హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బీజేపీయే అన్నారు. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని, కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతోందన్నారు.
Brs
రైతుబంధు ఆపేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించడంపై అదే ఎక్స్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్కు రైతులపై అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతు బంధు, పెన్షన్, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు… నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు… నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు… నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు… నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే…’ అని రేవంత్ పేర్కొన్నారు. నీలాంటి వాడిని చూసే… ‘నిజం చెప్పులు తొడుక్కునే లోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది’ అనే సామెత పుట్టిందని విమర్శించారు. కేటీఆర్, బీఆర్ఎస్ తమ డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని సూచించారు. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని వ్యాఖ్యానించారు.
కొండగల్ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారని, కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందంటూ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ కు, కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదని బీఆర్ఎఐస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇపుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా? అని మాట్లాడుతున్నారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తంలో 24గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిగిందన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 60లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోందన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి తెరాస కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాత వెనక్కితగ్గారన్నారు. రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించా అని సీఎం కేసీఆర్ వివరించారు.
నేడు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా వెళ్లనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెరువులో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. జిల్లాలోనే తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడం.. పోరుబిడ్డ, సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసమీకరణపై దృష్టి సారించిన పాలేరు ఎమ్మెల్యే, అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాళ.. సీఎం సభకు ప్రజలు, లబ్ధిదారులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ తొలి సభ నిర్వహిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
నవంబర్ 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బాగంగా బీఆర్ ఎస్ విసతృత ప్రచారం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా మునుగోడులో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భారీ జన సమీకరణకు బీఆర్ ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బదులు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నారు. ఎటువంటి అవాంచానియ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు.
అవసరమైన సమయంలో విద్యుత్ సరాఫరా చేయడం లేదని, కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ కర్ణాటకలోని కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానికంగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్‌కు ట్రాక్టర్లో ఓ మొసలిని తీసుకొచ్చారు. కరెంట్ ఇస్తారా?.. సబ్ స్టేషన్లో మొసలిని వదలాలా? అంటూ సిబ్బందిని రైతులు ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా, ఈ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో’ అంటూ కాంగ్రెస్ సర్కారుపై సెటైర్లు సంధించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు కలిసి చెరుకు సుధాకర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో 1,34,000 ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని కేటీఆర్ వివరించారు. మిగిలిన 90వేల నియామకాలు వివిద దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తే.. తాము 13వేలు ఇచ్చామని వెల్లడించారు. భారాస 30 వైద్య కళాశాలలు పెట్టిందని గుర్తు చేశారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు.. ఇలా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో.. మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఏ మాత్రం పోటీ కాదని, రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతలు ఏమాత్రం సరితూగరని విమర్శించారు. కర్ణాటకలో 5గంటల కరెంటు కోత వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఒకే పంటను పరిమితి మేరకు కొనుగోలు చేస్తారని, వాళ్లు మాకు సుద్దులు చెబుతారా? అని విమర్శించారు. గతంలో ఖమ్మంలో తమకు నేతలు నిండుగా ఉన్నా… ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నారు. ఈసారి కొందరు నేతలు వెళ్లారు.. సీట్లు పెరుగుతాయని అనుకుంటున్నాం. మణికొండ, మక్తల్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని కేటీఆర్ విమర్శించారు.



Total views : 92147