Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh పారదర్శకత కోసం మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు..

పారదర్శకత కోసం మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు..

by CVR NEWS

రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలలో రుసుము వసూళ్లను పారదర్శకంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో మార్కెటింగ్ యార్డులలో 568 కోట్లతో 630 అభివృద్ధి పనులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వీటిలో 128 కోట్ల విలువైన 113 పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. సచివాలయంలో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇంకా కొన్ని చోట్ల జీరో బిజినెస్ జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వస్తోందని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. అక్రమాలకు పాల్పడే ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేయడానికి వెనుకాడవద్దని, దీనికి ఎవరైనా అధికారులు సహకరిస్తే వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, వాటి పురోగతిని ప్రతిరోజూ సమీక్షించేలా ఒక డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెట్ యార్డులకు వచ్చే రైతులకు అవసరమైన సౌకర్యాలను ప్రాధాన్యత క్రమంలో కల్పించాలని సూచించారు. గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీలో స్మార్ట్ మార్కెట్ యార్డ్ సాఫ్ట్‌వేర్ పనితీరును పరిశీలించి, ఫలితాలు ఆశాజనకంగా ఉంటే అన్ని మార్కెట్ యార్డులను డిజిటలైజేషన్ చేసి జీరో బిజినెస్‌ను అరికట్టాలని పేర్కొన్నారు.

కోహెడ పండ్ల మార్కెట్ పనులకు సంబంధించి సర్వే పూర్తయిందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి పనికి ప్రారంభ తేదీ, గడువు తేదీని నిర్ణయించుకుని నిర్దిష్ట కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు గ్రిడ్ అనుసంధానంతో కూడిన సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. జూలై చివరికల్లా ఈ పనులు పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టారు.

ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన తార్పాలిన్లు, తేమ కొలిచే పరికరాలు, క్లీనింగ్ డ్రైయర్లను అన్ని కేంద్రాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. మొక్కజొన్న పండించిన రైతులను ఆదుకునేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరపాలని సూచించారు. డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముఖ్యమంత్రి అనుమతితో నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

018819
Total views : 89480

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.