మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి.. తన భార్య దానమ్మతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈమేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నరహరి లొంగుబాటుతో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి అని, డిగ్రీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిపోయారన్నారు. 1982లో అజ్ఞాత దళ సభ్యుడిగా పసునూరి నరహరి చేరారన్నారు. 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారని, తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, గ్రనేడ్ల తయారీలో ఆయన నిపుణుడని డీజీపీ వివరించారు. సాంకేతిక, సంస్థాగత బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తిస్తూనే.. ఆయుధాల ఉత్పత్తి, మరమ్మతు, నిర్వహణకు సంబంధించి మావోయిస్టు కార్యకర్తలకు నరహరి శిక్షణ ఇచ్చేవారని తెలిపారు.
మావోయిస్టు కార్యకలాపాలను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని సూచించారు. తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలు.. గణపతి, జాడే సుజాత, వార్త శేఖర్ మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని, లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సాయమందిస్తోందని డీజీపీ తెలిపారు.





Total views : 90331