సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊబ చెరువు, చిన్న చెరువు, పెద్ద చెరువుల ఆక్రమణల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూములు అక్రమ కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మార్వో కార్యాలయంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సీవీఆర్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలను ప్రస్తావిస్తూ, చెరువుల భూముల్లో మట్టి పోసి ప్లాట్లు వేయడం, నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడం వంటి పనులు బహిరంగంగానే జరుగుతున్నాయని వారు ఆరోపించారు. రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం బాధాకరమని విమర్శించారు. వారం రోజులలోగా ప్రభుత్వం స్పందించి ఆక్రమణలను అడ్డుకోకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని బీజేపీ నేతలు హెచ్చరించారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. చెరువులను రక్షించి ప్రజల ప్రయోజనాలను కాపాడాలని స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊబ చెరువు ప్రస్తుతం ఆక్రమణలతో కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 399లో ఉన్న ఈ చెరువు మొత్తం 99 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఇప్పటికే దాదాపు 20 ఎకరాలు ఆక్రమణకు గురై ఇళ్ల నిర్మాణాలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మరికొంతమంది అక్రమార్కులు మరో 10 ఎకరాల భూమిపై కూడా మట్టి పోసి వెంచర్లుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. చెరువు వైపు రహదారి నిర్మించి మరిన్ని నిర్మాణాలకు మార్గం సుగమం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై సీవీఆర్ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులదేనని, ఆక్రమణదారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులతో పాటు స్థానికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.






Total views : 89157