హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణంలో సరికొత్త అధ్యాయం మొదలైంది! భాగ్యనగర ప్రజా రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రోకు ఏకంగా రూ.13,600 కోట్ల భారీ రీఫైనాన్సింగ్ లభించింది. న్యూఢిల్లీ వేదికగా.. ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు సమక్షంలో ఎల్అండ్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది.అయితే ఈ డీల్ వెనుక ఉన్న అసలైన మైలురాయి ఏంటంటే.. లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ నుంచి 100 శాతం యాజమాన్య హక్కులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ కానున్నాయి. అంటే.. ఇకపై హైదరాబాద్ మెట్రో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కీలక ప్రజా రవాణా ఆస్తిగా మారబోతోంది.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణ రావు స్పష్టం చేశారు. 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితితో కుదిరిన ఈ రుణ ఒప్పందం వల్ల మెట్రోపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా.. భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు విపరీతమైన ఆర్థిక వెసులుబాటు కలగనుంది. తద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి వసతులు లభిస్తాయని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
#హైదరాబాద్‌మెట్రో #మెట్రోసెకండ్ఫేజ్ #కిషన్‌రెడ్డి #మనోహర్లాల్ఖట్టర్ #తెలంగాణఅభివృద్ధి #హైదరాబాద్వార్తలు #మెట్రోరైలు #కేంద్రప్రభుత్వం #ఇన్ఫ్రాస్ట్రక్చర్ #అభివృద్ధిప్రాజెక్టులు
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో కొనసాగుతున్న వివిధ కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. నగరాభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, ప్రజారవాణాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఖట్టర్‌తో భేటీకి సంబంధించిన వివరాలపై ఓ ప్రకటన విడుదల చేశారు కిషన్‌రెడ్డి.
హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చ జరిగిందని తెలిపారు కిషన్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ సంస్థ నుంచి టేకోవర్ చేసుకున్న నేపథ్యంలో మిగిలిన రెండోదశ పనులకు సంబంధించిన DPR, ఇతర సాంకేతిక వివరాలు అందిన తర్వాత..కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రెండోదశ ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 ఖర్చుచేసే ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భాగ్యనగరంలోని మూసీనది పారిశుద్ధ్యానికి సంబంధించిన అంశంపైనా చర్చ జరిగిందని చెప్పారు కిషన్‌రెడ్డి. మూసీ నదిలో కలుస్తున్న మురుగునీటి శుద్ధికి అమృత్ 2.0లో భాగంగా రూ.3,975 కోట్లతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.





Total views : 196579