రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరింది. మాస్కో సహా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీగా డ్రోన్ దాడులు చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఒక్క రాత్రిలో దేశవ్యాప్తంగా 822 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. మాస్కో ప్రాంతంలోనే వందలాది డ్రోన్లు లక్ష్యంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. మాస్కో సమీపంలోని పోడోల్స్క్లో వైల్డ్‌బెర్రీస్ గోదాముపై డ్రోన్ దాడితో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 83 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా.. రష్యాలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన దాడులతో కలిపి మృతుల సంఖ్య కనీసం ఆరుగురికి చేరినట్లు నివేదికలు వెల్లడించాయి.
మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో విస్తృత స్థాయిలో దాడులు కొనసాగించింది. ఉక్రెయిన్‌లోని ఇంధన, పారిశ్రామిక మౌలిక వసతులను రష్యా లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ఆరు నెలలుగా రష్యా భూభాగంలో సుదూర దాడులకు ఉక్రెయిన్ బ్రిటిష్ డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మాస్కోతో పాటు యారోస్లావ్, వోల్గోగ్రాడ్ ప్రాంతాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం.
ఇరు దేశాల పరస్పర దాడులతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారీ డ్రోన్ దాడులతో రష్యాలోని పలు ప్రాంతాల్లో పౌరులు భయాందోళనలకు గురయ్యారు. రష్యా భూభాగంపై ఉక్రెయిన్ దాడుల తీవ్రత పెరగడం, అదే సమయంలో ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతుండటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇంధన, పారిశ్రామిక మౌలిక వసతులపై దాడులు కొనసాగితే యుద్ధ ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.