భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి, దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిన పలు కీలక మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. జార్ఖండ్ హైకోర్టులో తీర్పుల వెల్లడి, వాటి అప్లోడింగ్లో జరుగుతున్న సుదీర్ఘ ఆలస్యంపై దాఖలైన ఒక కేసు విచారణ సందర్భంగా సుమున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పును వెలువరించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంచలన ఆదేశాలను ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం.. హైకోర్టులు తాము రిజర్వ్ చేసిన తీర్పులను గరిష్ఠంగా మూడు నెలల లోపు తప్పనిసరిగా వెల్లడించాలి. అలాగే బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజు ఇవ్వాలని, ఒకవేళ ఆర్డర్‌ను రిజర్వ్ చేస్తే మరుసటి రోజే దానిని కచ్చితంగా వెల్లడించాలని స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను తక్షణమే ట్రయల్ కోర్టులకు సమాచారం అందించాలని, బెయిల్ పొందిన విచారణ ఖైదీలను అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి, అదే రోజు విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
న్యాయస్థానాలు తీర్పులను ప్రకటించిన 24 గంటల లోపు వాటిని ఆయా హైకోర్టుల అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని ధర్మాసనం పేర్కొంది. అంతేకాకుండా, ఒక తీర్పులోని ప్రధాన కార్యాచరణ భాగాన్ని ప్రకటించిన తేదీనే, ఆ తీర్పు వెల్లడించిన పూర్తి తేదీగా పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. వేలాది మంది ప్రజలు న్యాయం కోసం ఆశ్రయించే ప్రాథమిక సంస్థలు హైకోర్టులేనని, అందువల్ల సకాలంలో తీర్పులు ఇవ్వడం అత్యంత ఆవశ్యకమని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. అయితే, ఈ మార్గదర్శకాలు ఏ ఒక్క వ్యక్తిగత న్యాయమూర్తిని, వ్యవస్థను ఉద్దేశించి చేసిన విమర్శలు కావని కోర్టు స్పష్టం చేసింది.
National
ఒకప్పుడు భారత దేశ ఎడ్టెక్ రంగాన్ని శాసించిన బైజూస్ సంస్థ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అంతేకాదు, భారీ మొత్తంలో న్యాయపరమైన ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. బీర్ ఇన్వెస్ట్‌కో సంస్థకు సంబంధించిన యాజమాన్య పత్రాలు సమర్పించాలన్న కోర్టు ఆదేశాలను ఆయన పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కోర్టు ధిక్కరణ కేసులో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వేల కోట్ల విలువ కలిగిన స్టార్టప్‌ను నిర్మించిన రవీంద్రన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో సంస్థలోని పెట్టుబడిదారులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం బైజూస్ భవిష్యత్తుపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.
బైజూస్ పతనం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. 2022లో దాదాపు 22 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఈ సంస్థ, ప్రస్తుతం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కంపెనీ విలువను భారీగా తగ్గించాయి. ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఒకప్పుడు స్థానం సంపాదించిన బైజు రవీంద్రన్, ఇప్పుడు ఆ జాబితా నుంచి పూర్తిగా బయటకు వెళ్లిపోయారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో వాటాదారులు ఆయనను సీఈఓ పదవి నుంచి తప్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావడం, వ్యాపార కార్యకలాపాలు మందగించడం, అప్పులు పెరగడం సంస్థను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. ఒకప్పుడు భారత్ కు చెందిన ఈ స్టార్టప్ ప్రపంచానికి ప్రతీకగా నిలిచింది . బైజూస్ ఇప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలకు ఉదాహరణగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. కంపెనీ పునరుద్ధరణ సాధ్యమా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ చర్చకు దారితీస్తోంది.
సింగపూర్ కేసుతో పాటు అమెరికాలో కూడా బైజు రవీంద్రన్‌కు భారీ చట్టపరమైన ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోన్ ఒప్పందాలను ఉల్లంఘించి వేల కోట్ల రూపాయలను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలపై అమెరికా కోర్టు డిఫాల్ట్ జడ్జ్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. తీసుకున్న నిధులను సొంత అనుబంధ సంస్థలకు బదిలీ చేశారనే ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇదే సమయంలో భారత్‌లో కూడా ఈడీ, జీఎస్టీ విభాగాలు, ఇతర ఆర్థిక సంస్థలు బైజూస్ వ్యవహారాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఫెమా ఉల్లంఘనలు, పన్నుల ఎగవేత, స్పాన్సర్షిప్ బకాయిలు, ఇన్సాల్వెన్సీ కేసులు సంస్థను చుట్టుముట్టాయి. ఒకప్పుడు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంస్థ ఇప్పుడు న్యాయపరమైన పోరాటాల్లో చిక్కుకుపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్టార్టప్‌లలో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ ఎంత ముఖ్యమో బైజూస్ ఉదంతం మరోసారి గుర్తు చేస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.చూడాలి బైజూస్ వ్యవహారం ఎటు వెళ్తుందో మరి .
