మెగా డీఎస్సీపై వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేశారని గుర్తుచేసిన లోకేశ్.. ఇప్పటికే 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. డీఎస్సీని అడ్డుకునేందుకు కోర్టుల్లో అనేక కేసులు వేసినా ఎక్కడా ప్రభుత్వం తప్పు చేసిందని తేలలేదన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులపై ఒత్తిడి, దాడులకు పాల్పడుతున్న వారిపై లోకేశ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉపాధ్యాయుల జోలికి ఎవరైనా వెళితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డీఎస్సీపై ప్రభుత్వం ఇప్పటికే ప్రతి ఆరోపణకు సమాధానం ఇచ్చిందని, అయినా పదేపదే ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. ఇదే సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసును ప్రస్తావిస్తూ.. చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో ఉంచారని, ఆ కేసులో తమ నాయకుడికి క్లీన్‌చిట్ వచ్చిందని లోకేశ్ పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం సుమారు 3 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి.. ఐదేళ్లలో దాదాపు 30 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని ప్రకటించారు. చేతనైతే తనను ఆపాలని జగన్‌కు సవాల్ విసిరారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమన్న లోకేశ్.. తదుపరి డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.