Wednesday, July 15, 2026
News Navigation
Wednesday, July 15, 2026
News Navigation

Breaking

Wednesday, July 15, 2026
Home International 140 ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు.

140 ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు.

by CVR NEWS
140 ఇరాన్ మిలిటరీ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు

గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధిని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ఇరాన్ ప్రయత్నిస్తుండగా, అమెరికా గట్టి ఎదురుదెబ్బ కొట్టింది. ఆదివారం అమెరికా మిలిటరీ బలగాలు హర్మూజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. దీంతో ఇరు దేశాల మధ్య దాడులు-ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

అమెరికా ప్రధానంగా ఇరాన్ రక్షణ వ్యవస్థలపైనే ఫోకస్ పెట్టింది. ఇరాన్‌కు చెందిన అత్యంత శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న సైనిక వ్యవస్థలపై అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. జలసంధి చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా మొహరించిన ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, అంతర్జాతీయ నౌకలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇరాన్ స్పీడ్‌బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడుల తీవ్రతకు ఇరాన్ దక్షిణ నౌకాశ్రయ నగరమైన బందర్ అబ్బాస్‌లో భారీ పేలుళ్ల శబ్దాలు మార్మోగాయి. ఇరాన్ ప్రధాన భూభాగానికి ఆనుకుని ఉన్న కెస్మ్ ద్వీపంపై కూడా పెద్ద ఎత్తున క్షిపణులు పడ్డాయి. కెస్మ్ గవర్నర్ హుస్సేన్ అమీర్ తెయ్మూరి ఈ విషయాన్ని ధృవీకరించారు. శత్రువులకు చెందిన 10 నుంచి 11 క్షిపణులు ద్వీపంలోని సైనిక స్థావరాలపై పడ్డాయని, అయితే పౌరులెవరూ గాయపడలేదని ప్రకటించారు. హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ దాడుల్లో ఒక మెయింటెనెన్స్ కార్మికుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ఇర్నా వెల్లడించింది.

ఈ దాడులపై యుఎస్ సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర, వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసే సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకే ఈ తాజా దాడులను ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను కాపాడటానికి, పౌర నావికుల రక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు మిలిటరీ కమాండ్ స్పష్టం చేసింది. అమెరికా దళాలు భూమి, సముద్ర ఆధారిత ఫైటర్ జెట్లు, డ్రోన్లు, యుద్ధనౌకల ద్వారా ఇరాన్‌కు చెందిన దాదాపు 140 సైనిక లక్ష్యాలపై కచ్చితమైన క్షిపణులతో విరుచుకుపడ్డాయి.

అమెరికా దళాలు తమపై దాడులు చేయడంతో ఇరాన్ సైతం దూకుడుగా వ్యవహరిస్తోంది. యుద్ధాన్ని కేవలం హర్మూజ్​కే పరిమితం చేయకుండా, అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్ రీజియన్ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లోని అమెరికా అనుబంధ స్థావరాలపైకి దాడులను విస్తరించింది. ఈ మేరకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పలు దేశాల్లో తాము జరిపిన దాడుల వివరాలను వెల్లడించింది. జోర్డాన్‌లో అమెరికా సైన్యానికి చెందిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, డ్రోన్ హ్యాంగర్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసింది. కువైట్‌లోని అమెరికా రాడార్ సైట్‌తో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన హైమర్స్ క్షిపణి లాంచర్ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి నిల్వలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడిలో తమ దేశ సరిహద్దులోని మూడు కేంద్రాలు, ఒక ఆఫ్-షోర్ ఆయిల్ డ్రిల్లింగ్ ప్లాట్‌ఫారమ్ దెబ్బతిన్నాయని, ఒక కార్మికుడు గాయపడ్డాడని కువైట్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఖతార్‌లోని జెట్ మెయింటెనెన్స్ సెంటర్, కమాండ్ ఫెసిలిటీపై జరిగిన దాడిలో క్షిపణి శకలాలు నివాస ప్రాంతాలపై పడటంతో ఒక చిన్నారితో సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఒమన్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ సపోర్ట్, రీఫ్యూయలింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై ఇరాన్ డ్రోన్ దాడులు జరగ్గా, యూఏఈ, బహ్రెయిన్‌లు తమ అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా టెహ్రాన్ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లను సరిహద్దుల వెలుపలే విజయవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040416
Total views : 207701

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: