Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh పోలీసుల చేతకానితనం వల్లే సోషల్‌ మీడియాలో అసభ్య, అవమానకర పోస్టులు పెడుతూ పేట్రేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది…

పోలీసుల చేతకానితనం వల్లే సోషల్‌ మీడియాలో అసభ్య, అవమానకర పోస్టులు పెడుతూ పేట్రేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది…

by CVR NEWS

పోలీసుల చేతకానితనం వల్లే సోషల్‌ మీడియాలో అసభ్య, అవమానకర పోస్టులు పెడుతూ పేట్రేగిపోతున్నారని హైకోర్టు మండిపడింది. ‘2029లో మీరు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం’ అని విజయవాడలో ఫ్లెక్సీ పెట్టారంటే వారికెంత ధైర్యం ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కారణం పోలీసుల అసమర్థత కాదా అని నిలదీసింది. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా, రాష్ట్ర ప్రజలనా అంటూ ప్రశ్నించింది. ఉల్లంఘనలకు పాల్పడి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాలన్నా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాలన్నా భయపడేలా పోలీసుల చర్యలు ఉండాలంది. సామాజిక మాధ్యమాల్లో అసహ్య, అభ్యంతరకర పోస్టులను పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే 2024 తర్వాత కూడా పోస్టులు పెట్టే ధైర్యం వస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసుల తీరు ఇలా ఉంటే ఎవరు భయపడతారని పేర్కొంది. పోలీసులు నిద్రపోతున్నారు కాబట్టే.. పోస్టులు పెట్టేవాళ్లు రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించింది. ఇప్పటికే పోస్టులు పెట్టిన కేసుల్లో దర్యాప్తు సక్రమంగా పూర్తి చేసి, నిందితులను కోర్టు ముందు నిలబెడితే ఇంత ధైర్యం చేసేవాళ్లా అంటూ పోలీసులు, సీఐడీ తీరును ఎండగట్టింది.

సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ముఖ్యమంత్రిని అవమానించడం అంటే ఐదు కోట్ల మంది ఆంధ్రులను అవమానించడం కాదా అంటూ నిలదీసింది. 2020లో హైకోర్టు సిటింగ్‌ జడ్జిలపై తీవ్ర అభ్యంతరకర, ప్రతిష్ఠను దిగజార్చే పోస్టులు పెట్టారని గుర్తుచేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసినా, దర్యాప్తును సీబీఐకి అప్పగించినా ఫలితమే లేదంది. పోలీసులు, సీఐడీ, సీబీఐ ఏమీ చేయలేరనే ధైర్యంతోనే మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతున్నారని ఆగ్రహించింది. జడ్జిలపై పోస్టులు పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి పునరావృతమయ్యేది కాదని వ్యాఖ్యానించింది. మొదట్లోనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయకపోవడం పోలీసుల తప్పేనంది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టుల కేసులను డీల్‌ చేయడంలో పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇమిగ్రేషన్‌ అధికారులు తనపై జారీ చేసిన లుకౌట్‌ సర్క్యులర్‌ ని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ సోషల్‌ మీడియా పూర్వ ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఇలా తీవ్రస్థాయిలో స్పందించింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఉత్తర్వులిచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: