ఏపీలో మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు అందిస్తున్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ తో ఎంవోయూ కుదిరింది.డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా వారానికి మూడు సార్లు రాగిజావను అందిస్తూ, పిల్లల్లో పోషకాహార స్థాయిలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.రాగిజావలో 10 గ్రాముల రాగిపిండి, 10 గ్రాముల బెల్లం పొడి కలిపి 150 మిల్లీలీటర్ల వేడి నీటిలో తయారు చేసి విద్యార్థులకు ఇస్తున్నారు. ఇది కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఈ కార్యక్రమానికి అవసరమైన రాగిపిండి, బెల్లం పొడిని ట్రస్ట్ ఉచితంగా అందిస్తుండగా.. జిల్లా కేంద్రాల నుంచి పాఠశాలలకు సరఫరా వ్యవస్థను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మొత్తం మూడు సంవత్సరాల్లో సుమారు 80 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు.ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంపై ప్రభుత్వం ఏడాదికి సుమారు 1,850 కోట్లను ఖర్చు చేస్తూ..విద్యార్థుల హాజరు, నమోదు పెంపు, డ్రాప్ అవుట్ తగ్గింపు లక్ష్యంగా పనిచేస్తోంది.
Tag:




Total views : 75363