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. భారీ వర్షం, ఈదురుగాలులు, ధూళి మేఘాలతో పలువురు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గాల్లోనే పది కి పైగా విమానాలు చక్కర్లు కొట్టాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం కూడా తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది.
ఇక హైదరాబాద్-ఢిల్లీ ఇండిగో విమానానికి కూడా జైపూర్‌కు వెళ్లాలని ఏటీసీ సూచించింది. అయితే విమానంలో సరిపడా ఇంధనం లేదని పైలట్ తెలియజేయడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు. తీవ్ర ప్రతికూల వాతావరణంలోనే పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18వ రైల్వే జోన్ ‘దక్షిణ కోస్తా రైల్వే’ జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు, తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డివిజన్‌ను పునర్వ్యవస్థీకరించి ‘విశాఖపట్నం డివిజన్’గా మార్చి కొత్త జోన్లో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని హామీ మేరకు ఈ ప్రాంతంలో రైల్వే పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ జోన్ ఏర్పాటు ప్రక్రియ ఇప్పుడు కార్యరూపం దాల్చింది.
ఈ పునర్వ్యవస్థీకరణతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధి గణనీయంగా తగ్గనుంది. ప్రస్తుతం ఆరు డివిజన్లు ఉండగా, ఇకపై హైదరాబాద్, నాందేడ్, పునర్వ్యవస్థీకరించిన సికింద్రాబాద్ డివిజన్లతో మాత్రమే కొనసాగుతుంది. కార్యకలాపాల సౌలభ్యం కోసం పలాస-ఇచ్ఛాపురం, రాయచూరు-వాడి వంటి కొన్ని సెక్షన్లను కూడా సర్దుబాటు చేశారు.
కొత్త జోన్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం కావడంతో పాటు, పాలనా సామర్థ్యం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. జూన్ 1న కార్యకలాపాలు ప్రారంభించేందుకు రైల్వే ఉన్నతాధికారులు ఏర్పాట్లను సమీక్షించారు. విశాఖలో తాత్కాలిక భవనంలో జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానుండగా, శాశ్వత భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
సౌదీ అరేబియా జైల్లో గత 20 ఏళ్లుగా మరణశిక్షను ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది.
సౌదీ అరేబియా జైల్లో గత 20 ఏళ్లుగా మరణశిక్షను ఎదుర్కొంటూ నరకయాతన అనుభవించిన కేరళకు చెందిన అబ్దుల్ రహీమ్‌కు ఎట్టకేలకు విముక్తి లభించింది. సౌదీ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించడంతో అబ్దుల్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. కేరళలోని కోజికోడ్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రహీమ్ బతుకుదెరువు కోసం 2006లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ ఒక అరబ్ కుటుంబంలో కారు డ్రైవర్‌గా, అదే ఇంట్లోనే ఉన్న 15 ఏళ్ల పారలైజ్డ్ బాలుడికి కేర్ టేకర్‌గా చేరాడు. ఆ బాలుడు మెడకు అమర్చిన ఒక ప్రత్యేక వైద్య పరికరం సాయంతో శ్వాస తీసుకునేవాడు. ఒకరోజు కారులో వెళ్తున్న సమయంలో ఆ బాలుడు తీవ్రంగా గొడవ చేయడంతో, అతడిని వారించే క్రమంలో రహీమ్ చేయి ప్రమాదవశాత్తు ఆ శ్వాస పరికరానికి తగిలి అది ఊడిపోయింది. దాంతో ఆ బాలుడు క్షణాల వ్యవధిలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సౌదీ పోలీసులు రహీమ్‌పై హత్య కేసు నమోదు చేశారు. అది తాను కావాలని చేసింది కాదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిందని రహీమ్ ఎంత మొరపెట్టుకున్నప్పటికీ స్థానిక న్యాయస్థానం అతడికి మరణశిక్ష విధించింది. దీనిపై పైకోర్టులకు వెళ్లినప్పటికీ, 2022లో అప్పీలు కోర్టు, ఆ తర్వాత సౌదీ సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు విధించిన మరణశిక్షను సమర్థించాయి. దాంతో రహీమ్ ప్రాణాలు దక్కడం అసాధ్యమని అందరూ భావించారు. అయితే, సౌదీ చట్టాల ప్రకారం బాధిత కుటుంబం ‘బ్లడ్‌మనీ’ (పరిహారం) తీసుకుని క్షమిస్తేనే నిందితుడికి ప్రాణభిక్ష లభిస్తుంది.
ఈ కేసును మానవతా కోణంలో పరిశీలించాలని కేరళ సమాజంతో పాటు గల్ఫ్ దేశాల్లోని NRI గ్రూప్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాయి. ఇందుకోసం ‘అబ్దుల్ రహీమ్ లీగల్ అసిస్టెన్స్ కమిటీ’ని ఏర్పాటు చేసి, ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రౌడ్ ఫండింగ్ చేపట్టారు. కేవలం కొద్దిరోజుల్లోనే ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది స్పందించి, బాధిత అరబ్ కుటుంబం డిమాండ్ చేసిన 1.5 మిలియన్ సౌదీ రియాల్స్ భారీ మొత్తాన్ని సేకరించారు. సేకరించిన ఈ బ్లడ్‌మనీని 2024లో సౌదీ కోర్టు ద్వారా బాధిత కుటుంబానికి అందజేయడంతో, వారు రహీమ్‌ను క్షమించేందుకు అంగీకరించారు. ఆ తర్వాత కోర్టు మరణశిక్షను రద్దు చేసి, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసింది. అప్పటికే దాదాపు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అబ్దుల్ రహీమ్‌ను సౌదీ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసి భారత్‌కు పంపించివేసింది. ఇరవై ఏళ్ల తర్వాత కొడుకు తిరిగి వస్తుండటంతో కేరళలోని రహీమ్ కుటుంబంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని అందుకున్నాయి. మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఆయుధ తయారీ కర్మాగారాన్ని గడ్చిరోలి పోలీసులు విజయవంతంగా ధ్వంసం చేశారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన కీలక సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ సాగింది. ఇటీవల ‘ఆపరేషన్ అంతిమ ప్రహార్’ కింద కొందరు మావోయిస్టులు గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. వారిని పోలీసులు లోతుగా విచారించగా, అటవీ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీ సామగ్రిని భూమిలో పాతిపెట్టినట్లు వెల్లడించారు. ఈ సమాచారంతో గడ్చిరోలి పోలీస్ సూపరింటెండెంట్ ఎం. రమేష్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక ఆపరేషన్ బృందాలు రంగంలోకి దిగాయి. గడ్చిరోలి, ప్రాణహిత సంయుక్త బృందాలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కలసి అడవిని జల్లెడ పట్టాయి. పోమ్కేం బినాగుండా ఉత్తర అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా, భూమిలో దాచిన భారీ ఆయుధ కర్మాగారం బయటపడింది. భద్రతా దళాలకు హాని కలిగించేందుకు, నక్సల్ వారోత్సవాలు, ఎన్నికల సమయంలో విరుచుకుపడేందుకు మావోయిస్టులు వీటిని దాచినట్లు సమాచారం. అయితే, ప్రమాదకరమైన ఈ సామగ్రి మొత్తాన్ని జవాన్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనా స్థలంలోనే పూర్తిగా ధ్వంసం చేశారు. గడ్చిరోలి జిల్లాలో మావోయిజం ఇప్పుడు దాదాపు అంతమైపోయిందని, అడవుల్లో దాచిన సామగ్రిని వెలికితీయడం పోలీసు దళం సాధించిన పెద్ద విజయమని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భద్రతా దళాలను అభినందించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో బీజేపీ చేపట్టిన రైతుగోస బిజెపి భరోసా కార్యక్రమం రైతు గోస కాదు బిజెపి గోస అని, రైతులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు ఈ యాత్ర చేపట్టి రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ తీవ్రంగా విమర్శించారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం 56 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు పెట్టినప్పటికీ తాము ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైచిలుకు కొనుగోలు చేసి రైతులకు అండదండగా ఉన్నామని, ఇంత చేస్తున్నా బిజెపి రాష్ట్ర నాయకులు కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వాన్ని రైతుల పక్షంగా నిలదీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కృత్రిమ రాజకీయం చేస్తన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ధాన్యం చివరికి గింజ వరకు కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. కళ్ళల్లోకి ఎక్కడికి వెళ్ళినా రైతులు తమను సాధరంగా ఆహ్వానించి తమ సమస్యలు చెప్పుకుంటున్నారని, బిజెపికి పూట గడవక ఈ యాత్రను చేస్తుందని బొజ్జు పటేల్ విమర్శించారు.
