హమాస్ దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై వైట్ హౌస్ స్పందించింది. భారత్‌లో జరిగిన జీ-20 సదస్సులో భారత్-పశ్చిమాసియా- ఐరోపా ఆర్థిక నడవా నిర్మించాలని నిర్ణయించడమే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు కారణం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ఆరోపించారు. తాజాగా దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. అమెరికా జాతీయ భద్రతా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వివరణ ఇచ్చారు. బైడెన్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆ వ్యాఖ్యల తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. ”మీరు బైడెన్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నానన్నారు. ఇజ్రాయెల్-సౌదీ అరేబియా దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందాన్ని ఆయన విశ్వసిస్తున్నారని వెల్లడించారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాల్లో ముఖ్యమైన అడుగని భావిస్తున్నారని తెలిపారు. ఇదే హమాస్ దాడుల్ని ప్రేరేపించి ఉండొచ్చనే అభిప్రాయాన్ని ఈ మాటలనే తప్పుగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నానని కిర్బీ వెల్లడించారు.
Latest News
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దేశానికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. ప్రపంచదేశాలు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అందరూ చాలా ఉత్సుకత ప్రదర్శించారు. ఈ ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో అక్కడి ఉపరితలంపై దాదాపు 2.06 టన్నుల దుమ్ము గాల్లోకి లేచింది. మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కిందపడ్డాయని హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టులు గుర్తించారు. చంద్రుడి కక్షలోనే తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు ఈ పరిణామాన్ని విశ్లేషించారు. ల్యాండింగ్‌కు కొన్ని గంటల సమయం ముందు, ఆ తర్వాత తీసిన ఫొటోలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. డిసెంట్ స్టేజ్ రాకెట్ల ప్రజ్వలన ప్రక్రియ కారణంగా భారీగా దుమ్ము పైకి లేచినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. కాగా.. దుమ్ము భారీగా ఎగిసిపడిన ప్రభావంతో ఆ ప్రాంతం ప్రకాశవంతంగా మారింది. ఇలా జరగడాన్ని ‘ఎజెక్టా హాలో’ అని అంటారు. దాదాపు 108.4 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రభావం కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరిణామాల సమయంలో చంద్రుడి దుమ్ము ప్రతిస్పందన తీరును తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ షాంఘైలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 12.10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం జీ జిన్‌పింగ్‌తో పోటీ పడ్డారు. చివరికి ఆయన నంబర్-2 స్థానంతో సరిపెట్టుకున్నారు. 2013 నుంచి 2023 వరకు ప్రధానిగా పనిచేశారు. చైనా ఆర్థిక వ్యవస్థను ఆయన సమర్థంగా నిర్వహించారనే పేరుంది.
దక్షిణ చైనా సముద్రంపై తమ యుద్ధ విమానానికి అత్యంత సమీపంలో చైనా ఫైటర్ జెట్ దూకుడుగా ప్రయాణించిందని అమెరికా సైన్యం వెల్లడించింది. చైనా పైలట్ చర్య ప్రమాదకరంగా ఉందని దుయ్యబట్టింది. అమెరికా వాయుసేనకు చెందిన బి-52 బాంబర్‌కు చాలా దగ్గరగా ప్రయాణించిందని ఆగ్రరాజ్యం మండిపడింది. మా విమానానికి 10 అడుగుల దూరంలోకి నియంత్రణ లేకుండా వేగంగా దూసుకొచ్చింది. బి-52కు ముందువైపునకు, కింది భాగంలోకి వచ్చింది. ఈ చర్య రెండు విమానాలను ప్రమాదపు అంచుల్లోకి నెట్టింది. విమానాన్ని ఢీకొట్టేంత దగ్గరగా వచ్చిన విషయం చైనా పైలట్‌కు తెలియకపోవడం ఆందోళనకరం ఉందని అమెరికా సైన్యం పేర్కొంది. ఈ వ్యాఖ్యలను చైనా విదేశాంగ శాఖ ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే అమెరికా బాంబర్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని…అందుకే దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తోందని వ్యాఖ్యానించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి మరికొందరు సీనియర్ రాజకీయ నేతలు చేరారు. శుక్రవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్‌తో పాటు పటాన్‌చెరుకు చెందిన బీఆర్ఎస్ నేత నీలం మధు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. మరోవైపు, మనుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ గురువారం రాత్రి మాణిక్ రావ్ ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల వేళ వీరి చేరిక తమ పార్టీకి ఎంతో బలాన్నిస్తుందని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ అవినీతి పాలనను తిరస్కరిస్తున్నారంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో పేర్కొంది.
తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో అమిత్‌షా పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీ.. రాహుల్‌ను ప్రధానిని చేయాలని చూస్తుంటే. కేసీఆర్ తన తనయుడు కేటీఆర్‌ను సీఎంను చేయాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యమని విమర్శించారు. బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుందన్నారు.కేసీఆర్ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలన్నారు. బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగ బద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. సమ్మక్క-సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోదీ ముందుకు వచ్చారని, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారని అమిత్ షా తెలిపారు.
తిరుమల నడకదారిలో లక్షిత అనే బాలికను చిరుతపులి పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ ఘటన జరిగాక నడకదారి వెంబడి సంచరించే పలు చిరుతలను అటవీశాఖ సహకారంతో టీటీడీ బంధించింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో చిరుతల సంచారం లేదు. తాజాగా, అలిపిరి నడకమార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి కమ్యూనికేషన్స్ రిపీటర్ స్టేషన్ మధ్య ప్రాంతంలో చిరుత సంచరిస్తూ కనిపించింది. ట్రాప్ కెమెరాలో ఈ మేరకు రికార్డయింది. ఈ ప్రాంతంలో ఓ ఎలుగుబంటి కూడా తిరుగుతున్నట్టు కెమెరా ఫుటేజిల్లో వెల్లడైంది.ఈ నేపథ్యంలో, టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. నడకదారిలో వెళ్లే భక్తులు గుంపులుగా వెళ్లాలని స్పష్టం చేసింది. లక్షిత ఘటన జరిగాక, ఘాట్ రోడ్లలో బైకులపై వెళ్లేవారిపై ఆంక్షలు విధించిన టీటీడీ. కొన్ని రోజుల కిందటే ఆ ఆంక్షలు సడలించింది. ఇప్పుడు మరోసారి చిరుత కలకలం రేగిన నేపథ్యంలో, మరోసారి ఆంక్షలు విధిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
హెచ్‌సీఏలో నిధులు గోల్మాల్ కేసులో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ మల్కాజ్గిరి కోర్టులో ఈ మేరకు పిటిషన్ వేశారు. నిధుల అవకతవకల వ్యవహారం వెలుగుచూశాక ఉప్పల్ పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే తాజాగా కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై నవంబర్ 1న విచారణ జరగనుంది. ఇదిలావుండగా టెండర్ల పేరుతో నిధులను థర్డ్ పార్టీకి కట్టబెట్టారని తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అన్ని విషయాలను పరీలించిన తర్వాత జస్టిస్ లావ్ నాగేశ్వర్రావు కమిటీ నాలుగు కేసులు నమోదు చేసింది. 2020 -2023 మధ్య నిధులు గోల్మాల్ చేశారని రిపోర్ట్ పేర్కొంది. క్రికెట్ బాల్స్ కొనుగోలులో ఒక్కో బంతిని 392 రూపాయలకు బదులు 1400 రూపాయలు వర్క్ ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. బాల్స్ కొనుగోలులె 57 లక్షలు నష్, జిమ్ పరికరాల పేరిట 1.53 కోట్లు, బకెట్ చైర్స్ కొనుగోలులో 43 లక్షలు. ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరిట 1.50 కోట్ల మేర హెచ్‌సీఏకి నష్టం వచ్చేలా చేశారని రిపోర్ట్ పేర్కొంది.
తెలంగాణ ఎన్నికల సమరాంగణంలో అధికార బీఆర్ఎస్ తో అమీతుమీ తేల్చుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండో జాబితా విడుదల చేసింది. ఈ నెల 23న 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్. నేడు 45 మందితో రెండో జాబితా ప్రకటించింది. ఇవాళ కాంగ్రెస్ గూటికి తిరిగొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ టికెట్ లభించింది. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మధుయాష్కీ గౌడ్ తదితరులు కూడా రెండో జాబితాలో టికెట్లు పొందారు.
ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నియామకాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఆర్డర్ నెం.77 మేరకు ఈ రిజర్వేషన్‌ను అమలు చేయనున్నట్టు పేర్కొంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం, చెవిటివారు, అంధులు, మెదడు పక్షవాతం, కుష్టు, మరుగుజ్జు, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, ఆటిజం, మానసిక రోగాల వారు దివ్యాంగుల జాబితాలో చేర్చారు. అయితే, ఉద్యోగానికి సంబంధించి ఇతర నిబంధనలకు లోబడే రిజర్వేషన్ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగార్హతలతో పాటుగా 100 శాతం దివ్యాంగులై ఉండాలని పేర్కొంది. దివ్యాంగుల కమిషన్ వెబ్సైట్లో లబ్ధిదారులు తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.





Total views : 194943