దేశ అంతర్గత భద్రతను కాపాడటంలో సీఆర్పీఎఫ్ బలగాలు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి సీఆర్పీఎఫ్ కేంద్రంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆఫీసర్స్ మెస్, సబార్డినేట్ ఆఫీసర్స్ మెస్, రిక్రియేషన్ క్లబ్, స్టోర్ బ్లాక్, ట్రేడ్స్‌మెన్ బ్లాక్ భవన సముదాయాలను కేంద్ర మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్ల వల్లే దేశం సురక్షితంగా ఉందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సార్వభౌమత్వ పరిరక్షణ కోసం 24 గంటలూ విధులు నిర్వహిస్తున్న జవాన్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
అంతకుమందు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ సభ్యుడు భానుప్రకాశ్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో కలికిరిలోని సీఆర్పీఎఫ్ కేంద్రానికి చేరుకున్న కేంద్ర మంత్రి తొలుత అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
వీటిలో 9.47 కోట్ల రూపాయలతో ఆఫీసర్స్ మెస్, 7.90 కోట్ల రూపాయలతో సబార్డినేట్ ఆఫీసర్స్ మెస్, 4.90 కోట్లతో రిక్రియేషన్ క్లబ్, రూ.4.55 కోట్లతో స్టోర్ బ్లాక్ నిర్మించారు. ఈ ఆధునిక మౌలిక వసతులు సీఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు వారి విధి నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నాయి.ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులకు అందుతున్న సౌకర్యాలపై కేంద్ర మంత్రి ఆరా తీశారు. కొత్తగా నిర్మించిన భవనాలను పరిశీలించి వాటి వినియోగం, నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Tag: