ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా-ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా నౌకాదళ దిగ్బంధనం తొలిగే కొద్దీ.. క్రమంగా హర్మూజ్‌ను తెరవాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.రానున్న కొన్ని గంటల్లో జలసంధిలో చిక్కుకున్న నౌకలను విడుదల చేయనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదురుతుందని, చర్చలు బాగా జరిగాయని, యుద్ధం త్వరగా ముగుస్తుందని ట్రంప్ ఇప్పటికే ఆశాభావం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత హర్మూజ్‌లో నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ పరిణామం త్వరలో సమసిపోయే అవకాశాలున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
హర్మూజ్ జలసంధి లో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా తరలించేందుకు చేపట్టిన నావికాదళ ఆపరేషన్‌ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. తమ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు సౌదీఅరేబియా ప్రభుత్వం నిరాకరించడంతోనే అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నౌకలను సురక్షితంగా తరలించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రకటించడం సౌదీతో సహా గల్ఫ్ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అమెరికా- ఇరాన్ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు పాక్ చేస్తున్న దౌత్య ప్రయత్నాలకు మాత్రం పూర్తి మద్దతిస్తున్నట్లు సౌదీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. ట్రంప్ ప్రణాళిక గురించి తమ మిత్ర దేశాలకు ముందుగానే సమాచారం ఇచ్చినట్లు వైట్‌హౌస్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, ట్రంప్ ప్రకటన తర్వాతే ఈ విషయం తమకు తెలిసిందని పశ్చిమాసియా దౌత్యవేత్త వ్యాఖ్యానించారు. ఉద్రిక్తతల సమయంలో పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులు అమెరికాకు గణనీయమైన నష్టాన్ని కలిగించినట్లు తెలుస్తోంది. ఇరాన్ వర్గాలు విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయం ధ్రువీకరించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాల్లో 217 నిర్మాణాలు, 11 పరికరాలు దెబ్బతిన్నాయి. ఇందులో హ్యాంగర్లు, బ్యారక్‌లు, ఇంధన డిపోలు, విమానాలు, కీలకమైన రాడర్ వ్యవస్థలు ఉన్నాయి. ఇరాన్ దాడులు అత్యంత కచ్చితత్వంతో జరిగినట్లు కన్పిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు.
Tag:





Total views : 75182