ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పొదుపు, ఇంధన పరిరక్షణ దిశగా తన నుంచే కార్యాచరణ మొదలుపెట్టారు. తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన వినియోగాన్ని పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారు. తన భద్రతా బాధ్యతలు చూసే SPGని ఉద్దేశించి, కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచాలని, అయితే దీనికోసం కొత్త వాహనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు.
ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం స్ఫూర్తితో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వంటి వారు కూడా తమ అధికారిక కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థాయిలో పొదుపు చర్యలు చేపడుతూనే, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా పెరిగిన ముడి చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రతిదానికీ దిగుమతులపై ఆధారపడితే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది అని ప్రశ్నిస్తూ, స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. అలాగే ప్రజలు తమ జీవనశైలిలో బాధ్యతాయుతమైన మార్పులు చేసుకోవాలని సూచించారు ప్రధాని మోదీ. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం కూడా దేశభక్తితో సమానమని చెబుతూ, ప్రజలు ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు వంటివి వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, వేడుకలను దేశంలోనే జరుపుకోవాలని కోరారు.





Total views : 75090