ఇరాన్ పై అమెరికా మళ్లీ కన్నేర్ర చేసింది. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలమీద హౌతి మిలిటెంట్ల దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా ఆరోపించింది. నౌకల మీద దాడి చేసేందుకుగాను హౌతీ తిరుగుబాటుదారులకు అవసరమైన డ్రోన్లు, మిసైళ్లు, ఇంటెజెన్స్ సమాచారాన్ని ఇరాన్ అందిస్తోందని అమెరికా తెలిపింది. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద జరుగుతున్న దాడి వెనుక ఇరాన్ ప్రముఖ పాత్ర వహిస్తుందని మాకు తెలుసు. అక్కడ అనిశ్చితి రేపేందుకు ఇరాన్ ఎప్పటినుంచో హౌతి రెబెల్స్ కు సహాకారిస్తోంది. స్పష్ట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగాఈ ఆరోపణలు చేస్తున్నాం అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సల్ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. పాలస్తీనాకు మద్దతుగా యెమెన్ కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలోని కీలక షిప్పింగ్ లైన్స్ల్ లో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. నౌకలపై హౌతీ దాడులను అడ్డుకునేందుకుగాను 10 దేశాలతో కలిసి అమెరికా ఇటీవలే ఒక కూటమిని ఏర్పాటు చేసింది.
international news
ఉత్తరకొరియాను అణుదాడితో రెచ్చగొడితే తాము అణుబాంబు ప్రయోగానికి వెనకాడబోమని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా హెచ్చరించారు. గురువారం మిసైల్ బ్యూరో ఆధ్వర్యంలో ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ క్షిపణి ప్రయోగం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్..డ్రిల్‌కు హాజరైన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అణుదాడి హెచ్చరికలు చేసినట్టు ఉత్తరకొరియా వార్తా సంస్థ కేసీఎన్ఏ ఓ కథనాన్ని ప్రచురించింది. ప్రత్యర్థి అణుబాంబులతో రెచ్చగొడితే సంకోచించకుండా అణు బాంబు ప్రయోగించాలని మిసైల్ బ్యూరోకు కిమ్ సూచించినట్టు కేసీఎన్ఏ పేర్కొంది. చర్చల్లో బేషరతుగా పాల్గొనాలంటూ దక్షిణ కొరియా, దాని మిత్రదేశాలు కిమ్‌ను కోరిన నేపథ్యంలో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది. గతవారం వాషింగ్టన్ డీసీలో అమెరికా, దక్షిణకొరియా మధ్య కీలక సమావేశం జరిగింది. ఉత్తరకొరియాతో యుద్ధం తలెత్తే పక్షంలో అణుబాంబు ప్రయోగ నివారణకు ఏం చేయాలనే దానిపై ఈ మీటింగ్‌లో చర్చ జరిగింది. కాగా, ఉత్తరకొరియా తమపై అణ్వస్త్రాలు ప్రయోగిస్తే కిమ్ పాలన అంతమైపోతుందంటూ ఉభయ దేశాలూ సమావేశం అనంతరం ఘాటు వ్యాఖ్యలు చేశాయి. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా శాంతి చర్చల్లో పాల్గొనాలని కిమ్‌కు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధ్యక్షుడి హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో రాష్ట్రం నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ పై ట్రంప్ మద్దతుదారుల దాడి నేపథ్యంలో ఆయనపై నిషేధం విధించింది. అమెరికా రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం దేశాధ్యక్ష పదవిని చేపట్టేందుకు ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది. ఇలాంటి తీర్పును ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. అయితే ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ట్రంప్ కు కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చింది. కొలరాడో కోర్టు తీర్పు ప్రభావం వచ్చే ఏడాది మార్చ్ 5న జరగనున్న కొలరాడో రిపబ్లికన్స్ ప్రైమరీ బ్యాలట్ పై మాత్రమే కాకుండా నవంబర్ 5న జరిగే ఎన్నికలపై కూడా తీవ్రంగా ఉండబోతోంది.
గాజాలో అతిభారీ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. సరిహద్దు వద్ద ఎరెజ్ క్రాసింగ్‌కు 400 మీటర్ల దూరంలో దీన్ని గుర్తించినట్టు వెల్లడించింది. చిన్న వాహనాలు సునాయసంగా ప్రయాణించేంత పెద్దదిగా ఈ సొరంగం ఉందని వివరించింది. ఈ సొరంగం నిర్మాణానికి కొన్నేళ్లు పట్టి ఉండొచ్చని, భారీగా నిధులు ఖర్చైఉండొచ్చని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి, హమాస్ చీఫ్ సోదరుడు మహ్మద్ యాహ్యా ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించినట్టు సైన్యం వెల్లడించింది. సొరంగంలోని గోడలు కాంక్ట్రీట్‌తో చేశారని, నేలమాత్రం మట్టితో సిద్ధం చేశారని పేర్కొంది. ఈ సొరంగం తాలూకు వీడియోను కూడా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. సొరంగంలో భారీ ఎత్తున ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.
పరారీలో ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. విషప్రయోగం కారణంగా అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. సంబంధిత ఆసుపత్రిలో గట్టి నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి, భారత్ మోస్ట్ వాంటెడ్ డాన్ దావూద్ ఇబ్రహీం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్‌లో ఉంటున్నాడు. ముంబై దాడుల్లో 250 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల ప్రణాళిక, అమలులో అతని ప్రమేయం ఉందన్న ఆరోపణలలో భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకడిగా దావూద్ ఉన్నాడు. 2008లో 26/11 ఉగ్రదాడుల సమయంలో 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులకు దావూద్ ముంబైలో ఉన్న తన నెట్వర్క్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కరాచీలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడని భారత్ సాక్ష్యాలను సమర్పించినప్పటికీ అతనికి తాము ఆశ్రయం ఇవ్వలేదని పాక్ తిరస్కరిస్తూ వస్తోంది. ముంబై పోలీసులు దావూద్ ఆసుపత్రిలో చేరడంపై అతని బంధువులు అలీషా పార్కర్ , సాజిద్ వాగ్లే నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు యత్నిస్తున్నారు. అతను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని సోదరి హసీనా పార్కర్ కుమారుడు ఎన్ఐఏకి వివరించాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మనీలాండరింగ్, దోపిడీ, ఆయుధాల స్మగ్లింగ్ వంటి నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడు. అతన్ని చంపితే 25 మిలియన్ డాలర్లు ఇస్తామని గతంలో భారత్ ప్రకటించింది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో కూడా అతనికి సంబంధాలు ఉన్నాయి.
జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో చైనా తాజాగా స్పందించింది. లడఖ్ తమదేనని మరోసారి ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దుకు పశ్చిమాన ఉన్న ప్రాంతం ఎప్పటికీ చైనా భూభాగమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మేము ఎప్పుడూ గుర్తించలేదు. ఏకపక్షంగా, చట్టవ్యతిరేకంగా భారత్ ఈ ప్రకటన చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ కోర్టు ఇచ్చిన అంతర్గత తీర్పు వాస్తవాన్ని మార్చదని చైనా రాయబారి వ్యాఖ్యానించారు. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును చైనా 2019లోనూ వ్యతిరేకించింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు ఆమోదయోగ్యం కాదని అప్పట్లోనే తేల్చి చెప్పింది.
Read Also..
Read Also..
