ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో రామచంద్రారెడ్డి అనే చీడ పురుగు ప్రవేశించిందని, ఆయన 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతు అందినకాడికి దోచుకున్నారని బిసివై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఎద్దేవా చేసారు. తను బినామీలను పెట్టుకొని భూములను, ఇసుకను, ఎర్రచందనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చిత్తూరు జిల్లా ఎస్పి రిషాంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని దౌర్జన్యానికి పాల్పడ్డారని, నా పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే అడ్డుకున్నారని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసారు. పోలిసులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని, నేను శాంతియుతంగా సభ నిర్వహించుకుంటే మీకెందుకు భయమని ఆయన రామచంద్రారెడ్డిని నిలదీశారు. మీరు చేసిన అరాచకాలు, దోపిడీలు బయటకు వస్తాయని భయపడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక పిరికిపందని పోలిసులు లేకుండా ఆయన బయటకు తిరగలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేసారు. ప్రజలందరూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై తిరుగుబాటు ప్రారంభించారని, 2024 ఎన్నికల్లో పుంగునూరులో ఆయనని ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాన్నారు. పుంగనూరు లో జరిగిన ఘటనలపై నేను హై కోర్టును ఆశ్రయిస్తానని, పోలిసులపై ప్రైవేట్ కేసు వేస్తానని అన్నారు. రాబోయే మరో 3 నెలల్లో మంత్రి రామచంద్రారెడ్డిని పుంగనూరు నుండి తరిమి తరిమి కొడతానని. నా పై నా కార్యకర్తలు పై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు.
chittoor district news
చిత్తూరు జిల్లా పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సదుంలో రైతుభేరీ సభ నిర్వహించేందుకు సిద్దమైన భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారు. రైతు భేరీకి వెళ్లకుండా యాదవ్ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పుంగనూరుకు వెళ్లే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే రామచంద్ర యాదవ్ ఇంటి వైపు వచ్చే వాహనాలను అడ్డుకుంటున్నారు. రైతు భేరి కార్యక్రమానికి సంబంధించి జెండాలను, పోస్టర్లను రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద ఆంక్షలు విధించారు. ప్రతి ఒక్కరి ఐడి కార్డులను పరిశీలించి పంపుతున్నారు. హైకోర్ట్ ఉత్తర్వులు ఉన్నప్పటికీ సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఎస్పీ అనుమతి తీసుకుని సభ నిర్వహించుకోవాలని పోలీసులు రామచందర్ యాదవ్ కు సూచించారు. పోలీసుల ఓవర్ యాక్షన్ పై బిసివై పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.
జగనన్న భూరక్ష పథకం ఓ బోగస్ అని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పరిధిలో తన స్వగ్రామమైన ఐనంబాకం గ్రామంలో తన భూమికి జగన్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకం, సర్వే సిబ్బంది నాటిన రాళ్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ…జగనన్న భూరక్ష పథకం కింద పట్టాదారు పాసు పుస్తకాలు ముద్రించి, ముఖ్యమంత్రి బొమ్మ వేసి ఇదే మీ పాసు పుస్తకం అని రైతులకు ఇస్తున్నారు. ఈ పాసు పుస్తకం నాలిక గీసుకోడానికి కూడా పనికి రాదు. అధికారులు ఇచ్చిన నియమాల మేరకే… బ్యాంకు రుణం తీసుకునే సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం, పట్టాదారు పాసుపుస్తకం అధికారికి చూపించనవసరం లేదట. అంటే ఇది బోగస్ పత్రం. దేనికీ పనికి రాదు. నాలుక గీసుకునే దానికి కూడా పనికి రాదు. జగన్ బొమ్మ ముద్రించి కొన్ని వందల కోట్లు ఖర్చు చేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలు ఎంతో విలువైనవి. వీటిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి. వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు పొందవచ్చు. జగన్ ఇచ్చిన పాసు పుస్తకంలో బొమ్మ కనిపిస్తుంది తప్పితే దేనికీ పనికి రాదు. ఈ పుస్తకంతో బ్యాంకులో రుణాలు ఇవ్వరు. హక్కు పత్రం రాదు. హక్కు రాదు. ఊరికే విగ్రహంలా పెట్టుకోవచ్చు. దీంతో పాటు రీ సర్వే చేశారు. ఈ సర్వేతో క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. రైతులకు ఉమ్మడి హక్కు పత్రాలు ఇవ్వడం వలన చాలా రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా చేయడం వలన రైతుల మధ్య వివాదాలు వస్తున్నాయి. అనేక తప్పుల తడకలతో భూరక్ష పథకం కింద పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నారు. ఇందుకోసం జగన్ సర్కారు వేల కోట్లు ఖర్చు చేసి బొమ్మలతో బండలు వేశారు. ఇలానే తెలంగాణలో మునుపటి ముఖ్యమంత్రి చేశారు. అందులో వినియోగదారుల హక్కులు కనబడలేదు. అనుభవదారుల