భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, డ్రగ్ కింగ్ పిన్..సలీం ఇస్మాయిల్ డోలా టర్కీలో అరెస్ట్ అయ్యాడు. అనంతరం అతన్ని సీబీఐ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మార్కెట్‌లో కీలక సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు సలీం ఇస్మాయిల్ డోలాను టర్కీ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. దాదాపు పదేళ్లుగా భారత ఏజెన్సీలకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఈ డ్రగ్ మాఫియా డాన్‌ను ఇస్తాంబుల్‌లో అదుపులోకి తీసుకున్నారు.
ముంబైలోని బైకుల్లా ప్రాంతానికి చెందిన సలీం డోలా, గుట్కా సరఫరా చేస్తూ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడైన చోటా షకీల్‌తో స్నేహం చేసి, నెమ్మదిగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగాడు. సలీం డోలాకు కేవలం భారత్‌లోనే కాకుండా సౌతాఫ్రికా, మెక్సికన్ కార్టెల్స్‌తోనూ సంబంధాలున్నాయి. ఏడాదికి దాదాపు 5 వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ వ్యాపారాన్ని నడుపుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అతను UAEకి చెందిన నకిలీ గుర్తింపు కార్డులతో టర్కీలో తలదాచుకుంటున్నాడు. సలీండోలాపై ఇప్పటికే ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ముంబై క్రైమ్ బ్రాంచ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB, CBI గత కొంతకాలంగా అతని కదలికలపై నిఘా ఉంచాయి. ఈ మేరకు గతేడాది సలీం డోలా కుమారుడు తాహెర్ డోలాను యూఏఈ నుంచి భారత్‌కు రప్పించడంలో భద్రతా సంస్థలు విజయం సాధించాయి. అతడి ద్వారా లభించిన సమాచారంతోనే సలీం డోలాను టర్కీలో అరెస్ట్ చేశారు. ఇవాళ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు.





Total views : 61963