Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh బి కొత్తకోట నగర పంచాయతీగా మారినా అభివృద్ధి శూన్యం..

బి కొత్తకోట నగర పంచాయతీగా మారినా అభివృద్ధి శూన్యం..

by CVR NEWS
బి కొత్తకోట నగర పంచాయతీగా మారినా అభివృద్ధి శూన్యం

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి కొత్తకోట… పేరుకు నగర పంచాయతీ, కానీ అసలు పరిస్థితి చూస్తే ఇది అభివృద్ధి పేరుతో జరిగిన పెద్ద మోసం అనిపిస్తోంది. గత ప్రభుత్వంలో రాజకీయ లాభాల కోసం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పట్టణం ప్రజలు నేటికీ నష్టపోతున్నారు. నగర పంచాయతీగా ఏర్పడి ఐదేళ్లు గడిచినా తర్వాత కూడా ఒక్క శాశ్వత అభివృద్ధి పనీ జరగలేదు . కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పుకుంటూ పన్నులు మాత్రం రెట్టింపు చేశారు కానీ ప్రజలకు అందుతున్న సేవలు మాత్రం సున్నా. అధికారుల నిర్లక్ష్యం, నాయకుల స్వార్థం కలిసి బి కొత్తకోటను “పేరు గొప్ప ఊరు దిబ్బ”గా మార్చేశాయి. ఎన్నికలు నిర్వహించకుండా ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టడం, శాశ్వత అధికారులను నియమించకపోవడం స్పష్టంగా వ్యవస్థ వైఫల్యాన్ని చూపుతోంది. ప్రజల అవసరాలు పట్టించుకోకుండా కేవలం వసూళ్ల యంత్రంగా మారిపోయిన ఈ నగర పంచాయతీ అధికారులపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

 

బి కొత్తకోటలో జరుగుతున్న అక్రమాలు చూస్తే ఇది నగర పంచాయతీ కాదని, ఒక అడ్డగోలుగా నడుస్తున్న వ్యవస్థ అనిపించకుండా మానదు . అప్రూవల్ లేని నిర్మాణాలు బహిరంగంగా జరుగుతున్నా అధికారులు కళ్లుమూసుకుని కూర్చున్నారు. ముడుపుల మాయలో పడి నోటీసులు ఇచ్చినట్లు నటించి తర్వాత ఫైళ్లు మూసేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎదురు తిరిగే పేదలపై మాత్రం కేసులు పెట్టి బెదిరించడం, వారిని భయపెట్టడం అధికార దుర్వినియోగానికి నిదర్శనంగా నిలుస్తుంది . ప్రజల సొమ్ముతో ఏర్పడిన ఆస్తులు కూడా ఆక్రమణలకు గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, ఆక్రమణదారులకు సహకారం అందించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారులే ఇలా వ్యవహరిస్తే సాధారణ ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేసి, వసూళ్లతో భారం మోపడం ఇప్పుడు బి కొత్తకోటలో నిత్యకృత్యంగా మారిపోయింది.

మౌలిక సదుపాయాల పరిస్థితి చూస్తే బి కొత్తకోటను నగర పంచాయతీగా ప్రకటించడం ఎంత పెద్ద పొరపాటు అనేది స్పష్టమవుతోంది. వర్షం పడితే డ్రైనేజీలు ముంచెత్తి ఇళ్లలోకి నీరు చేరుతుంది. రోడ్లు వెడల్పు లేకపోవడంతో వాహనదారులు నిత్యం ప్రాణాలను చేతుల్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఆక్రమణలతో రహదారులు కుంచించుకుపోయి ప్రమాదాలు సాధారణమైపోయాయి. కుక్కల బెడదతో నెలకు డజన్ల కొద్దీ కేసులు నమోదవుతున్నా అధికారులు స్పందించడంలేదు. ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకలుగా పెంచినా, అవసరమైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు దూరప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ సిబ్బంది లేక పనికిరాకుండా పోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇది అభివృద్ధి కాదు, ప్రజల డబ్బు వృథా చేసిన ఘోర సంఘటనకు నిదర్శనంగా నిలుస్తోంది.

రైతులు, సాధారణ ప్రజల కష్టాలు బి కొత్తకోటలో ఎవరికి కనిపించడం లేదు. చుట్టుపక్కల 300 గ్రామాల రైతులు తమ పంటలను అమ్ముకోవడానికి ఆధారపడిన మార్కెట్ యార్డు మూతపడి నిరుపయోగంగా మారింది. రైతు బజార్లు లేకపోవడంతో రైతులు అధిక రవాణా ఖర్చులు భరించి ఇతర రాష్ట్రాలకు పంటలను తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. రాత్రి 8 గంటల తర్వాత రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు డిపో లేదు, బస్ షెల్టర్లు లేవు – ఇదేనా నగర పంచాయతీ? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు . ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేని ఈ పట్టణాన్ని నగర పంచాయతీగా ప్రకటించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరింత అర్హత ఉన్న ఇతర పట్టణాలను పక్కనబెట్టి బి కొత్తకోటకు ప్రాధాన్యం ఇవ్వడం రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనే అనుమానం ప్రజల్లో తీవ్రంగా వ్యక్తమవుతోంది.

Advertisements

You may also like

Our Visitor

039862
Total views : 201089

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: