గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న భవనాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్లను చోరీ చేస్తున్న ముఠాను గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. కాజా టోల్గేట్ సమీపంలోని ప్రభల్ టెక్ పార్క్‌లో చోరీకి గురైన ఎలక్ట్రికల్ వైర్ల కేసును ఛేదించిన పోలీసులు మొత్తం పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భవనాల్లోని విద్యుత్ వైర్ల నుంచి కాపర్‌ను వేరు చేసి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. నిందితుల నుంచి 28 కేజీల కాపర్‌ను స్వాధీనం చేసుకోగా, దాని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని మంగళగిరి గ్రామీణ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. చోరీ సొత్తు అని తెలిసి కొనుగోలు చేసిన వారిపైనా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
Tag: