తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ TVK దూసుకుపోతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను TVK అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో విజయ్ కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి త్రిష విజయ్ ఇంటికి చేరుకున్నారు. ఇక ఫలితాలకు ముందు విజయ్ విజయం సాధించాలంటూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె తిరుమల నుంచి చెన్నై చేరుకొని విజయ్ నివాసానికి వెళ్లారు. తమిళనాట ఫలితాల్లో దూసుకుపోతున్న విజయ్‌కు అభినందనలు తెలిపారు.
National
పుదుచ్చేరి రాజకీయాల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది. 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ కీలక పోరులో, ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తేలే సమయం వచ్చేసింది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం, ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని AINRC మరియు బీజేపీ కూటమి తన అధికారాన్ని కాపాడుకునే దిశగా ముందంజలో ఉన్నాయి. ముఖ్యమంత్రి రంగస్వామి తన కంచుకోట అయిన తట్టంచావడి నియోజకవర్గంలో భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల ప్రకారం, ఎన్డీయే కూటమి సుమారు 11 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గట్టి పోటీనిస్తోంది. రికార్డు స్థాయిలో దాదాపు 90 శాతం పోలింగ్ నమోదు కావడంతో, ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లను చీల్చుతూ ప్రధాన పార్టీలకు సవాలు విసురుతోంది. ముఖ్యంగా మాహే మరియు యానాం వంటి ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులు మరియు ఇతర పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. స్థానిక స్వయంప్రతిపత్తి మరియు అభివృద్ధి నినాదాలతో సాగిన ఈ ఎన్నికల యుద్ధంలో తుది విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. మ్యాజిక్ ఫిగర్ 16ను అందుకునేందుకు కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
కేరళ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. కేరళ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది. కేరళంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 71. యూడీఎఫ్ ప్రస్తుతం 80 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. LDF కోటలో యూడీఎఫ్ జెండా రెపరెపలాడుతోంది. గత ఐదేళ్లుగా పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై ప్రజలు తమ తీర్పును స్పష్టం చేశారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించి చరిత్ర సృష్టించిన ఎల్డీఎఫ్కు ఈసారి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సంప్రదాయబద్ధంగా ప్రతి పదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే కేరళం ఓటర్లు, ఈసారి కూడా అదే బాటలో పయనిస్తూ యూడీఎఫ్‌కు పట్టం కడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ప్రభావం, మరియు యూడీఎఫ్ మేనిఫెస్టోలోని హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. నిరుద్యోగం, స్థానిక సమస్యలే అజెండాగా యూడీఎఫ్ సాగించిన ప్రచారం క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. మెజారిటీ జిల్లాల్లో యూడీఎఫ్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతున్నారు. ఎల్డీఎఫ్ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లో సైతం యూడీఎఫ్ పాగా వేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఈ భారీ ఆధిక్యం యూడీఎఫ్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే అవకాశాలు స్పష్టం కనబడుతున్నాయి. మరికొద్ది సేపట్లో పూర్తిగా వెలువడే తుది ఫలితాలు కేరళ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో వేచి చూడాల్సిందే.
పశ్చిమ బెంగాల్ కోటలో ప్రకంపనలు మొదలయ్యాయి. భారత రాజకీయ యవనికపై పశ్చిమ బెంగాల్ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలువబోతోంది. ఇన్నాళ్లూ ‘దీదీ’ సామ్రాజ్యంగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ కోట ఇప్పుడు బద్దలవుతోంది. కమలం దళం బెంగాల్ గడ్డపై అప్రహతితంగా దూసుకుపోతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా అప్రతిహతంగా దూసుకుపోతోంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఊహించని విధంగా రెండో స్థానానికి పరిమితమై ఆత్మ రక్షణలో పడిపోయింది. క్షేత్రస్థాయిలో మమతా బెనర్జీపై ప్రజల్లో తీవ్రంగా అసంతృప్తి ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. దీదీ కోటను పడగొట్టి, పశ్చిమ బెంగాల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా బీజేపీ వేసిన ఎత్తుగడలు ఫలించినట్లు కనిపిస్తున్నాయి.
