నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దత్తగిరి కాలనీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం, లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. నిరసనకారులపై నమోదు చేసిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, పోలీసుల చర్యలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తప్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని పీడీఎస్‌యూ నాయకులు హెచ్చరించారు.
Tag: