ఏపీ అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం సహకారం సాధించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో వరుస భేటీలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సీఎం… రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, జల్ జీవన్ మిషన్, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రులతోనూ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన అజెండాగా హస్తిన చంద్రబాబు బిజిబిజీగా గడిపారు.
()ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడిపారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి విశాఖపట్నం సమీపంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా చంద్రబాబు, మోదీ మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానితో సమావేశం అనంతరం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు, కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం కావడానికి అవసరమైన చర్యలపై చర్చించారు. ప్రాజెక్టుపై ఉన్న వర్క్ స్టాప్ ఆర్డర్‌ను పూర్తిగా ఎత్తివేసేలా చూడాలని చంద్రబాబు కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టును స్వయంగా సందర్శించాలని, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన ముంపు ప్రాంతాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమావేశంలో జల్ జీవన్ మిషన్ అమలు, పోలవరం–నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనల పురోగతిపై కూడా విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలని సీఎం కోరారు.
()అనంతరం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌లతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామికాభివృద్ధి, విద్యుత్ రంగం, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఒకే రోజు ప్రధాని, ముగ్గురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించడం… రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత సహకారం సాధించే దిశగా కీలక అడుగుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.