మరోవైపు, దేశంలోనే అత్యంత పురాతనమైన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అటు తృణమూల్, ఇటు బీజేపీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఓటర్లు తమ తీర్పును కేవలం రెండు పార్టీల మధ్యే కేంద్రీకృతం చేయడంతో, కాంగ్రెస్ ప్రభావాన్ని కోల్పోయి చతికిలపడింది. బీజేపీ చరిత్ర సృష్టిస్తూ సీఎం పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నందీగ్రామ్ నుంచి కోల్‌కతా వరకు.. ప్రతి నియోజకవర్గంలో ఫలితం అత్యంత ఉత్కంఠను రేపుతోంది. మరికొద్ది గంటల్లో ఈ రాజకీయ యుద్ధంలో విజేత ఎవరో తేలిపోనుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు సమయంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా చేసిన ఓ పోస్ట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. నైపుణ్యం, కృషి, కరుణ వంటి మానవ విలువల ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఆయన చేసిన ఈ ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నైపుణ్యం, శ్రద్ధ, కరుణ అనేవి మన జీవితంలోని అద్భుతమైన శక్తులు. వాటితో మనం ప్రతి సవాలును అధిగమించడమే కాకుండా, మన లక్ష్యాలను కూడా సాధించగలమని ప్రధాని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “సమర్థునికి భారం ఏముంటుంది? శ్రమించేవారికి దూరం అనేది ఉంటుందా? బాగా చదువుకున్నవారికి అపరిచిత ప్రదేశం అంటూ ఏదీ ఉండదని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కీలక తరుణంలో ప్రధాని ఈ విధమైన తాత్విక సందేశం ఇవ్వడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇది కేవలం స్ఫూర్తిదాయక సందేశమని కొందరు అంటుండగా, మరికొందరు దీని వెనుక రాజకీయ సంకేతాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో, పార్టీ కార్యకర్తల కృషిని ఉద్దేశించే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ పెను తుపాను సృష్టిస్తున్నారు. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల కోటలు బద్దలవుతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకేల కంచుకోటలను చీల్చుకుంటూ ఒక కొత్త శక్తి ఉద్భవించింది. ఆయనే ఇలయ దళపతి విజయ్. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు తమిళనాట సరికొత్త అధ్యాయానికి తెరలేపుతున్నాయి. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితి.. అంటే, తమిళనాడు ‘హంగ్’ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. నిన్నమొన్నటి వరకు కేవలం వెండితెరపై మెరిసిన విజయ్, ఇప్పుడు రాజకీయ తెరపై ‘తమిళగ వెట్రి కళగం’ -TVK జెండాతో ప్రభంజనం సృష్టిస్తున్నారు.
ప్రస్తుత అధికార పక్షమైన డీఎంకేకు ఈ ఎన్నికలు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోనున్నాయి. గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన స్టాలిన్ సర్కార్‌పై ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత ఈసారి స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో డీఎంకే మూడవ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే పుంజుకున్నప్పటికీ.. విజయ్ వేగాన్ని అందుకోవడంలో వెనుకబడిపోయింది. యువత, మహిళా ఓటర్లు క్లీన్ పాలిటిక్స్ కోరుకుంటూ విజయ్ వైపు మొగ్గు చూపడం ఈ భారీ మార్పుకు ప్రధాన కారణం.
ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. మరి ఈ ‘హంగ్’ రాజకీయంలో కింగ్ మేకర్ ఎవరు? విజయ్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? లేక సంకీర్ణ రాజకీయాలకు తెరలేస్తుందా? సెయింట్ జార్జ్ కోటపై ఎగిరే జెండా ఎవరిది? తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరించబోతోంది? క్షణక్షణం మారుతున్న ఈ ఉత్కంఠభరిత పోరులో గెలుపెవరిదో తేలాలంటే మరికొద్ది సేపు వేచి చూడాల్సిందే!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్యమైన ఫలితాలు వెలువడుతున్నాయి. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ TVK పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 90కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. పార్టీ అధినేత విజయ్ మాత్రం పెరంబూర్‌లో లీడ్‌లో ఉండగా..తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. ఇక డీఎంకేను దాటి TVK ఆధిక్యంలోకి రావడంతో పాటు..అధినేత పెరంబూర్‌లో ముందంజలో కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
తొలి రౌండ్ల కౌంటింగ్, ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి రాష్ట్రవ్యాప్తంగా టీవీకే సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 90కి పైగా స్థానాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు, ఈ ఎన్నికల ఫలితాలు డీఎంకేకు కూడా గట్టి షాక్ ఇస్తున్నాయి. ఐతే ఇవి కేవలం ప్రారంభ ట్రెండ్స్ మాత్రమేనని, తుది ఫలితాలు వెలువడటానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి తొలి ఎన్నికల్లోనే విజయ్ పార్టీ సత్తా చాటడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతుంది . ప్రస్తుత లీడింగ్ చూస్తే అసోం , పుదిచ్చేరిలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనబడుతుంది .ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ తమిళ నాడులో నటుడు విజయ పార్టీ టీవీకే అనూహ్యంగా పుంజుకుంది .దింతో ప్రస్తుత ట్రెండ్ ఇలానే కొనసాగితే తమిళ నాడులో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది .మరో వైపు కేరళం లో యూడీఎఫ్ కూటమి అధికారం దిశగా పరుగులు పెడుతుంది .ఎల్ డీ ఎఫ్ మూడో సారి అధికారాన్ని చేపట్టే అవకాశం చేజారిందనే చెప్పొచ్చు .అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే ఉంది .అక్కడ తాజా లీడింగ్ చూస్తే బీజేపీ అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతుంది . మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని చోట్ల నిజమవుతుంటే కొన్ని చోట్ల అంచనాలు తప్పుతున్నాయి .
ఐదు రాష్ట్రాల భవితవ్యం తేలే సమయం వచ్చేసింది. యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. గెలుపు గుర్రాలు ఎవరో.. పీఠం ఎక్కేది ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత, ఈవీఎంల చుట్టూ త్రీ-లేయర్ ప్రొటెక్షన్.. వెరసి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోయే ఆ మహా సంగ్రామ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సురక్షితంగా, పారదర్శకంగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్నీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో శాంతిభద్రతల ఏర్పాట్లను పోలీసు పరిశీలకులు పర్యవేక్షిస్తారని తెలిపింది. ఈసీఐనెట్ ద్వారా జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డు కలిగి ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు పేర్కొంది.
ఒకటి కంటే ఎక్కువ కౌంటింగ్ హాళ్లు ఉన్న నియోజకవర్గాల్లో మొత్తం 165 మంది ఎన్నికల, 77 మంది పోలీసు పరిశీలకులను నియమించింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాఫీగా, పారదర్శకంగా సాగేందుకు అన్నీ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక తమిళనాడులో క్యాంప్ పాలిటిక్స్ మరింత హీట్ పెంచేస్తున్నాయి. టీవీకే అభ్యర్థులు చేజారకుండా అప్రమత్తమయ్యారు TVK చీఫ్ విజయ్. మహాబలిపురంలో రిసార్ట్ బుక్ చేసిన విజయ్..గెలిచిన వెంటనే అభ్యర్థులు నేరుగా రిసార్ట్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో హంగ్ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో..కౌంటింగ్‌కు ఒకరోజు ముందే రిసార్ట్ బుక్ చేశారు విజయ్. తమ అభ్యర్థులను క్యాంప్‌లకు తరలిస్తున్నారు. ఇక కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఎదురైనా ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ వింగ్‌ను కూడా అప్రమత్తం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. మరోవైపు, అధికార డీఎంకే మాత్రం తాము అతిపెద్ద పార్టీగా అవతరించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.
కేరళలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. కొట్టాయం జిల్లాలోని కిడంగూర్ మహావిష్ణు ఆలయంలో వార్షిక ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుండగా, ఒక్కసారిగా ఊహించని విషాదం చోటుచేసుకుంది. వేడుకల్లో భాగంగా అలంకరించిన ఒక ఏనుగు అకస్మాత్తుగా అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. చుట్టుపక్కల భక్తులు భయంతో పరుగులు తీస్తుండగా, ఆ గజరాజు తన కోపాన్ని వాహనాలపై చూపించింది.
అక్కడ పార్క్ చేసి ఉన్న ఒక కారును, బైకును తన తొండంతో ఎత్తి పక్కకు విసిరేసింది. చూస్తుండగానే క్షణాల్లో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని గంటల పాటు శ్రమించి ఏనుగును మచ్చిక చేసుకుని బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన మరోసారి కేరళలో ఏనుగుల వినియోగంపై పెద్ద చర్చకు దారితీసింది. ‘దేవుడి ఉత్సవాల పేరుతో మూగజీవాలను హింసించడం సరికాదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ శబ్దాలు, రద్దీగా ఉండే జనాల మధ్య ఏనుగులు ఒత్తిడికి లోనవుతాయని, అందుకే అవి ఇలా ప్రవర్తిస్తాయని వారు వాదిస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఇలాంటి వేడుకల్లో ఏనుగులను వాడటం మానేసి, వాటిని అడవుల్లో స్వేచ్ఛగా వదిలేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం సంప్రదాయం కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసం అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.