‘కరుప్పు’ తమిళ సినిమాపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందనే విషయాన్ని పూర్తిగా ఖండించలేమని పేర్కొంటూ.. కళాత్మక స్వేచ్ఛకు మద్దతుగా ధర్మాసనం అభిప్రాయపడింది. గతంలోనూ అవినీతి జడ్జీలు ఉన్నారని, ప్రస్తుతం కూడా అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. తప్పుడు పనులు చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు కోర్టు పేర్కొంది. సినిమాలో చూపించిన కోర్టు పూర్తిగా ఊహాజనితమని, అందువల్ల దీనికి కోర్టు ధిక్కరణ చట్టం వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. సినిమాల్లో విషయాలను అతిశయోక్తిగా చూపించడం సహజమని, సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత సినిమాను అడ్డుకోవడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది
భార్యాభర్తల మధ్య జరిగే గొడవల్లో అత్తమామలు మౌనంగా ఉంటే వారిపై వరకట్న వేధింపుల కేసులు పెట్టలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నైతికంగా ఆ ప్రవర్తన తప్పు కావచ్చు కానీ, దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. భర్త కుటుంబ సభ్యులందరినీ గుడ్డిగా కేసుల్లోకి లాగడం సరికాదని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌తో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. భర్తకు మద్దతు ఇచ్చారనో, గొడవల్లో జోక్యం చేసుకోలేదనో లేదా సర్దుకుపోవాలని సలహా ఇచ్చారనో చెప్పి కుటుంబ సభ్యులపై క్రిమినల్ చట్టాలను ప్రయోగించలేమని కోర్టు స్పష్టం చేసింది. నేరంలో వారి ప్రత్యక్ష భాగస్వామ్యం లేదా నిర్దిష్టమైన పాత్ర ఉంటే తప్ప కేవలం సాధారణ ఆరోపణలతో అత్తమామలను దోషులుగా నిలబెట్టలేమని ధర్మాసనం వివరించింది.
మధ్యప్రదేశ్‌లోని గుణా ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త, అత్తమామలపై పెట్టిన వరకట్న వేధింపుల కేసును సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొట్టివేసింది. సదరు మహిళ తన అత్తమామలపై ఎలాంటి నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదని కోర్టు గుర్తించింది. విఫలమైన వివాహ బంధంలో మహిళ పడే వేదనను తక్కువ చేసి చూడలేమని చెబుతూనే ఇలాంటి వైవాహిక వివాదాల కేసులను విచారించేటప్పుడు కింది కోర్టులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆరోపణలను క్షుణ్నంగా పరిశీలించాలని సూచించింది. వైవాహిక వివాదాల్లో తీవ్రమైన భావోద్వేగాలు, వ్యక్తిగత కక్షలు దాగి ఉంటాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి సమయాల్లో కేవలం భర్తపైనే కాకుండా, గొడవలతో ఎలాంటి సంబంధం లేని అతని కుటుంబ సభ్యులందరినీ కేసుల్లో ఇరికించే ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. నిందితులుగా చేర్చిన వారు నిజంగానే క్రూరత్వానికి పాల్పడ్డారా? లేదా? అదనపు కట్నం కోసం వేధించారా అనేదానికి పక్కా ఆధారాలు ఉండటం చట్టప్రకారం ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.
పర్యావరణ హితమైన, సుస్థిర రవాణా దిశగా భారత రైల్వే ఒక చరిత్రాత్మక ముందడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే రైలును ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో 10 బోగీలతో కూడిన ఈ హైడ్రోజన్ రైలును నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. దీనికోసం 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలజీలో హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో కేవలం నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. దీంతో సంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే కాలుష్యం పూర్తిగా ఉండదు. ఈ చొరవతో హైడ్రోజన్ టెక్నాలజీని రైల్వే రంగంలో పరీక్షిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గాన్ని ఈ పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. రైలుకు అవసరమైన హైడ్రోజన్ ఇంధనాన్ని నింపేందుకు జింద్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో రీఫ్యూయలింగ్, నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్రెస్డ్ హైడ్రోజన్ గ్యాస్ నిల్వ, పంపిణీ కోసం పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి అవసరమైన లైసెన్సు కూడా లభించింది.
ప్రయాణికుల భద్రతకు రైల్వే అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జింద్‌లోని రీఫ్యూయలింగ్ కేంద్రంలో హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లతో సహా పలు భద్రతా సెన్సార్లను ఏర్పాటు చేశారు. రైలు నిర్వహణ కోసం షకుర్బస్తీలో ఏర్పాటు చేయనున్న ఫెసిలిటీలో కూడా కఠినమైన భద్రతా ప్రమాణాలను అమలు చేయనున్నారు. ఆర్డీఎస్వో ఆమోదించిన నిబంధనల ప్రకారం రైలు నిర్వహణ జరుగుతుందని, శిక్షణ పొందిన సిబ్బంది 24 గంటల పర్యవేక్షణలో ఉంటారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రారంభ దశలో రైలుతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా ప్రయాణించి, పనితీరును పర్యవేక్షిస్తారు. ఆవిష్కరణలు, ఇంధన సామర్థ్యం, పర్యావరణ హిత రవాణా పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నామని భారత రైల్వే తెలిపింది. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించి, నెట్-జీరో లక్ష్యాలను చేరుకునేందుకు ఈ హైడ్రోజన్ రైలు ఎంతగానో దోహదపడుతుందని రైల్వేశాఖ తెలిపింది.