ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్లో అత్యవసరంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సినిమా పరిశ్రమను వేధిస్తున్న ‘సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం’, ఎగ్జిబిటర్ల సమస్యలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. థియేటర్ల నిర్వహణ వ్యయం, నెలవారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. థియేటర్ల యజమానులపై భారం తగ్గించేందుకు విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఇచ్చేలా ప్రభుత్వ పరంగా నిర్దిష్టమైన పాలసీని రూపొందించాలని కోరారు. మల్టీఫ్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్స్‌లోనూ వచ్చిన లాభాల్లో ప్రొడ్యూసర్స్ నుంచి పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తేనే థియేటర్లు నిలదొక్కుకుంటాయని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, వై. రవిశంకర్, సాహు గారపాటి, కిలారి సతీష్ తదితరులు పాల్గొన్నారు.నిర్మాతలు వివరించిన సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. సినీ రంగ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రొడ్యూసర్ల ప్రతిపాదనలను తక్షణమే పరిశీలించాల్సిందిగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌కు పవన్ సూచించినట్లు సమాచారం.
Tag:






Total views : 90581