దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పది రోజుల కిందట రోజుకు పదీ ఇరవై లోపు నమోదైన కేసులు తాజాగా వందల్లోకి చేరాయి. వారం కిందట మొత్తం బాధితుల సంఖ్య వందల్లో ఉండగా నేడు అది వేలల్లోకి చేరింది. మొన్న 350 నిన్న 640 గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య శనివారానికి 752 కు చేరింది. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420 కాగా ఇందులో ఎక్కువ శాతం కేరళలోనే నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే, ముందుజాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఇప్పటికే అలర్ట్ చేసినట్లు తెలిపింది. వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు. నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు. యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని, వైరస్ బాధితులలో 2,872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు. గోవాలోనూ జేఎన్.1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు.
Kerala
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతిచెందగా మరో 64 మంది గాయపడ్డారు. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన టెక్ ఫెస్ట్ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి పాసులున్న వారినే అనుమతించారు. అయితే, అకస్మాత్తుగా వర్షం మొదలవడంతో వేదిక బయటున్న వారు లోపలికి రావడంతో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. గాయపడిన వారికి కాలామస్సేరి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో వివిధ శాఖల మంత్రుల అత్యవసర సమావేశం జరిగింది. ఘటనపై మంత్రివర్గం విచారం వ్యక్తంచేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేసింది.
గత కొన్ని రోజులుగా కేరళ , తమిళనాడు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. తమిళనాడులోని చెన్నై, తూత్తుకుడి, నీలగిరి, తిరుచ్చిరపల్లి, తిరునెల్వేలి, కన్యాకుమారి, తెన్కాసి, పుదుకోట్టై, విరుదునగర్, తేని సహా పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం పడుతోంది. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగం విద్యా సంస్థలకు ముందుగానే సెలవు ప్రకటించింది. ఇక చెన్నైలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులన్నీ నీటమునిగాయి. దీంతో ఓ సబ్వేలో బస్సు చిక్కుకుపోయింది. పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. కేరళలోనూ భారీ వర్షం కురుస్తోంది. పతనంతిట్ట, తిరువనంతపురం జిల్లాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రానున్న రోజుల్లో పతనంతిట్టతోపాటు మరో రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు భారీ వర్షం కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల వెళ్లే రహదారిపై కొండచరిలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు సుప్రీంకోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లులకు ఆమోదం తెలపకుండా తమిళనాడు గవర్నర్ మూడేళ్లుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మరోవైపు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బిల్లుల ఆమోదానికి జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని నోటీసుల్లో ఆదేశించింది. కేరళ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించిన వివరాలను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. గత 21 నెలలుగా ఎనిమిది బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని తెలిపారు.
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు ఫ్యాన్సీ నెంబర్లు కావాలంటే ఆన్లైన్లో సులభంగా సొంతం చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కస్టమర్లకు గుడ్‌న్యూస్. బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లు మంచి ఫ్యాన్సీ నెంబర్లను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ వేలం పాట ఆన్లైన్లో నిర్వహిస్తుండడం విశేషం. ఆసక్తిగల కస్టమర్లు ఆన్లైన్లో పాల్గొని ఫ్యాన్సీ నెంబర్‌తో కూడిన సిమ్ కార్డులను సొంతం చేసుకోవచ్చు. నవంబర్ 11 నుంచి ఈ ప్రీమియం నెంబర్ల వేలం ప్రారంభమై నవంబర్ 20వ తేదీ వరకు కొనసాగుతుంది. ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఫ్యాన్సీ నెంబర్లు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లలో వేలం వేస్తున్నారు. అలాగే.. ప్రస్తుతం దేశంలో రోమింగ్ విధానం లేకపోవడంతో ఏ రాష్ట్రంలో సిమ్‌ను ఏ రాష్ట్రంలో అయినా ఉపయోగించుకోవచ్చు.
కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. ఈ ప్రార్థనలలో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చారని, పేలుడు జరిగిన తర్వాత అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఫైర్, వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని, అక్కడంతా గందరగోళం నెలకొందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు.





Total views : 149252