రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగం ఒక నిండు కుటుంబాన్ని బలితీసుకుంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న సిరిసిల్లకు చెందిన ఒకే కుటుంబం ‘TS 23 F 2298’ నంబర్ గల కారులో పెద్దగోల్కొండ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ORR ఎగ్జిట్-16 సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు మరియు ఇద్దరు చిన్నారులు ఉండటం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది. మరో మహిళ తీవ్రంగా గాయపడగా, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన కారు బొల్లి శివకుమార్ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ప్రాథమిక దర్యాప్తులో కారు అతివేగంగా ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ కారుపై ఇప్పటికే రెండు ‘ఓవర్ స్పీడ్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. లారీని ఢీకొట్టిన ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Crime
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అమెరికాకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత. ఐతే అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిన వాళ్లు కొందరైతే..మరికొంత మంది సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు..ఈ నేపథ్యంలోనే అమెరికాలో కర్నూలుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
కర్నూలు జిల్లాకు చెందిన చందు..అమెరికాలోని చికాగోలో ఎంఎస్ పూర్తి చేశాడు. కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ, రాకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న చందు పిస్టల్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కొడుకు మృతితో సెక్యూరిటీ గార్డ్‌గా ఉద్యోగం చేస్తూ తన కుమారుడిని చదివించిన తండ్రి ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఇక చందు మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇక్కడ బాలికది సాధారణమైన గర్భంకాదు.. అత్యాచారం చేయబడి గర్భం దాల్చింది. తన గర్భంలో పెరుగుతున్నదీ..పెంచుతున్నదీ నిందితుడి ప్రతిరూపం..గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే..తల్లీ బిడ్డల ప్రాణాలకు హాని జరుగొచ్చు..లేదా తల్లి క్షేమంగా ఉన్నా…బిడ్డ చనిపోతే…భ్రూణ హత్య ..అదీ సరికాదు…సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా సరే.. ఆమె ఇప్పడు తల్లి..ఆ తల్లి నిర్ణయమే శిరోధార్యమా? సుప్రీం తీర్పు పాటించాలా? క్యూరేటివ్ పిటిషన్ ను కోర్టు పరిగణలోకి తీసుకోవాలా? నిందితుడి పై చర్యలేమీ తీసుకున్నారు? అన్నది పక్కన పెడితే… ఎవరైనా సరే… భ్రూణహత్యలను చేయకూడదన్నది చట్టం స్పష్టంగానే చెబుతోంది. బాలిక గర్భం విచ్ఛిన్నం చేయడం కుదరదని ఇప్పటికే ఎయిమ్స్ డిక్లరేషన్ కోర్టుకు ఇచ్చింది. బాలిక తరఫున తన ఆవేదనను వెలిబుచ్చింది. ఇప్పుడు.. ప్రమాదం లేకపోతే బాలిక గర్భ విచ్చిత్తి చేయాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో 30 వారాల గర్భవిచ్ఛిత్తికి ఇటీవల అత్యున్నత న్యాయస్థానం అనుమతిచ్చింది. దీనిపై ఎయిమ్స్ క్యూరేటివ్ పిటిషన్ వేసింది. ఈ దశలో గర్భాన్ని తొలిగిస్తే.. ఆ బాలిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రానికి సుప్రీం సూచనలు చేసింది. అత్యాచార బాధితుల కోసం చట్టాలను సవరించాలని సూచించింది. ఎంతో ఆవేదనతో ఈ క్యూరేటివ్ పిటిషన్‌ను తీసుకువస్తున్నామనీ… ఈ దశలో గర్భవిచ్ఛిత్తి సాధ్యం కాదు. ఆ మైనర్ తల్లి ఆరోగ్యంపై సుదీర్ఘకాలంలో తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పింది. డెలివరీకి ఇంకా నాలుగు వారాలే ఉంది కాబట్టి బిడ్డకు జన్మనిచ్చి, దత్తతకు ఇచ్చే అంశాన్ని పరిశీలించొచ్చని సూచించింది. ఇదంతా ఆ బాలిక క్షేమం కోసమే’’ అని ఎయిమ్స్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి కోర్టుకు వెల్లడించారు.
