గోదావరి తీరంలో మరో కీలక మౌలిక వసతుల పనికి శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. మూడు జిల్లాల పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం చేరుకున్న సీఎం… ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను ప్రారంభించారు. సీడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్ల అమరిక చేపట్టనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తి చేసి, గోదావరి పుష్కరాల నాటికి బ్యారేజీని పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. LOOK
గోదావరి జలాల నిర్వహణలో కీలకమైన ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా బ్యారేజీ వద్దకు చేరుకుని గేట్ల పునరుద్దరణ పనులను ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులకు శుభారంభం చేశారు.2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ధవళేశ్వరం బ్యారేజీలో 58 కొత్త గేట్లను అమర్చింది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం సూచనల మేరకు మిగిలిన 117 గేట్లను కూడా కొత్తవిగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. దీని ద్వారా బ్యారేజీ భద్రతతో పాటు వరద నీటి నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.
బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి… ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గేట్ల అమరిక, నిర్మాణ నాణ్యత, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ రాష్ట్రానికి ప్రాణాధారం. పనుల్లో ఎలాంటి రాజీ ఉండకూడదు. నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.గోదావరి పుష్కరాల నాటికి కొత్త గేట్ల వ్యవస్థ పూర్తిగా అందుబాటులోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు. వరద నియంత్రణ, సాగునీటి పంపిణీ, డెల్టా ప్రాంత భద్రత దృష్ట్యా ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని పేర్కొన్నారు.
రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ధవళేశ్వరం బ్యారేజీ పునరుద్దరణ పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి… గోదావరి డెల్టా మౌలిక వసతుల ఆధునికీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి డెల్టాకు ప్రధాన జలవనరు. దాదాపు శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న ఈ బ్యారేజీ ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విస్తారమైన వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. పాత గేట్ల స్థానంలో కొత్త గేట్ల అమరిక ద్వారా వరదల సమయంలో నీటి విడుదల మరింత సురక్షితంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. కేంద్ర జల సంఘం సూచనల మేరకు చేపడుతున్న ఈ పునరుద్దరణ పనులు గోదావరి డెల్టా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరిస్తున్నారు.



Total views : 207682