పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు భారీ ఊరట లభించింది. రెండు కేసుల్లో ఆయనను నిర్దోషిగా పేర్కొంటూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2018లో ఈ రెండు కేసుల్లో నవాజ్ షరీఫ్ ను అవినీతి నిరోధక కోర్టు దోషిగా పేర్కొంది. అవెన్ ఫీల్డ్ స్థిరాస్తుల కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం, అల్ అజీజియా ఉక్కు పరిశ్రమ కేసులో ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, అనారోగ్యానికి చికిత్స చేయించుకోవాలంటూ 2019లో లండన్ వెళ్లిన నవాజ్ షరీఫ్ అక్కడే ఉండిపోయారు. నాలుగేళ్ల పాటు లండన్ లో ప్రవాసం గడిపిన ఆయన స్వయం ప్రకటిత ప్రవాసం నుంచి ఇటీవలే బయటికి వచ్చారు. అక్టోబరులో పాక్ గడ్డపై అడుగుపెట్టారు. త్వరలో పాకిస్థాన్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యంగా సంతరించుకుంది. షరీఫ్ తిరిగి రావడంతో ఆయన సొంత పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో పీఎంఎల్-ఎన్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
international news
అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో ఎనిమిది మంది సైనిక సిబ్బంది ఉన్నారు. జపాన్‌లోని యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని జపాన్ కోస్ట్ గార్డ్ ధ్రువీకరించింది. అయితే, అందులో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియరాలేదు. జపాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.47 గంటల సమయంలో ఓ విమానం కుప్పకూలినట్లు యకుషిమాకు చెందిన మత్స్యకారులు గుర్తించారు. వెంటనే వారు స్థానిక కోస్ట్‌గార్డ్‌కు సమాచారం అందించారు. దీంతో తక్షణమే స్పందించిన సహాయ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొన్నాయి. విమానం ఎడమ ఇంజిన్ మండిపోతూ సముద్రంలో పడిపోయిందని అక్కడి మీడియాకు స్థానికులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై అమెరికా సాయుధ బలగాల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
మరో వైపు ఓస్ప్రే అనేది అమెరికా సైన్యానికి చెందిన ప్రత్యేకమైన విమానం. ఇది హెలికాప్టర్‌గా, విమానంగానూ పనిచేస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో కూడా అమెరికా మెరైన్ విభాగానికి చెందిన రెండు ఓస్ప్రే విమానాలు డార్విన్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలోని తివి ద్వీపానికి బయల్దేరాయి. వీటిల్లో ఒకటి కూలిపోయింది. ఇప్పటికే ఈ రకం విమానాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. 2022లో ఈ రకం విమానం కూలి ఐదుగురు సైనిక సిబ్బంది చనిపోయారు. అదే ఏడాది నాటో శిక్షణ సమయంలో నార్వేలో మరొకటి కూలిపోయింది. ఆ ఘటనలో నలుగురు సిబ్బంది చనిపోయారు. 2017లో కూడా రెండు కూలిపోయాయి. 2000వ సంవత్సరం నుంచి దాదాపు 12 విమానాలు కూలిపోయాయి.
రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియాపై తుఫాన్ విరుచుకుపడింది. నల్ల సముద్రంలో ఏర్పడిన పెను తుపాను క్రిమియాను అతలాకుతలం చేసింది. 20 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం పడింది. నలుగురు మృతి చెందగా, భారీగా ఆస్తినష్టం సంభవించింది. రష్యా దక్షిణ భాగంలోని సోచీలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. తుఫాన్ కారణంగా గంటకు 144 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దాంతో చాలా ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. గత 16 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన తుపాను ఎప్పుడూ రాలేదని అధికార వర్గాలు అంటున్నాయి. సెవస్తపోల్ లో ఉన్న అరుదైన జలచరాలతో కూడిన ఆక్వేరియం తుపాను ధాటికి ధ్వంసమైంది. దాంతో, ఎన్నో అరుదైన చేపలు మృత్యువాతపడ్డాయి. అటు, ఉక్రెయిన్ కూడా ఈ తుపాను ప్రభావానికి గురైంది. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో ఉక్రెయిన్ లో 2 వేల పట్టణాలు అంధకారంలో చిక్కుకున్నాయి.
గూఢచర్య ఉపగ్రహ ప్రయోగాన్ని ఉత్తర కొరియా విజయవంతంగా పూర్తి చేసింది. మలిగ్యాంగ్-1 రాకెట్ ద్వారా దీన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్వయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ దగ్గరుండి ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. స్పై శాటిలైట్ కక్ష్యలోకి చేరిన తర్వాత.. అమెరికాలోని గువామ్‌లో ఉన్న సైనిక స్థావరాలను ఫొటోలను ఉత్తర కొరియా ఆర్మీకి పంపించింది. ఈ ఉపగ్రహం జపాన్‌లోని ఒకినావా ద్వీపం మీదుగా పసిఫిక్ మహాసముద్రం వైపునకు వెళ్లింది. ఈ ప్రయోగం నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. ఒకినావా ప్రాంతంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఈ ప్రయోగంతో ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది. దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలలోని సైనిక స్థావరాలను ట్రాక్ చేసే లక్ష్యంతో ఈ గూఢచర్య ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా ప్రయోగించింది. ఈ ఏడాదిలో ఇంతకుముందు రెండుసార్లు గూఢచర్య ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా ప్రయోగించగా అది కక్ష్యలోకి చేరలేకపోయింది. ఈసారి మాత్రం ప్రయోగం సక్సెస్ అయింది.
అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డిన్నర్స్ జోరందుకున్నాయి. ఈ సందర్భంగా అమెరికాలోని నోర్‌ఫోక్స్ నేవీ స్థావరంలో మిలటరీ సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు జోబైడెన్ ‘ఫ్రెండ్స్ గివింగ్’ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడే స్వయంగా వడ్డించారు. ఆయన తన సతీమణి జిల్‌తో కలిసి ఆహార కౌంటర్లోకి వచ్చారు. ఈ విందులో బైడెన్ మాష్డ్ పొటాటోను వడ్డించగా జిల్ స్వీట్ పొటాటో కాసెరోల్స్ను అతిథులకు తినిపించారు. ఈ విందుకు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు అయిన ఐసన్ హోవర్, గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సిబ్బంది, వారి కుటుంబాలు హాజరయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు నౌకలను ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల నేపథ్యంలో మధ్యధరా సముద్రంలో మోహరించారు. ఈ ఆపరేషన్‌కు మీరు వెన్నెముకని మీ కుటుంబ సభ్యులు దీనికి గుండెవంటి వారని బైడెన్ వ్యాఖ్యానించారు. నేడు బైడెన్ 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా జోబైడెన్ రికార్డు సృష్టించారు.
భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఎగరేసుకెళ్లింది. అలా ఇలా కాదు టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి, ఆ తర్వాత వరుస విజయాలు సాధించి, ఆఫ్ఘన్ వంటి జట్టుపై అద్భుత రీతిలో పోరాడి, సెమీస్ లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి ఫైనల్ చేరిన ఆసీస్ జట్టు ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ ను ఒడిసిపట్టింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కంగారూలు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి 6 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించారు. తొలుత టీమిండియాను 240 పరుగులకు పరిమితం చేసిన ఆస్ట్రేలియన్లు 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించారు. తద్వారా రికార్డు స్థాయిలో 6వ ప్రపంచకప్ టైటిల్ ను సాధించారు. ఆసీస్ విజయంలో బౌలర్లు, ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రధాన పాత్ర పోషించారు. బౌలర్లు స్టార్క్, హేజెల్ వుడ్ కెప్టెన్ కమిన్స్ విశేషంగా రాణించి టీమిండియాను 240 పరుగులకు ఆలౌట్ చేయగా 241 పరుగుల లక్ష్యఛేదనలో ట్రావిస్ హెడ్ చిరస్మరణీయ సెంచరీతో అదరగొట్టాడు. హెడ్ కు లబుషేన్ తోడవడంతో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు టీమిండియా విఫలయత్నాలు చేసింది. కానీ కొరకరానికొయ్యల్లా మారిన ఈ ఇద్దరు బ్యాటర్లు ఆతిథ్య జట్టుకు విజయాన్ని దూరం చేశారు. హెడ్ 137 పరుగులు చేయగా, లబుషేన్ 58 పరుగులతోనూ అజేయంగా నిలిచారు. హెడ్ 120 బంతులాడి 15 ఫోర్లు, 4 సిక్సులు కొట్టాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, షమీ 1, సిరాజ్ 1 వికెట్ తీశారు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి టీమిండియా నేడు ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ భావిస్తే ఆస్ట్రేలియా జట్టు తాను అంచనాలకు అందే జట్టును కాదంటూ వరల్డ్ కప్-2023 విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా గతంలో 1987, 1999, 2003, 2015లోనూ వన్డే వరల్డ్ కప్ టైటిళ్లు నెగ్గింది.