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో బహిరంగ విమర్శలకు దిగడంపై తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. భారత్ మరోసారి ఇలాంటి చర్యలకు దిగకుండా బహిరంగంగా ఆరోపణలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. హర్దీప్ సింగ్ హత్య వెనక భారత ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా పార్లమెంట్ వేదికగా జస్టిన్ ట్రూడో ఆరోపించడం కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. కెనడా ఆరోపణలు అర్థరహితమంటూ భారత్ మండిపడింది. ఓ దశలో భారతలోని కెనడా దౌత్యవేత్తలను కేంద్రం వెనక్కు పంపించేసింది. కెనడా వీసాల జారీని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. నిజ్జర్ హత్య తరువాత కెనడావాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. దేశవాసుల భద్రత కోసం భారత్‌కు అదనంగా మరో అడ్డుకట్ట వేసేందుకు బహిరంగ ఆరోపణలు చేయాల్సి వచ్చిందన్నారు. అంతకుమునుపే భారత్‌తో దౌత్యపరమైన చర్యలు జరిగాయని ఆయన చెప్పుకొచ్చారు. కెనడా తన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదని భారత విదేశాంగ శాఖ మంత్రి గత వారం రాజ్యసభలో పేర్కొన్నారు.
Read Also..
ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు భూతల దాడులు మొదలైనప్పటి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. మరో వైపు అంతర్జాతీయ సమాజం క్రమంగా విచక్షణా రహిత దాడులను నిరసిస్తూ దూరమవుతోంది. ఈ ఘటనలు ఆ దేశానికి మింగుడు పడనివే. గాజాపై వైమానిక దాడుల విషయంలో ఇజ్రాయెల్ ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టిగానే హెచ్చరించారు. పౌర మరణాలను తగ్గించకపోతే ప్రపంచ దేశాల మద్ధతు కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. మరోచోట ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 115 మంది ఇజ్రాయెల్ సైనికులు యుద్ధంలో మరణించారు.
బీజాపూర్ మావోయిస్టు పార్టీ PLGA వారోత్సవాల వేడుకలు వీడియోలను మావోయిస్టులు విడుదల చేశారు. బీజాపూర్ -సుక్మా సరిహద్దుల్లో మావోయిస్టులు ఘనంగా వారోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన యువతతో పాటు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాలస్తీనాకు మద్దతుగా భారత్, అమెరికా సహా మూడు దేశాల ప్రధాన మంత్రుల దిష్టిబొమ్మలను మావోయిస్టులు దగ్ధం చేశారు. గత 11 నెలల్లో తమ సంస్థ పొలిట్‌బ్యూరో సభ్యుడు కట్కం సుదర్శన్‌తో సహా మొత్తం 54 మంది నక్సలైట్లు హతమయ్యారు వెల్లడించారు.
దేశంలోకి వలసల పెరుగుదలను అరికట్టేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇకపై విద్యార్థులు, తక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు జారీ చేసే వీసాల నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. మారిన నిబంధనల ప్రకారం… ఆస్ట్రేలియాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్య పరీక్షల్లో అత్యధిక రేటింగ్ సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆస్ట్రేలియాలో ఎక్కువ కాలం ఉండేందుకు ఉపకరించే రెండో వీసా దరఖాస్తును ఇకపై మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. దరఖాస్తులో చిన్న లోపం ఉన్నా, సంబంధిత పత్రాల్లో ఏ కొంచెం తేడా ఉన్నా వీసా నిరాకరించే అవకాశం ఉంటుంది. దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తమ నూతన వలస విధానాన్ని ఐదు అంశాల ఆధారంగా రూపొందించామని వెల్లడించింది. ఆస్ట్రేలియన్ల జీవన ప్రమాణాలను పెంపొందించడం, సుహృద్భావ పని వాతావరణం కల్పించడం, అంతర్జాతీయ సంబంధాలు బలోపేతం చేసుకోవడం వీటిలో ముఖ్యమైనవని తెలిపింది. ఇప్పటికే ఓ మోస్తరు నైపుణ్యాలతో ఆస్ట్రేలియాలో నెట్టుకొస్తున్న విదేశీయులకు కూడా ఈ వీసా నిబంధనలు ఇబ్బందిగా మారనున్నాయి. కొత్త వీసాలు మంజూరు చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే తక్కువ నైపుణ్యాలు కలిగినవారి తాత్కాలిక వీసాలు సమీక్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.





Total views : 90068