Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

by CVR NEWS

ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. శాఖ ఆధునికీకరణలో భాగంగా మొత్తం 252.93 కోట్లతో చేపట్టిన ప్రణాళికలో తొలి దశగా 33.25 కోట్ల విలువైన నూతన వాహనాలు, అత్యాధునిక పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన జెండా ఊపి కొత్త వాహనాలను సేవలకు అంకితం చేశారు. అధికారులు కొనుగోలు చేసిన పరికరాలు, వాహనాల పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. తొలి విడతలో భాగంగా 18 కోట్ల వ్యయంతో 25 అధునాతన అగ్నిమాపక శకటాలు, 10 కోట్లతో హై ప్రెషర్ పంపులు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 2.49 కోట్లతో 50 అత్యవసర రబ్బర్ బోట్లు, 2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లను ప్రభుత్వం సమకూర్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించుకుని ఈ పరికరాలను అందుబాటులోకి తెచ్చిన అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.

ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. రాజధానితో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఎత్తైన భవనాల నిర్మాణాలు పెరుగుతున్నందున, వాటికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ ఆధునిక పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు. గతంలో అగ్నిమాపక విభాగంలో ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేదని, మళ్లీ అదే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సైతం సహాయం చేసిన ఘనమైన చరిత్ర ఏపీకి ఉందని గుర్తుచేశారు. అన్ని సవాళ్లను అధిగమించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమర్ధంగా సద్వినియోగం చేసుకుని అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి , పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

009385
Total views : 62186

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.