తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం జరిగింది. రైల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు..2 బోగీలకు వ్యాపించాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ఆ బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. రాజస్థాన్లోని కోటా రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్తున్న ‘రాజధాని ఎక్స్ప్రెస్’లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక బోగీలో మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కనే ఉన్న మరో బోగీకి కూడా వేగంగా వ్యాపించాయి. దీన్ని గమనించిన లోకో పైలట్, రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి, మంటలు వ్యాపించిన ఆ రెండు బోగీలను మిగతా రైలు నుంచి వేరు చేయడంతో భారీ ప్రమాదమే తప్పింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రైల్వే అధికారులు, ప్రయాణికులు సకాలంలో స్పందించి సురక్షితంగా బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా కోటా రైల్వే సెక్షన్లో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో ఆ రూట్లో నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.




Total views : 80411