శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమీ తీర్థం (చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 50 వేలకు పైగా భక్తులు అమ్మవారి పద్మసరోవరంలో చక్రస్నానం సమయంలో పుణ్యస్నానాలను ఆచరించారని చెప్పారు. ఇంకా వేలాదిమంది భక్తులు వస్తున్నారని, సాయంత్రం వరకు ఈ పుణ్యస్నాన వేడుక జరుగుతూనే ఉంటుందని వివరించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 5.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది.అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.2.5 కోట్లు విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల, శ్రీ సుందరరాజస్వామి వారికి యజ్ఞోపవీతాన్ని సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పచ్చ చామంతులు, యాలకులు, ఆఫ్రికన్ గ్రేప్స్, రెడ్ మరియు ఎల్లో రోజాపెటల్స్, వట్టివేరు, తులసిమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. తిరుపూర్ కు చెందిన దాతలు అమ్మవారి మాలలు, కిరీటాలను ప్రత్యేకంగా తయారు చేయించారు.పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటుచేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో తామర పూలు, రోజాలు, లిల్లీలు తదితర 6 రకాల, కట్ ఫ్లవర్స్, 6 రకాల సంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు.ఉదయం 12 నుండి 12.10 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. కాగా రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 9.30 నుండి 10.30 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరగనుంది. నవంబరు 19వ తేదీ ఆదివారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం వైభవంగా జరుగనుంది.
Sri padmavathi ammavari Brahmotsavam
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు రథం పై దర్శనమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన గురువారం ఉదయం శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.
Read Also..
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. శ్రీవారి హృదయపీఠంపై నిలిచి లోకాన్ని కటాక్షిస్తున్న అలివేలుమంగ. సర్వభూపాలురు వాహనస్థానీయులై అమ్మవారిని సేవించి తరిస్తున్నారు. ఇందులో అష్టదిక్పాలకులు ఉన్నారు. వీరంతా నేడు జగదేకవీరుడైన శ్రీవారి అర్ధాంగిని సేవించి తరిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుండి 2 గంటల వరకు శ్రీ కృష్ణ స్వామి ముఖ మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.
సాయంత్రం 4.20 నుండి 5.20 గంటల వరకు అమ్మవారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు గరుడ వాహనంపై భక్తులను కటాక్షించునున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులకు ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి అనేక సంవత్సరాలుగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో గజవాహన సేవనాడు పట్టువస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజీవో శ్రీ బాలి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు మంగళవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు.
Read Also..





Total views : 78235