నేపాల్‌లో పెరుగుతున్న నిరుద్యోగం, యువతలో నిరాశ, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి మరోసారి ఆందోళనలకు దారితీసింది. గత మూడు రోజుల్లో ముగ్గురు యువకులు ఆత్మాహుతి యత్నాలకు పాల్పడగా.. వారిలో ఇద్దరు మృతి చెందడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఈ ఘటనల నేపథ్యంలో కాఠ్మాండూలో యువత భారీగా ర్యాలీలు నిర్వహించి ప్రధాని బాలేంద్ర షా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తోందని జెన్-జీ నేపాల్ సంస్థ ఆరోపించింది.
యువతకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం బడ్జెట్‌లో గానీ, విధానాల్లో గానీ సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని నిరసనకారులు విమర్శించారు. యువతలో ఆశ, విశ్వాసాన్ని నింపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్ష నేపాలీ కాంగ్రెస్ కూడా ఆరోపించింది.ఇదిలా ఉండగా, 2023లో ఇలాంటి ఘటనలను ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న బాలేంద్ర షా.. తాజా పరిణామాలపై మౌనం పాటించడం కూడా విమర్శలకు తావిస్తోంది. యువత మానసిక ఆరోగ్యం, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.




Total views : 207701