ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్..ఈడీ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 16న విచారిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ల ధర్మాసనం తెలిపింది. గత విచారణలో కవిత పిటిషన్ ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కలిపి విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సోమవారం విచారణ మొదలుకాగా.. ఈ పిటిషన్ పై తుది విచారణ చేపట్టాలని కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. అయితే, గతంలో వేర్వేరు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులతో పాటు రికార్డులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణకు రావడంలేదంటూ ఈడీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. సమన్లు స్వీకరించడంలేదని చెప్పారు. దీనిపై కపిల్ సిబల్ కల్పించుకుంటూ.. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని అన్నారు. గత విచారణలో కవితకు సమన్లు జారీచేయబోమని కోర్టుకు ఈడీ తెలిపిందని గుర్తుచేశారు. అయితే, అది కేవలం ఒకసారికి మాత్రమేనని, ప్రతిసారీ కాదని ఈడీ న్యాయవాది బదులిచ్చారు. ఈ క్రమంలో అన్ని అంశాలను ఈ నెల 16న జరిగే విచారణలో వింటామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. Read Also..
supreme court
మార్గదర్శి చిట్ ఫండ్ కేసులు తెలంగాణకు బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఏపీలో నమోదైన కేసులను బదిలీ చేయడానికి తగిన కారణాలేవి కనిపించడం లేదని పేర్కొంది. మార్గదర్శి పిటీషన్లను అనుమతించే ప్రసక్తే లేదని తెలిపింది. కేసు విచారణపై స్టే కావాలనుకుంటే ఏపీ హైకోర్టునే ఆశ్రయించందని తెలిపింది. కేసును కొట్టేస్తే పిటిషన్లన్నీ నిరర్థకమే కదా అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా అవసరం అనుకుంటే ఏపీ హైకోర్టులోనే తగిన పిటిషన్ వేసుకోవాలని సూచనలను చేసింది.
Read Also..
సుప్రీంకోర్టులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసులో ప్రస్తుతం తాము జోక్యం చేసుకోమని ముందుగా హైకోర్టుకు వెళ్లాలని తెలిపింది. తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ జారీ చేసిన సమన్లను చట్టవిరుద్ధం, తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనంటూ పేర్కొంటూ వాటిని రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన సీజేఐ డీవీ చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు సంజీవ్‌ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం త్రివేదిలతో కూడిన ప్రత్యేక త్రిసభ ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది.
పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే బోర్డలు, ప్రాధికార సంస్థల నియమకాలకు సుప్రీంకోర్డు స్పష్టమైన మార్గదర్శకాలు జారి చేసింది. ఈ మేరకు జస్టీస్ బీఆర్ గవాయి, జస్టీస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. భారత జంతు సంరక్షణ మండలి, అణు నియంత్రణ మండలి, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు, జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్ద, ప్రకృతి వైపరీత్య నిర్వాహణ ప్రాధికార సంస్దలు, వన్యప్రాణుల నేర నియంత్రణ బ్యూరోలకు వర్తిస్తుందని అత్యున్నత న్యాయస్దానం తెలిపింది.
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో, చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను తిరస్కరించింది. ఇదే కేసులో సహ నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. 2022లో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలయిందని సుప్రీంకోర్టు తెలిపింది. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతికి తమ ఊరు వెళ్తానని.. రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పోలీసులు రఘురామపై 11 కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన తరఫున న్యాయవాదులు ఉమేష్ చంద్ర, వై.వి. రవిప్రసాద్ పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. మరోసారి తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశముంది. పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టును అభ్యర్థించారు. ఆర్నేష్ కుమార్ కేసులో 41ఏ నిబంధనలు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా ప్రస్తావించారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కేసు నమోదై, ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు అయితేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయన్నారు. తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం నేడు ఉత్తర్వులు ఇవ్వనుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. 11 మంది దోషుల ముందస్తు విడుదల చెల్లదంటూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసింది. దోషులను ముందస్తుగా విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు జస్టిస్ బీవీ. నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితురాలు బిల్కిస్ బానోకు ఊరట కలిగించేలా తీర్పు చెప్పింది. 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. బానో ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు ఆమెపై అత్యాచారం చేసి, మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ చంపేశారు. ఈ దారుణంపై బిల్కిస్ బానో సుదీర్ఘంగా న్యాయ పోరాటం చేశారు. నిందితుల అరెస్టు నుంచి వారికి శిక్ష పడేంత వరకూ పోరాడారు. నేరం రుజువు కావడంతో నిందితులకు కోర్టు మరణ శిక్ష విధించింది. దీనిపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షకు మార్చింది. అయితే, ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులను గతేడాది గుజరాత్ ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది. 1992 చట్టం ప్రకారం 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకోవడంతో పాటు జైలులో సత్ర్పవర్తనతో మెలిగారని పేర్కొంటూ స్వాతంత్ర దినోత్సవం రోజు బయటకు పంపింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాధితురాలు మరోమారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సహా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, జర్నలిస్ట్ రేవతి లాల్, లక్నో యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పు వెలువరించిన కోర్టు దోషుల ముందస్తు విడుదల చెల్లదని తేల్చి చెప్పింది.
రాష్ట్ర మంత్రివర్గ సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మంత్రులను తొలగించే అధికారం గవర్నర్‌కు లేదని పేర్కొంది. తమిళనాడు మంత్రి వి.సెంథిల్ తొలగింపు కేసులో ఈ మేరకు తీర్పు వెలువరించింది. రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారన్న ఆరోపణలపై మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు గత జూన్ 13న అరెస్టు చేశారు. దీంతో, మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను మద్రాస్ హైకోర్టు పక్కనపెట్టింది. మంత్రి అరెస్టయ్యాక కూడా మంత్రివర్గంలో కొనసాగడాన్ని సవాలు చేస్తూ ఎం.ఎల్, రవి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. దీంతో, సదరు న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం.. రవి వాదనలను తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయంతో ఏకీభవిస్తున్నామని పేర్కొంది. ప్రాథమికంగా చూస్తే హైకోర్టు తీరు సరైందే. ఓ రాష్ట్ర మంత్రిని గవర్నర్ తనంతట తానుగా బర్తరఫ్ చేయలేరు. రాష్ట్ర మంత్రివర్గం చేసే సిఫార్సులకు అనుగుణంగా గవర్నర్ వ్యవహరించాలని కోర్టు స్పష్టం చేసింది.
మహిళలైన అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, సమస్యలను పరిష్కరించాలని నరసాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 4వ రోజుకు చేరాయి. బండారు మాధవ నాయుడు అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలైనా అంగన్వాడీ వర్కర్లపై నిర్లక్ష్య ధోరణి విడనాడాలని న్యాయమైన వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరంకుశ వైఖరిని విడనాడి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో అంగన్వాడీలతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
అసెంబ్లీలో తీర్మానించి పంపిన బిల్లులకు తమిళనాడు గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికిగానూ సీఎం ఎంకే స్టాలిన్‌తో సమావేశం నిర్వహించాలని గవర్నర్ ఆర్ఎన్ రవిని సుప్రీం కోర్టు కోరింది. అసెంబ్లీ రెండోసారి ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపలేదని స్పష్టం చేసింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ తమిళనాడు ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. సీఎంను గవర్నర్ ఆహ్వానించి.. సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతారని ఆశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది.





Total views : 89726