భ్రూణ హత్యలు ఎవరు చేసినా చట్టప్రకారం…నేరమే అని చట్టాలు చెబుతున్నాయి.. కన్నబిడ్డనైనా చంపే హక్కు తల్లికి కూడా లేదు..ఇక కొత్త చట్టాన్ని తెచ్చినా..మరెన్ని చట్టాలొచ్చినా..ఆ తల్లీ బిడ్డల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. ఆ దిశగా సుప్రీం కోర్టు ఆదేశిస్తుందా?
చైల్డ్ ట్రాఫికింగ్ కేసును గుజరాత్ పోలీసులు అత్యంత సీరియస్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా ఆపరేషన్ చేపట్టారు.‘ఆపరేషన్ దేవ్’ పేరిట గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో భాగంగా తెలంగాణలో మురుగన్ అలియాస్ నాగరాజు గ్యాంగ్‌ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఏప్రిల్ 20న జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కెళ్లేటి గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మురుగన్ గ్యాంగ్ కార్యకలాపాల్లో గంగాధర్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతుండగా.. అతని భార్య కృష్ణవేణి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇంకా ఈ గ్యాంగ్‌లో కరీంనగర్ ప్రాంతానికి చెందిన మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు తోటి ప్రయాణికుడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విశాఖ నుంచి నడికుడి వస్తుండగా..పల్నాడు జిల్లాలో జరిగింది ఈ ఘటన. దంపతులు జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నారు. ఐతే మహిళకు మాయమాటలు చెప్పి ఏసీ బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు తోటి ప్రయాణికుడు. రైలు దిగాక అత్యాచారం గురించి భర్తకు చెప్పడంతో..రెంటచింతల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం ఆరా తీస్తున్నారు.
విజయవాడ ఉగ్రలింకుల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకొచ్చాయి. విచారణలో కీలక విషయాలు వెల్లడించారు నిందితులు. భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే తమ లక్ష్యమని, అందుకోసం యుద్ధం ప్రారంభించామని వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆల్ ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తున్నామని, ఈ మార్గాన్ని తమకు ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అల్ హకీం షుకూర్ చూపించాడని వారు పోలీసు కస్టడీలో సంచలన విషయాలు చెప్పినట్టు సమాచారం. అలాగే “భారత జాతీయ జెండా స్థానంలో ఐసిస్ జెండాను ఎగురవేయాలన్న నినాదాలతో యువతలో ఉగ్రవాద భావజాలాన్ని నింపేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. ఇస్లాంను విశ్వసించని వారిపై సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశామని..జిహాద్ కోసం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నవారిని గుర్తించే పనిని తమకు అప్పగించినట్టు వెల్లడించారు. దేశంలోని స్లీపర్ సెల్స్‌ను త్వరలో పరిచయం చేస్తామని చెప్పారని..అంతలోనే తాము అరెస్టైనట్టు తెలిపారు.
సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లకు పంపి మిలిటెంట్ శిక్షణ ఇప్పించాలని షుకూర్ కుట్ర పన్నినట్టు తెలిపారు. ఇందుకోసం ‘బెన్ ఎక్స్ డాట్ కామ్’ పేరుతో సోషల్ గ్రూపును ఏర్పాటు చేసి, దేశంలోని పలు రాష్ట్రాల యువతకు గాలం వేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు గత నెలలో విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్, మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్‌లను అరెస్టు చేయడంతో ఈ నెట్వర్క్ గుట్టురట్టయింది. వీరిచ్చిన సమాచారంతో 11 మందిని అరెస్టు చేశారు. తాజాగా ఏపీ సీఐడీ అధికారులు ఏడుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. కస్టడీ ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచి, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విచారణలో మరో నాలుగు రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ లింకులు ఉన్నట్లు, కీలకంగా వ్యవహరిస్తున్న 42 మంది వివరాలను అధికారులు గుర్తించారు. వీరిలో కొందరికి 25 నుంచి 40 వరకు వేర్వేరు పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, NIA రంగంలోకి దిగింది. ఇప్పటికే ఏపీ పోలీసులకు సహకారం అందిస్తున్న NIA.. త్వరలోనే ఈ కేసును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆగడాలకు హద్దూ అదుపూ లేకుండా పోతోంది. చిన్న చితకా సంస్థల నుంచి మొదలుపెట్టి… బడా బడా కన్స్ట్రక్షన్ కంపెనీల వరకూ అందరూ నిబంధనలను తుంగలో తొక్కేవారే. కొంచెం ఎక్కువ… కొంచం తక్కువ అనే తప్ప… ఉల్లంఘనలకు పాల్పడని వారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే అనేక బడా సంస్థల మోసాలను సీవీఆర్ న్యూస్ బట్టబయలు చేసింది. వంశీరామ్ బిల్డర్స్ నిర్మిస్తున్న మాన్‌హట్టన్ ప్రాజెక్టులోనూ ఇలాంటి అవకతవకలే బయటపడ్డాయి. ఖాజాగూడలోని నానక్ రామ్ గూడ రోడ్డులో దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న మాన్‌హట్టన్ మెగా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ భూములు, చెరువు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్వే నెంబర్ 27 లో ఉన్న ప్రభుత్వ భూమిలోనే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలుస్తోంది…
సోహిని బిల్డర్స్‌తో కలిసి ఈ మెగా వెంచర్‌ను వంశీరామ్ బిల్డర్స్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. 27/2 సర్వే నంబర్లోని 14 ఎకరాల్లో ఈ వెంచర్ నిర్మిస్తుండగా… అందులో చాలా వరకు ప్రభుత్వ, చెరువు భూములున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగతా భూమి కూడా వివాదాల్లోనే ఉందని వారు చెబుతున్నారు. వంద సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో తమ తాత తండ్రులు ఇక్కడ వ్యవసాయం చేశారని… కానీ ఆ తర్వాతి కాలంలో కొంతమంది వ్యాపారవేత్తలు అధికారులతో కుమ్ముక్కై భూమిని అన్యాక్రాంతం చేశారని చెబుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ గోడు ఎవరూ వినలేదని… కళ్లెదుటే భూములు పోతుంటే కడుపు రగిలిపోయి చూస్తున్నామని వారు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకున్న వంశీరామ్ యాజమాన్యం భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకుని.. మాన్ హట్టన్ పేరుతో వెంచర్ నిర్మిస్తున్నారని చెబుతున్నారు…
మరోవైపు కోర్టులో కేసులు ఉన్నప్పటికీ వంశీరామ్ బిల్డర్స్…. వెంచర్ నిర్మాణాన్ని కొనసాగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఐలాపూర్‌లో ఇదే రీతిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి కొందరు భవనాలను నిర్మించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని పలుమార్లు హెచ్చరించినా ఎవరూ వినిపించుకోలేదు. దాని పర్యవసానం అందరూ చూసిందే. హైడ్రా అధికారులు వాస్తవాలను గుర్తించి.. అక్రమ భవనాన్ని కూల్చేశారు. ఇప్పుడు వంశీరామ్ బిల్డర్స్‌కు కూడా భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఎదురవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు నుంచి ఎలాంటి క్లియరెన్సులు రాకముందే నిర్మాణాలు పూర్తి చేస్తే… భవిష్యత్తులో అవి ప్రభుత్వ భూములని తేలితే పరిస్థితి ఏంటని.. మాన్ హట్టన్ వెంచర్లో ఫ్లాట్లు కొన్నవారు ప్రశ్నిస్తున్నారు…
తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేయడమే కాకుండా, లాయర్ సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఎదురుదాడికి దిగారు. ఈ మేరకు ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. లాయర్ సుబ్బారావు తనపై ఫిర్యాదు చేయడానికంటే ముందే, తానే నార్సింగి పోలీసులను ఆశ్రయించానని మంగ్లీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోట్ల కట్టల దృశ్యాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ తేల్చి చెప్పారు. ఆ డబ్బు తనది కాదు, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.లాయర్ సుబ్బారావు ఉద్దేశపూర్వకంగానే తనను బదనాం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు. వ్యక్తిగతంగా కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలతో మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని మంగ్లీ హెచ్చరించారు. ఒక మహిళగా, కళాకారిణిగా సమాజంలో తనకున్న గుర్తింపును దెబ్బతీయాలని చూస్తున్న వారిపై చట్టపరంగా ముందుకెళ్తానని ఆమె వెల్లడించారు
కాగా, మంగ్లీపై పంజాగుట్ట పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మైక్రో ఫైనాన్స్ పేరిట 10కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశారు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో న్యాయవాది పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతిపై పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు పెట్టుబడి మోసానికి సంబంధించిన వ్యవహారంలో బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, ‘విరాటపర్వం’ చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల పేర్లు కూడా చేరడం గమనార్హం.
దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాల ఆశచూపి కోట్లు రూపాయలు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా, కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగా బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ టీమ్ నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.
అయితే, మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు BNS సెక్షన్ 351 (2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్‌లో దర్శకుడు వేణు ఊడుగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిధులు వసూలు చేశారా..లేక ఈ వ్యవహారం వెనుక ఇతర శక్తులు ఉన్నాయా? అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది..
ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమై ఆస్పత్రిలో చికిత్స పొంతుతూ మృతి చెందిన సంఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.లాలాపేటలోని ఇంద్రనగర్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఆదే ప్రాంతానికి చెందిన దిలీప్ ముదిరాజ్ అనే -వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తాజాగా దిలీప్ కు ఫోన్ చేసి తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమంటూ బాలకృష్ణ అడిగాడు, మద్యం మత్తులో ఉన్న దిలీప్ అతడితో దురుసుగా మాట్లాడుతూ డబ్బులు తిరిగివ్వనని తేల్చి చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. దీంతో రాత్రి 10 గంటల సమయంలో దిలీప్ తన సోదరుడు సాయికుమార్ తో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లి డోర్ కొట్టారు. అతడు తలుపు తీసిన వెంటనే వీరి వెంట తెచ్చుకున్న కారంపొడి అతడి కళ్లలో కొట్టి, ఒంటిపై పెట్రోల్ పోశారు. నిప్పంటించే ప్రయత్నం చేస్తుండగా స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వచ్చి వారిని అడ్డుకొని దేహశుద్ది చేసి పంపించారు. అనంతరం, కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన బాలకృష్ణ కుమారుడు ఫణీంద్ర తన తండ్రిపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకున్నాడు. వెంటనే కొపంతో కర్ర పట్టుకొని ఫణీంద్ర, అతని బంధువైన రాకేష్ యాదవ్ కలిసి దిలీప్ ఇంటికి ఆవేశంగా పరుగులు తీశారు. మార్గం మధ్యలో దిలీప్, సాయికుమార్‌లను చూసిన వెంటనే ఫణీంద్ర, రాకేష్ వారిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఫణీంద్ర తన చేతిలో ఉన్న కర్రతో దిలీప్ తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో రక్తశ్రావమై అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దిలీప్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, దిలీప్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఫణీంద్ర, రాకేష్ యాదవ్ పై హత్య కేసు నమోదు చేశారు. అదే విధంగా బాలకృష్ణపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసిన సాయికుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సినిమా పైరసీ కేసులో ‘ఐబొమ్మ’ రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని, తన పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో గతేడాది నవంబరులో అతడు అరెస్టయ్యాడు. అతడిపై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా.ఒక కేసులో మాత్రం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.