అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్ రెండ్రోజుల చైనా పర్యటన ముగిసింది. ఒప్పంద ప్రకటనలేవీ లేకుండానే ఈ పర్యటన ముగిసింది. ఐతే కీలకాంశాల్లో ఏకాభిప్రాయాలు కుదిరాయని, ద్వైపాక్షిక సంబంధాల విషయంలో కీలక పురోగతి సాధించామని చెబుతున్నారు ట్రంప్. బోయింగ్ సంస్థ నుంచి 200 విమానాలను కొనుగోలు చేయడానికి బీజింగ్ సమ్మతించిందని వెల్లడించారు.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో శిఖరాగ్ర చర్చల్లో పాల్గొనేందుకు బీజింగ్‌కు వెళ్లిన ట్రంప్..పలుమార్లు ఆయనతో సమావేశమయ్యారు. ఇరాన్ యుద్ధం, ద్వైపాక్షిక వాణిజ్యం సహా పలు అంశాలపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపారు. రెండ్రోజుల పర్యటన ముగిసిన అనంతరం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో తిరిగి అమెరికాకు చేరుకున్నారు ట్రంప్. తన చైనా పర్యటన విజయవంతంగా ముగిసిందని వెల్లడించారు. మరోవైపు చైనా పర్యటన ముగింపు వేళ ఇరాన్ వ్యవహారంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇరాన్ విషయంలో తన సహనం నశిస్తోందని, ఆ దేశం వెంటనే ఒక ఒప్పందానికి రావాలని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. వ్యూహాత్మక జలసంధి ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ను తిరిగి తెరవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సైతం అంగీకరించారని ట్రంప్ స్పష్టం చేశారు. వాషింగ్టన్-టెహ్రాన్ మద్య ఒప్పందం కుదరాలని జిన్‌పింగ్ కూడా ఆకాంక్షిస్తున్నారన్న ట్రంప్..ఇక ఇరాన్ పనైపోయిందని..తమతో ఒప్పందం కుదుర్చుకోవడం..లేదంటే విధ్వంసానికి గురవడం రెండు ఆప్షన్సే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు.




Total views : 78908