డబ్బు మద్యం ఎరవేయకుండా ఓట్లు అడిగే ధైర్యం టిఆర్ఎస్, కాంగ్రెస్ బిజెపిలకు ఉందా? అని నర్సంపేట నియోజకవర్గం ఎంసిపిఐ(యు) ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ సవాల్ విసిరారు. ఓటర్లకు డబ్బు మద్యం ఎరవేయకుండా ప్రలోభాలకు గురి చేయకుండా ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు. ఆశయాలకు అనుగుణంగా నీతిగా నిజాయితీగా విధానాల ప్రాతిపదికన ప్రజలను చైతన్యం చేసి ఓట్లు అభ్యర్థించే ఏకైక పార్టీ ఎంసిపిఐ(యు) అని అన్నారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు గుమ్మరించి మద్యం మత్తులో ఓట్లు దండుకొని రాజకీయాలను వ్యాపారంగా మార్చిన రాజకీయ పార్టీలను గుర్తించాలని కోరారు. నీతివంతమైన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్ధుడైన బహుజన బిడ్డగా నన్ను ఆదరించాలని ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
Telangana
కల్వకుంట్ల కుటుంబాన్ని ఓడిద్దాం. తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో ఈరోజు గజ్వేల్ పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుండి తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన యాత్ర ప్రారంభమయింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన మా పిల్లల త్యాగాలను ఎందుకు గుర్తించడం లేదు? తెలంగాణ ఉద్యమకారుల పోరాట వీరులకు కనీస గుర్తింపు లేకుండా ఎందుకు చేశారు? తెలంగాణలో దళిత బంధు పేరుతో ఏ ఒక్క సామాన్యుడుకైనా దళిత బందు ఇచ్చారా? అని ప్రశ్నించారు. మా అమరవీరులు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ ను కాపాడుకోవడానికి ఈరోజు తెలంగాణ అమర వీరుల కుటుంబాలు తెలంగాణ ఉద్యమకారులు ఏకమై ఈరోజు గజ్వేల్ గడ్డమీద నుండి పిలుపునిస్తున్నాం అని తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మావోయిస్టు లేఖలు కలకలం రేపాయి. వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి సుధాకర్ పేరుతో లేఖ విడుదల చేశారు. భూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని. ఓట్ల కోసం వచ్చే బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలను తరిమి కొట్టాలని లేఖలో పేర్కొన్నారు. హరితహారం పేరుతో పోడు బూముల్లో మొక్కలు నాటి రైతుల భూములను లాక్కుంటున్నారని రాశారు. బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో బ్రాహ్మనీయ, హిందుత్వ మతోన్మాదం పేరుతో.. దళితులపై, మైనారిటీలపై దాడులు చేస్తున్నారని మావోయిస్టులు లేఖలో వివరించారు.
నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ను గోరెంట్ల గ్రామస్తులు అడ్డుకున్నారు. మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో గాదరి కిషోర్ ప్రచారం చేశారు. అయితే అభివృద్ది ఎక్కడంటూ గ్రామస్ధులు అడ్డుకుని ప్రశ్నించారు. ప్రచారం కోసం వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడి చేశారు. అనంతరం అక్కడకు చేరుకున్నా పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నాయకులకే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఎమ్మెల్యే గ్రామస్తులపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామస్థులపై ఉంటే ఉండండి…లేకపోతే వెళ్లిపోండంటూ విరుచుకుపడ్డారు. తనను అడగాల్సింది సభలోనని…ఇదేమీ సభ కాదని అన్నారు.
తెలంగాణాలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. తెలంగాణలో మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీ పేరుతో తెలంగాణలో చిన్నా భిన్నమైన ప్రజల జీవితాలలో వెలుగును నింపడానికి తెలంగాణలో భారత చైతన్య యువజన పార్టీ వచ్చిందని ఆ పార్టీ అధ్యక్షుడు బోడ రామచంద్ర యాదవ్ చెప్పారు. రాబోవు ఎన్నికలలో బరిలోకి దిగుతామని ,తెలంగాణ ప్రజలు స్పష్టంగా రాజకీయ మార్పును కోరుకుంటున్నారని అన్నారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్ పార్టీ అడుగు అడుగున అవినీతికి పాల్పడుతూ ప్రజల జీవితంతో చెలగాటం ఆడుతొందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే రాబోవు కాలంలో తెలంగాణలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తాము పనిచేస్తామని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడ రామచంద్ర యాదవ్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ పార్టీకి చెరుకు రైతును గుర్తుగా కేటాయించారని, రానున్న నాలుగైదు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బీజేపీయే అన్నారు. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని, కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతోందన్నారు.
రైతుబంధు ఆపేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించడంపై అదే ఎక్స్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్కు రైతులపై అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతు బంధు, పెన్షన్, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు… నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు… నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు… నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు… నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే…’ అని రేవంత్ పేర్కొన్నారు. నీలాంటి వాడిని చూసే… ‘నిజం చెప్పులు తొడుక్కునే లోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది’ అనే సామెత పుట్టిందని విమర్శించారు. కేటీఆర్, బీఆర్ఎస్ తమ డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని సూచించారు. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని వ్యాఖ్యానించారు.
కొండగల్ రా.. గాంధీ బొమ్మ దగ్గరకు రా.. అని కొందరు నాకు సవాలు విసురుతున్నారని, కేసీఆర్ దమ్ము ఏంటో దేశమంతా చూసిందంటూ సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ కు, కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్లదగ్గర ఉన్నారో తెలియదని బీఆర్ఎఐస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇపుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా? అని మాట్లాడుతున్నారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి, అంబలి కేంద్రాలు ఉండేవని, పదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉండేదో ప్రజలు గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తంలో 24గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇప్పుడు దేశానికి దిక్సూచిగా నిలిచేలా తెలంగాణ ఎదిగిందన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 60లక్షల టన్నుల ధాన్యం పండే తెలంగాణ.. ఇవాళ 3కోట్ల టన్నుల ధాన్యం పండిస్తోందన్నారు. 24 గంటల కరెంటు ఇస్తే.. కాంగ్రెస్‌ను వీడి తెరాస కండువా కప్పుకొంటానని జానారెడ్డి సవాల్ విసిరారు. ఆ తర్వాత వెనక్కితగ్గారన్నారు. రైతు బంధు అనే పథకానికి ఆద్యుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి అచ్చంపేట నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. 32 పార్టీల మద్దతు కూడగట్టి తెలంగాణ సాధించా అని సీఎం కేసీఆర్ వివరించారు.
నేడు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా వెళ్లనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం జీళ్లచెరువులో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. జిల్లాలోనే తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభ కావడం.. పోరుబిడ్డ, సీఎం కేసీఆర్ హాజరవుతుండడంతో స్వాగతం పలికేందుకు నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసమీకరణపై దృష్టి సారించిన పాలేరు ఎమ్మెల్యే, అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే కందాళ.. సీఎం సభకు ప్రజలు, లబ్ధిదారులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ తొలి సభ నిర్వహిస్తుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 175 మంది ఐపీఎస్ అధికారుల నుంచి అమిత్‌షా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐపీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ సై, తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. ముందుగా నేషనల్ పోలీస్ అకాడమీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు. విజయవంతంగా మొదటి దశ శిక్షణ పూర్తి చేసిన యువ ఐపీఎస్ అధికారులు విధి నిర్వహణలో తొలి అడుగు వేయబోతున్నారు. 75వ బ్యాచ్‌కు చెందిన 155 మంది యువ ఐపీఎస్ అధికారులు, వీరితోపాటు శిక్షణ పొందిన మరో 20 మంది విదేశీ అధికారులు పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు.





Total views : 196554