గుజరాత్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వందలాది కార్లు, బైకులు వరదనీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో అయిదుగురు మృతిచెందారు. మరోవైపు.. నవ్సారి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకున్న 60 మంది రొయ్యల పెంపకందారులను కాపాడినట్లు తీర రక్షక దళం ప్రకటించింది. గడచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 400 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఇదిలా ఉంటే.. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఢిల్లీ, యూపీ, బీహార్, గుజరాత్ సహా 17 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అనేక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గుజరాత్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాళ బీహార్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలై 25, 27 తేదీల మధ్య అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉంది. జూలై 27, 29 తేదీలలో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో చాలా నదులు, వాగులలో నీటిమట్టం పెరిగి, వరదల ముప్పు ఏర్పడింది.