వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీనగర్ ఫ్యాబ్ సిటీలో ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు యువ నాయకులు కార్తీక్ రెడ్డితో కలిసి పి. సబితా ఇంద్రారెడ్డి ఉత్తరద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు సబితా ఇంద్రా రెడ్డి ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Devotional
కదిరి పట్టణంలో వెలసిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. రాత్రి 12 గంటల నుండి భక్తులు క్యూ లైన్ లో స్వామి దర్శనానికి వేచి ఉండగా తెల్లవారుజామున మూడున్నర గంటలకి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులను అనుమతించగా గోవింద నామస్మరణతో తిరువీధులు మారుమ్రోగాయి. ఎంతో విశిష్టమైన ఈ పర్వదినాన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, ఆలయ ఈవో వెండిదండి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ గోపాలకృష్ణ, పాలకమండ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఇదే రోజు శ్రీకృష్ణుడు అర్జునికి మహాభారత యుద్ధంలో ఉపదేశించాడని భక్తుల విశ్వాసం ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని వరంగల్ నగరంలోని బట్టల బజార్ లోని ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే కోటి పుణ్యాలకు సాటి అని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకని ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకుంటారు. బట్టల బజార్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం 4 గంటల నుండి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రత్యేక పూజలు అనంతరం దక్షిణ ద్వార స్వామివారి దర్శనం భక్తులకు కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
సికింద్రాబాద్ జనరల్ బజార్ లో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ కమిటీ ఈవో, ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ.. సుమారు 100 సంవత్సరాల క్రితం మా కుటుంబీకులు ఈ ఆలయాన్ని స్థాపించారని తెలిపారు. వంశపారపర్యంగా మేము సేవలు చేస్తూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలియజేశారు. ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ సమిష్టిగా సేవలో కానీ, అభివృద్ధిలో కానీ కలిసి పని చేస్తూ ముందుకు వెళ్తామని తెలియజేశారు.
Read Also..
జమ్మలమడుగు పట్టణంలోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున నుంచి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి రాజేష్ స్వామి వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినం విశిష్టతను తెలియజేశారు. ఈ రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి శుభం కలుగుతాయని తెలిపారు. ఈ సందర్బంగా టిటిడి అధికారులు భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. శ్రీ నారాపురం వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంలో భక్తులకు ఉత్తర మార్గంలో దర్శనమిచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులకు శ్రీవారి సేవా సమితి జమ్మలమడుగు సభ్యులు ప్రసాద వితరణ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ స్వామి ఆలయంలో ముక్కోటి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంలో దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు వైకుంఠ ద్వార దర్శనానికి విచ్చేశారు. తమిళనాడులోని శ్రీ పెరంబదూర్ లో ఆలయ సాంప్రదాయ పద్ధతిలోనే ఇక్కడ కూడా స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది.
సింహపురి సీమలో, పవిత్ర పెన్నా నది తీరాన, ఉత్తర శ్రీరంగంగా పేరుగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ తల్పగిరి రంగనాథుడి ఉత్తర ద్వార దర్శనం కోసం అర్థరాత్రి నుంచి భక్తులు ఆలయంలో వేచి ఉన్నారు. రంగనాథుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించే భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాట్లు చేసి, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ముక్కోటి ఏకాదశి పర్వదినంతో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ప్రాంగణం హరినామస్మరణతో మారుమోగింది.
భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వారా దర్శనం కోసం పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. శ్రీవారిని దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులను అర్ధరాత్రి నుండే క్యూ కాంప్లెక్స్ల్లోకి అనుమతించారు. అర్దరాత్రి నుండి తిరుప్పావై పాశుర పఠనం అరంభమైంది. శ్రీవారిని సీవీఆర్ న్యూస్ చైర్మన్ చలసాని వెంకటేశ్వరరావు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శిల్ప అవెన్యూ, తులసి వనంలో అందంగా ముస్తబైన ఆలయాలు , హరి నామస్మరణతో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు. గుడి అర్చకులు శ్రీహరి మాట్లాడుతూ ఈ రోజు స్వామి వారి దర్శనం ప్రతి ఒక్కరు చేసుకుని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు తెలిపారు అదేవిధంగా ముక్కోటి ఏకాదశి విశిషటత గురించి వివరించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి ప్రాతఃకాల పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులను పల్లకి సేవ లో ప్రతిష్టించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. తదుపరి రంగురంగుల పూలతో అలంకరించిన అంబారి సేవపై శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన అనంతరం రాజగోపురం గుండా స్వామివారు బయటకు రాగానే వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాటు వేలాది భక్తులు పాల్గొన్నారు.