యుద్ధం ముగిసిన తర్వాత గాజా ప్రాంతం అధికార పగ్గాలను వెస్ట్‌బ్యాంక్‌ను పాలించే పాలస్తీనా అథారిటీయే చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అంతిమంగా రెండు దేశాల ఏర్పాటుతో ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణకు తెరపడాలని ఆయన ఆకాంక్షించారు. గాజా నుంచి పాలస్తీనావాసులను బలవంతంగా పంపించకూడదని ఇజ్రాయెల్‌కు బైడెన్ సూచించారు. గాజాలో మళ్లీ ఇజ్రాయెల్ ఆర్మీ ఆక్రమణలు చేయకూడదని తేల్చి చెప్పారు. ‘ది వాషింగ్టన్ పోస్టు’కు రాసిన ప్రత్యేక కాలమ్‌లో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనా పౌరులపై దాడులు చేస్తున్న ఇజ్రాయెలీ అతివాదులకు అమెరికా వీసాలను ఇవ్వబోమని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. సాధారణ పౌరులను ఇబ్బందిపెడుతున్న ఇలాంటి వారిని గుర్తించి, తగిన మూల్యం చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని ఇజ్రాయెల్‌ను బైడెన్ కోరారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వాదన ఇంకోలా ఉంది. ‘‘పాలస్తీనా అథారిటీకి గాజాను పాలించే సామర్థ్యం లేదు అనీ యావత్ గాజా సైనిక రక్షణ బాధ్యతలను ఇజ్రాయెల్ చూస్తుందన్నారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ఏరియాలో సైన్యం దాడులు, ఇజ్రాయెలీ సెటిలర్ల హింస కారణంగా గత రెండు వారాల్లో 200 మంది పాలస్తీనియన్లు చనిపోయిన నేపథ్యంలో బైడెన్ పై ప్రకటనను విడుదల చేశారు.
ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత పడిపోయి నిత్యం అల్లాడిపోయే దేశ రాజధాని ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు స్విస్ గ్రూప్ ‘ఐక్యూ ఎయిర్’ నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఈ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో రియల్ టైం గాలి నాణ్యత ఈ ఉదయం 7.30 గంటలకు ఏక్యూఐ 483గా ఉంది. రెండో స్థానంలో పాకిస్థాన్‌లోని లాహోర్ ఉండగా, కోల్‌కతా మూడో స్థానంలో, ముంబై ఆరో స్థానంలోను ఉన్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, పాకిస్థాన్‌లోని కరాచీ నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. చైనాలోని షెన్యాంగ్ , హాంగ్జౌ , కువైట్‌లోని కువైట్ సిటీ, చైనాలోని వుహాన్ వరుసగా 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.
హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది. భారత్‌లో జరిగిన జీ-20 సదస్సులో భారత్-పశ్చిమాసియా- ఐరోపా ఆర్థిక నడవా నిర్మించాలని నిర్ణయించడమే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు కారణం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ఆరోపించారు. తాజాగా దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. అమెరికా జాతీయ భద్రతా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వివరణ ఇచ్చారు. బైడెన్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. ”మీరు బైడెన్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నానన్నారు. ఇజ్రాయెల్-సౌదీ అరేబియా దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని ఆయన విశ్వసిస్తున్నారని వెల్లడించారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాల్లో ముఖ్యమైన అడుగని భావిస్తున్నారని తెలిపారు. ఇదే హమాస్ దాడుల్ని ప్రేరేపించి ఉండొచ్చనే అభిప్రాయాన్ని ఈ మాటలనే తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నానని కిర్బీ వెల్లడించారు.
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ షాంఘైలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 12.10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం జీ జిన్‌పింగ్‌తో పోటీ పడ్డారు. చివరికి ఆయన నంబర్-2 స్థానంతో సరిపెట్టుకున్నారు. 2013 నుంచి 2023 వరకు ప్రధానిగా పనిచేశారు. చైనా ఆర్థిక వ్యవస్థను ఆయన సమర్థంగా నిర్వహించారనే పేరుంది.




Total views : 89974