కాంతి మరింత ప్రమాదకరంగా మారుతోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానాలు, మళ్లీ తప్పు చేస్తే మరింత భారీ ఫైన్ విధించే అవకాశం ఉంది.నిబంధనలు అమలు చేయడంలో అధికారుల అలసత్వాన్ని కొందరు వాహన దారులు అవకాశంగా తీసుకుంటున్నారు .దింతో పరిస్థితి అదుపు తప్పుతోంది. కనీసం పాత నిబంధనల మాదిరిగా హెడ్లైట్లపై బ్లాక్ స్టిక్కర్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని, అక్రమ LEDలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
టెట్రా ప్యాక్‌లు, సాచెట్ల వంటి గుర్తించలేని ప్యాకేజీలలో మద్యం అమ్మకాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం స్పందనను కోరింది. ఇటువంటి ప్యాకేజింగ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించి, మైనర్ల మద్యపానాన్ని ప్రోత్సహించగలదని పిటిషన్‌దారు పేర్కొన్నారు. కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ అనే లాభాపేక్షలేని సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై, భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, పలు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది. సంస్థ తరఫున లాయర్ విపిన్ నాయర్ వాదనలు వినిపిస్తూ, అలాంటి అనేక మద్యం ఉత్పత్తుల ప్యాకింగ్‌పై సరైన హెచ్చరికలు ఉండటం లేదని కోర్టుకు తెలిపారు. అవి పండ్ల రసాలను పోలి ఉండేలా ప్యాక్ చేస్తున్న సందర్బాలు ఉన్నట్లు తెలిపారు. అలాంటి ప్యాకేజీలలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకే విధమైన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టు ఈ అభ్యర్థనను పరిశీలించి…. ప్యాకింగ్ తప్పుదోవ పట్టించేలా ఉందంటూ కేంద్రం, రాష్ట్రాల్లోని ఎక్సైజ్ విభాగాలకు నోటీసులు జారీ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఐరోపా దేశాల పర్యటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక సంక్షోభం వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మాత్రం ఇటలీలో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇటువంటి చర్యలు నాయకత్వం అనిపించుకోవని..ఓ జిమ్మిక్కు మాత్రమేనని అన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు చర్యలను ఆయనే పాటించడం లేదని విమర్శించారు. పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే దేశంలో గ్యాస్, ఎరువులు, ఇంధనాల సరఫరా పూర్తిగా ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళనాడులో కేబినెట్ విస్తరణకు రంగం సిద్దమయ్యింది. టీవీకే అధినేత విజయ్ తొలిసారిగా ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో తనతో పాటు మొత్తం 10 మంది మంత్రులు మాత్రమే తొలిరోజు ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మిగిలిన మంత్రుల్ని కూడా తీసుకునేలా నేడు కేబినెట్ విస్తరణ చేయనున్నారు. తమకు మద్దతిస్తున్న పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించాలని విజయ్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రధాన మితపక్షం కాంగ్రెస్ కు 2 బెర్తులు కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ తాజా ఎన్నికల్లో ఐదు సీట్లు గెల్చుకుంది. వీరిలో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా ఖరారు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేష్ కుమార, పి.విశ్వనాథన్‌లను తమిళనాడు మంత్రివర్గంలోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. వీరంతా నేడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్‌లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. దేశీయంగా తయారు చేసిన సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ వ్యవస్థను ప్రైవేట్ రక్షణ సంస్థ నిబే లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఒడిశాలోని చాందీపుర్ పరీక్షా కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సామర్థ్యంతో రూపొందించిన రెండు రకాల సూర్యాస్త్ర రాకెట్ నమూనాలను పరీక్షించారు. ఈ పరీక్షల్లో రాకెట్లు లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో తాకినట్లు అధికారులు వెల్లడించారు. కేవలం 1.5 నుంచి 2 మీటర్ల పరిధిలోనే లక్ష్యాన్ని ఛేదించడం ఈ వ్యవస్థ ప్రత్యేకతగా పేర్కొన్నారు.
