తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టారు ఆర్టీసీ కార్మికులు. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజాశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలకు సమ్మె మాత్రమే పరిష్కారం కాదని, చర్చల ద్వారానే ముందుకు వెళ్దామని సూచించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని వేసిందన్న మంత్రి పొన్నం..కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్న విమర్శల్లో నిజం లేదన్నారు. నాలుగు వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు లేవనెత్తిన 32 ప్రధాన డిమాండ్లలో ఇప్పటికే 29 అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. కేవలం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు అనే రెండు ప్రధాన అంశాలు మాత్రమే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని, వాటిపై కూడా సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.
ఆర్టీసీ జేఏసీ నేతలు తమ నిరసనను కొనసాగించవచ్చని, కానీ సాధారణ కార్మికులు మాత్రం ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విధుల్లో చేరాలని కోరారు మంత్రి పొన్నం. ముఖ్యంగా నిరుపేద ప్రయాణికులకు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఇబ్బంది పెట్టవద్దని విన్నవించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండానే డిమాండ్లను పరిష్కరించుకుందామన్నారు. ప్రభుత్వం మీ సమస్యల పట్ల అత్యంత సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్.