నేషనల్ హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారుల జేబులకు ఏప్రిల్ 1 నుంచి మరికొంత చిల్లు పడనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టోల్ ధరలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా – NHAI పెంచింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వార్షిక టోల్ పాస్ ధరను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 3 వేలు ఉన్న ఈ పాస్ ధర ఇప్పుడు 3 వేల 75 రూపాయలకు చేరింది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ పెంచిన ధరలు అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఈ యాన్యువల్ పాస్ సౌకర్యం కేవలం వ్యక్తిగత అవసరాల కోసం వాడే ప్రైవేట్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ఏడాది టోల్ ధరలను సమీక్షించడం సహజమేనని, ఆ ప్రక్రియలో భాగంగానే స్వల్పంగా ధరలు పెంచామని అధికారులు తెలిపారు. హైవేలపై నిత్యం ప్రయాణించే వారికి ప్రతీసారి టోల్ దగ్గర ఆగి డబ్బులు చెల్లించే ఇబ్బంది లేకుండా ఈ పాస్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఈ కొత్త రేట్ల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించాలని టోల్ ప్లాజా నిర్వహణ సంస్థలకు NHAI ఆదేశించింది.
National
ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై భారతీయుల్లో భయాందోళనలు సృష్టించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అస్సాంలోని సిల్చార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ విపక్షాలపై మండిపడ్డారు. యుద్ధం నేపథ్యంలో దేశ పౌరులపై ప్రభావం పడకుండా ఉండేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని భావించినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో అది మరోసారి విఫలమైందన్నారు. దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందన్న మోదీ… ఇలా భయాలు సృష్టించి.. తనను వేధించాలని చూస్తున్నారని మోదీ విమర్శలు చేశారు. భారతదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేని శక్తుల చేతుల్లో కాంగ్రెస్ కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. మీరు కాంగ్రెస్‌ను ఇక్కడి నుంచి ఎప్పుడో తరిమికొట్టారని మోదీ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లోనూ ప్రతి రాష్ట్రం ఆ పార్టీకి గుణపాఠం చెప్పనుందన్నారు.
ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు భారత్‌లో గ్యాస్ కష్టాలను తెచ్చిపెడతాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, పెట్రోలియం శాఖ అధికారులతో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, దేశంలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం మార్చి 8న జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. దేశంలోని రిఫైనరీలు, పెట్రోకెమికల్ సంస్థలు తమ ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆదేశించింది. పారిశ్రామిక అవసరాల కంటే గృహ వినియోగదారులకు సరఫరా చేయడానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య సంస్థలకు గ్యాస్ పంపిణీని కొంతవరకు క్రమబద్ధీకరించారు. కానీ ఆస్పత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర సేవలకు మాత్రం ఎలాంటి కోత లేకుండా నిరంతరం వాణిజ్య ఎల్పీజీ సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.
గ్యాస్ సరఫరా వ్యవస్థను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. గ్యాస్ ఏజెన్సీలు, నిల్వ కేంద్రాల వద్ద భద్రతను పెంచాలని, అక్రమ నిల్వలు చేసే వారిపై నిఘా ఉంచాలని సూచించింది. ప్రతిరోజూ గ్యాస్ సరఫరా స్థితిగతులను పర్యవేక్షించాలని డీజీపీలకు ఆదేశాలు అందాయి. అలాగే, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిని అస్సలు వదలవద్దని హోంశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ఎల్పీజీ కొరతపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. పాత వీడియోలు లేదా సంబంధం లేని ఫోటోలను పెట్టి ప్రజలను భయపెట్టే వారిపై ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని, అవగాహన కల్పించాలని కోరింది. దీనికోసం కేంద్ర హోంశాఖ, సమాచార ప్రసార శాఖ, పెట్రోలియం శాఖల సమన్వయంతో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. గ్యాస్ సరఫరాపై ఏవైనా అనుమానాలు ఉంటే రాష్ట్రాలు వెంటనే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా స్పష్టత పొందవచ్చని తెలిపింది.
వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌లో ఇంధనం కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. భారత్ లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ లోక్ సభలో ప్రకటించారు. వంటగ్యాస్ కొరతపై ఆందోళన వద్దని, సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. వంటగ్యాస్ కొరతపై లోక్ సభలో రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అమెరికా అనుమతి లేకుంటే ముటిచమురు కొనరా అని నిలదీశారు. భారత్ వ్యవహారాలను అమెరికా శాసిస్తోందని విమర్శించారు. యుద్ద సమయంలో హర్మూజ్ జలసంధి నుంచి దిగుమతులు ఆగిపోయాయని గ్యాస్ కొరతతో దేశం అల్లాడిపోతుందన్నదన్నారు.
జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది. అయినప్పటికీ ఓ దుండగుడు, డిప్యూటీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పులు జరిపాడు. అయితే అదృష్టవశాత్తు ఫరూఖ్ అబ్దుల్లాకు ఎలాంటి బుల్లెట్ తగలలేదు. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రత సిబ్బంది, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసింది మైనింగ్ వ్యాపారి కమల్ సింగ్ అని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీస్ అధికారులు. అటు ఫరూఖ్ అబ్దుల్లా కు ఎలాంటి గాయాలు కూడా జరగలేదని సమాచారం. కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి సురీందర్ కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక దీనిపై సీఎం ఒమర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. Z ప్లస్ కేటగిరి భద్రతను దాటుకొని నిందితుడు ఎలా దూసుకు వచ్చాడని సీఎం ఒమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి దయవల్ల ఫరూఖ్ అబ్దుల్లా బతికి బయటపడ్డాడని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా హత్యాయత్నం చేసిన వ్యక్తి వీడియో వైరల్ గా మారింది. దాని ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. సుమారు 13 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం, తీవ్ర గందరగోళం మధ్య తాత్కాలిక స్పీకర్ జగదాంబికా పాల్ నిర్వహించిన మూజువాణి ఓటుతో ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి 118 మంది విపక్ష ఎంపీలు మద్దతు తెలిపారు. అయితే చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్షాల ఆరోపణలను తీవ్రంగా తిప్పికొట్టారు. స్పీకర్ స్థానం అత్యంత పవిత్రమైందని, ఆయన నిర్ణయాలను సుప్రీంకోర్టులో సైతం ప్రశ్నించలేమని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో, నేటి కాంగ్రెస్ మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలే స్పీకర్లపై అవిశ్వాసం పెట్టాయని గుర్తుచేశారు. ఆ సమయంలో స్పీకర్లు చైర్లోనే కూర్చోగా, ఈసారి ఓం బిర్లా మాత్రం తీర్మానంపై నిర్ణయం వెలువడే వరకు చైర్లో కూర్చోకుండా కొత్త పార్లమెంటరీ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు.
మరోవైపు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాహుల్ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తారని, బడ్జెట్, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక చర్చల్లో పాల్గొనడానికి ఎందుకు ఇష్టపడరని ప్రశ్నించారు. సమావేశాలు వచ్చినప్పుడల్లా ఆయన విదేశీ పర్యటనలు ప్లాన్ చేసుకుంటారని.. మరి విదేశాల నుంచి ఇక్కడ మాట్లాడతారా? అంటూ అమిత్‌షా సెటైర్లు వేశారు.
దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం అంశంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాణాకు చికిత్స నిలిపివేయొచ్చని పేర్కొన్న న్యాయస్థానం.. అతడి కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. . తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ హరీశ్ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువరించింది.
దిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా 2013 ఆగస్టు 20న చండీగఢ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో ప్రమాదానికి గురయ్యాడు. నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కిందపడిపోవడంతో అతడి తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదలలేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా, అతని ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. అప్పటినుంచి అతడు కోమాలోనే ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంచి హరీశ్‌ను చూసుకుంటున్నారు. కుమారుడి చికిత్స కోసం ఆర్థికంగా, మానసికంగా చితికిపోయిన ఆ తల్లిదండ్రులు అతడి కారుణ్య మరణానికి అనుమతించాలంటూ 2024లో దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అయితే, హరీశ్ కోలుకునే అవకాశం లేదని వైద్యులు మరోసారి నివేదికలు ఇవ్వడంతో అతడి కుటుంబం మళ్లీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మెడికల్ రిపోర్ట్‌లను పరిశీలించిన కోర్టు.. హరీశ్ కేసును విచారించేందుకు అంగీకరించింది. ఈ ఏడాది జనవరి 13న అతడి తల్లిదండ్రులతో మాట్లాడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మానవీయకోణంలో మర్యాదపూర్వక చావును ప్రసాదించాలని అప్పుడు వారు కోర్టును వేడుకున్నారు. ఆ సందర్భంగా ఈ కేసులో ప్రాణాధార వైద్య చికిత్సను ఉపసంహరించే అంశాన్ని మాత్రం తాము పరిశీలిస్తామంటూ తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశీయంగా ఎల్పీజీ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గ్యాస్ నిల్వలు పక్కదారి పట్టకుండా ఉండేందుకు చమురు శుద్ధి సంస్థలపై అత్యవసర సేవల నిర్వహణ చట్టం ఎస్మా ప్రయోగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ అవసరాల దృష్ట్యా ఎల్పీజీ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని ఆయిల్ రిఫైనరీలను పెట్రోలియం శాఖ ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న నిల్వలను కేవలం డొమెస్టిక్ గ్యాస్ , ఎరువుల ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్లకే తొలి ప్రాధాన్యతగా కేటాయించాలని నిర్ణయించింది. అత్యవసర పరిస్థితుల్లో సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టింది. మరోవైపు, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కమర్షియల్ గ్యాస్ వినియోగదారులపై పిడుగులా పడింది. ఎల్పీజీ కొరత సాకుతో హోటళ్లు, రెస్టారెంట్లకు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయడంతో యజమానులు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఇప్పటికే సరఫరా నిలిచిపోయింది. దీనిపై చెన్నై హోటల్స్ అసోసియేషన్ నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. “ఆహార రంగం నిరంతర సేవలు అందించే రంగం. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, హాస్టళ్లు, రైలు ప్రయాణికులకు ఆహారం అందించడం ఇప్పుడు కష్టతరంగా మారింది. ఇప్పటికే బుక్ అయిన స్టార్ హోటల్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఈ నిర్ణయంతో కుప్పకూలే ప్రమాదం ఉంది. వెంటనే ఎల్పీజీని అత్యవసర సేవగా గుర్తించి సరఫరాను పునరుద్ధరించండి” అని వారు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.8.80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. జల్‌జీవన్ మిషన్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2028 డిసెంబర్ వరకు జల్‌జీవన్ మిషన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని మదురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దాంతో పాటు కేబినెట్ భేటీలో ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో యుద్ధం ప్రభావం భారత్‌పై ఎంత మేరకు పడుతుందన్న దానిపై చర్చించారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గురించి కూడా చర్చించారు.
ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేబినెట్ సమావేశంలో తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుపై కేంద్రం వరాల జల్లు కురిపించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో అడ్వాంటేజ్ పొందేందుకు కేంద్రం ఒకవైపు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే, మరోవైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పీఎం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. మార్చి 11న ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మరియు ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి.
నేపాల్ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రభంజనం సృష్టించింది. నేపాల్ ఎన్నికలు ఆ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేశాయి. కేవలం మూడున్నరేళ్ల క్రితం ఆవిర్భవించిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఆర్ఎస్పీ పార్లమెంట్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దశాబ్దాలుగా తమను శాసిస్తున్న హేమాహేమీలను కాదని.. నవతరం వైపు మొగ్గు చూపారు నేపాలీలు. పాత పార్టీలను తుడిచిపెట్టిన బాలెన్ షా పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్ విధానంలో 165 స్థానాలకు గాను 163 స్థానాల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ఆర్ఎస్పీ ఏకంగా 125 సీట్లలో విజయభేరి మోగించింది. మొత్తం 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రతినిధుల సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో బాలెన్ నేతృత్వంలోని ఆర్ఎస్పీ అధికారం చేపట్టనుంది.
ఈ ఎన్నికల సునామీలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా ఎందరో రాజకీయ హేమాహేమీలు ఓటమి పాలయ్యారు. ఆర్ఎస్పీ ప్రధాని అభ్యర్థి, ఖాట్మండు మాజీ మేయర్ బాలెన్ షా.. ఓలీకి కంచుకోటగా భావించే ఝాపా-5 నియోజకవర్గంలో ఆయనపై ఘనవిజయం సాధించారు. నేపాల్ పార్లమెంటరీ చరిత్రలోనే ఏ అభ్యర్థికి రానన్ని అత్యధికంగా 68,348 ఓట్లను బాలెన్ షా దక్కించుకున్నది. మరోవైపు, నేపాలీ కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా భావించిన గగన్ థాపా కూడా ఆర్ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు.ఎఫ్‌పీటీపీ విధానంలోనే కాకుండా, దామాషా ప్రాతినిధ్య పద్ధతిలోనూ ఆర్ఎస్పీ 48 శాతానికి పైగా ఓట్లతో ఆధిక్యంలో ఉంది. ఈ ట్రెండ్ కొనసాగితే, 275 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఆర్ఎస్పీ దాదాపు మూడింట రెండొంతుల మెజారిటీతో దాదాపు 184 సీట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 1991 తర్వాత ఏ ఒక్క పార్టీ కూడా ఇంతటి భారీ మెజారిటీని సాధించలేదు.ఈ చారిత్రక తీర్పుతో నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.