రాజస్థాన్‌లో భీకరగాలులు బీభత్సం సృష్టించాయి. టోంక్ జిల్లాలో ఘనంగా జరుగుతున్న ఓ సామూహిక వివాహ వేడుకపై విరుచుకుపడ్డాయి. 36 జంటల పెళ్లి కోసం ఏర్పాటు చేసిన వేదికను ..భీకర దుమ్ము తుపాను నిమిషాల్లోనే ఛిన్నాభిన్నం చేసింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ధాకడ్ కమ్యూనిటీకి చెందిన 36 జంటల కోసం ఓ బహిరంగ మైదానంలో సామూహిక వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సందడిగా ఉన్న ఆ ప్రాంతంలో.. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన గాలులు కాస్తా భయానక సుడిగాలిగా మారి వేదికపై విరుచుకుపడింది. ఈ పెనుగాలి ధాటికి వేదిక కోసం వేసిన టెంట్లు గాల్లోకి ఎగిరిపడ్డాయి. సమీపంలోని పొలాల్లోకి చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో జనం పరుగులు తీశారు. ఈ క్రమంలో టెంట్ల ఇనుప పైపులు మీద పడటంతో పలువురు మహిళలు, పిల్లలకు గాయాలయ్యాయి. దుమ్ము తుపాను అనంతరం భారీ వర్షం కురవడంతో పెళ్లి సందడి కాస్తా ఆందోళనకరంగా మారింది. ఐతే పశ్చిమ అలజడుల కారణంగా రాజస్థాన్‌లో ఇటీవల వాతావరణం అసాధారణంగా ఉంటోందని, రానున్న రోజుల్లో మరిన్ని దుమ్ము తుపానులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సామూహిక వివాహ వేడుకపై విరుచుకుపడ్డ పెనుగాలులు..
48
previous post





Total views : 61478