150 కిలోమీటర్ల శ్రేణి వేరియంట్ యుద్ధరంగంలో తక్షణ రక్షణ మద్దతుకు, శత్రు స్థావరాలపై వ్యూహాత్మక దాడులకు ఉపయోగపడుతుంది. ఇక300 కిలోమీటర్ల శ్రేణి వేరియంట్ సైన్యానికి స్టాండ్-ఆఫ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. అంటే మన సైనికులు సురక్షిత ప్రాంతంలో ఉంటూనే, శత్రు సరిహద్దుల వెనుక చాలా లోతున ఉన్న వ్యూహాత్మక కేంద్రాలను ధ్వంసం చేయవచ్చు.
ఈ విజయవంతమైన ప్రయోగాలతో ఈ రాకెట్ వ్యవస్థ త్వరలోనే భారత సైన్యం అమ్ములపొదిలో అధికారికంగా చేరనుంది. గతంలో ఇటువంటి అధునాతన క్షిపణి, రాకెట్ వ్యవస్థల కోసం భారత్ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశీయ తయారీని ప్రోత్సహిస్తుండటంతో, DRDO వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు నిబే లిమిటెడ్ వంటి ప్రైవేట్ రక్షణ సంస్థలు కూడా అత్యాధునిక ఆయుధాలను ఇక్కడే తయారు చేస్తున్నాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశీయ రక్షణ రంగ పారిశ్రామిక ప్రగతికి, స్వయం సమృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది. ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది. తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది. నార్వేకు చెందిన ఆఫెన్ పోస్టెన్ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది. దీనికి కాప్షన్‌గా ఓ తెలివైన, విసిగించే వ్యక్తి అని పేర్కొంది. అంతే కాదు.. భారత విదేశాంగ విధానంపైనా సదరు ఆఫెన్ పోస్టెన్ పత్రిక అక్కసు వెళ్లగక్కింది. ప్రధాని మోదీ సోమ, మంగళవారాల్లో నార్వేలో పర్యటించారు. ఈ కార్టూన్ మాత్రం ప్రధాని నార్వేకు వెళ్లేకంటే ముందే ప్రచురించారని సమాచారం. నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని ఉన్న సమయంలో ఈ కార్టూన్ వెల్లడైంది. ప్రస్తుతం ఈ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. జాత్యహంకారానికి సదరు కార్టూన్ చిహ్నమని నెటిజన్లు మండిపడుతున్నారు. యూరోపియన్లు ఇప్పటికీ తమ వలసవాద భ్రమ నుంచి బయటపడలేకపోతున్నారంటూ మరో నెటిజన్ ఫైర్ అయ్యారు.
దేశంలో వీధికుక్కల దాడులు, కుక్కకాట్ల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వాటి నివారణపై సుప్రీంకోర్టు మంగళవారం అత్యంత కీలకమైన, సంచలన తీర్పు వెలువరించింది. మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే కుక్కలు, ఆకలితో ఉండే ప్రమాదకరమైన వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు అధికారుల్ని ఆదేశించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి. అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది. వీధికుక్కల్ని షెల్టర్లకు తరలించాలని గతేడాది నవంబర్ లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని పిటిషన్లలో కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, పాఠశాలలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు వంటి పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధికుక్కలకు వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ పూర్తయిన తర్వాత, వాటిని తిరిగి అదే ప్రదేశాలలో వదిలిపెట్టకూడదని గత నవంబర్‌లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి నిరాకరించింది. వీధికుక్కల్ని కేవలం జంతుసంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దేశంలో పిల్లలు, వృద్ధులు, టూరిస్టులపై కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలపై ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీధికుక్కల దాడుల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయ్యారని కోర్టు తప్పుబట్టింది.
హార్ష్ గ్రౌండ్ రియాలిటీలను చూస్తూ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడంపై జస్టిస్ సందీప్ మెహతా అసహనం వ్యక్తం చేశారు. వీధికుక్కల కారుణ్య మరణాలు, వాటిని జంతుసంరక్షణ కేంద్రాలకు తరలించడంపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఈ ఆదేశాలను అమలు చేయడంలో వైఫల్యం చెందితే, సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కార చర్యలతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. హైకోర్టులు స్వయంగా కేసులను నమోదు చేసి ఈ నిబంధనల అమలును పర్యవేక్షించాలని సూచించింది. గత ఏడాది జూలైలో ఓ ఆరేళ్ల చిన్నారి రేబిస్ వ్యాధితో మరణించిన వార్త ఆధారంగా సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించి, సుదీర్ఘ విచారణ అనంతరం ఈ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.