భూ చిక్కుల నుంచి రైతులకు విముక్తి కలిగిస్తామని.. టైటిల్ గ్యారంటీ దిశగా అడుగులు వేస్తామని ఆర్భాటంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ఏడాది పూర్తి చేసుకుంది. గతేడాది ఏప్రిల్ 14న ఈ ఫ్యూచరిస్టిక్ చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కానీ, ఏడాది గడిచినా భూ సమస్యలు కొలిక్కి రాలేదు సదా.. దరఖాస్తుల గుట్టలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. డ్యాష్బోర్డులు క్లియర్ అవుతున్నా.. క్షేత్రస్థాయిలో బాధితుల ఆవేదన మాత్రం అరణ్య రోదనగానే మిగిలింది. చట్టం ఉద్దేశ్యం మంచిదే అయినా, లోపభూయిష్టమైన రూల్స్ సామాన్యుడికి శాపంగా మారాయన్న చర్చ రెవెన్యూ వర్గాల్లో మొదలైంది.
అధికార వికేంద్రీకరణ జరగాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదే పదే హెచ్చరిస్తున్నా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. చిన్నపాటి గుంట భూమి వివాదం కూడా కలెక్టర్ స్థాయికి చేరాల్సిందేనా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సెక్షన్ 4, షెడ్యూల్-ఏ మార్చకపోవడంతో తహశీల్దార్లకు అధికారాలు లేవు.. కలెక్టర్లకు తీరిక లేదు. కింది స్థాయి అధికారులకు పవర్స్ ఇవ్వకుండా, పాత పద్ధతిలోనే ఫైళ్లను పెండింగ్లో ఉంచడం వెనుక ఆంతర్యం ఏమిటో అధికారులకే తెలియాలి. ఫలితంగా సామాన్య రైతు ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతూనే ఉన్నాడు.