హక్కు కనబడలేదు. ఈ కారణంగా అనుభవించే వారి భూమి భూస్వాముల పాలైంది. తెలంగాణలో కేసీఆర్ కు అదే దెబ్బ తీసింది. ఇలానే ఏపీలో జగన్ ను కూడా భూరక్ష పథకం దెబ్బ తీబోతోంది. ఈ రీ సర్వే వలన రైతుకు ఎలాంటి ఉపయోగం లేదు. బండలు కనిపిస్తాయి. పుస్తకం కనిపిస్తుది. ఈ పుస్తకం, ఈ రాయి ఓ శిలా ఫథకంలా ఉంటాయి. స్మశాన వాటికలా ఉంటుంది తప్ప ఏం ఉపయోగం లేదు. ఈ బండలే రాబోయే కాలంలో జగన్ కు శిలాఫలకంలా మిగిలిపోతుంది. ఈ పథకమే రాబోయే ఎన్నికల్లో జగన్ ను ఓడించబోతోంది అంటూ నారాయణ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న భూరక్ష పథకం కింద ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే కార్యక్రమం క్షేత్ర స్థాయిలో రైతుల మధ్య చిచ్చు పెడుతోంది. తరతరాలుగా తమ అనుభవంలో ఉన్న భూమి ఇతరుల ఆధీనంలోకి వెళుతోంది. ఇది రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. భూములు సర్వే చేయడానికి రోవర్ వినియోగించాలి. ఈ పరికరంతో సర్వే చేస్తే ఖచ్చితత్వం వస్తుంది. అయితే జగన్ సర్కారు రీ సర్వేకి ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్ (ఆర్వో ఐ) పరికరం వినియోగిస్తోంది. సర్వేకి ఈ పరికరం వినియోగించడం వలన పొలం విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు వస్తున్నాయి. పొలం గట్లలో సరిహద్దుల సమస్యలు వస్తున్నాయి. ఇవి చిలికి చిలికి గాలివానగా మారి దాడులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక ముఖ్యంగా రీ సర్వేకు రైతులు సహకరించడం లేదు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉంటున్నారు. క్షేత్రస్థాయిలో రీ సర్వేకు సహకరించాల్సిన గ్రామ రెవిన్యూ అధికారులు (వీఆర్వో) తమకు ఏమీ పట్టనట్లు ఉంటున్నారు. ఇక రీ సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా డిప్యూటీ తహసీల్దారు, మండల సర్వేయరుతో ఓ బృందం ఏర్పాటు చేసింది. సచివాలయ సర్వేయర్లు క్షేత్ర స్థాయిలో సర్వే చేసే సమయంలో ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించాల్సిన బాధ్యత ఈ మండల బృందంపై ఉంది. అయితే వీరు దిష్టి బొమ్మలా ఉంటున్నారు తప్ప… సమస్యల పరిష్కారానికి సహకరించడం లేదు. దీంతో సచివాలయ సర్వేయర్లు ఇబ్బందులు పడాల్సివస్తుంది. ముఖ్యంగా రీ సర్వే చేసిన గ్రామాల్లో ఉమ్మడి భూమికి 1-బి రావడం లేదు. 1-బి లేక పోవడం వలన రైతులు బ్యాంకుల్లో పాసుపుస్తకాలు పెట్టి రుణాలు పొందలేకపోతున్నారు. ఇది చాలా ప్రధాన సమస్య. ఇది ప్రభుత్వానికి తెలిసినా సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. రైతులకు కూడా భూ సర్వేపై అవగాహన లేక పోవడం ప్రధాన సమస్య. ఇక సచివాలయ సర్వేయర్లకు సర్వే చేయడానికి తగిన సమయం ఇవ్వకుండా పని ఒత్తిడి పెంచడం వలన కొలతల్లో ఖచ్చితత్వం లోపిస్తోందనే విమర్శ బలంగా ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
తిరుమల శ్రీవారి దర్శనార్ధం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం లో గోవింద నామ స్మరణ చేస్తూ సామాన్య భక్తులతో కలిసి నడుచుకుంటూ దీపికా పదుకుణే తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో వస్తున్న దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు తీసుకున్నారు. అనంతరం తిరుమలలోని అతిధి గృహం చేరుకున్న దీపికా పదుకుణే, రాత్రి తిరుమలలో బస చేసి, శుక్రవారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో మరియు విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి నగరంలో తాజ్ హోటల్ లో జరిగిన శ్రీ సిటి ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు బుధవారం సాయంత్రం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి స్థానిక తాజ్ హోటల్ నందు జరిగిన శ్రీ సిటి ఎండి రవి సన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరై వధువు నిరీష, వరుడు సాగర్ లకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించి 5.15 గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు పయణమయ్యారు. రేణిగుంట విమానాశ్రయం నందు ముఖ్యమంత్రి కి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం , చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్, చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, డి ఐ జి అమ్మి రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి తదితరులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం, వీడ్కోలు పలికారు.
పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన జాగీరుగా సాగిస్తున్న నియంత పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈనెల 15వ తేదీ సదుంలో రైతు సమస్యలపై రైతు భేరి బహిరంగ సభకు రావలసిందిగా బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమల మండలంలో బుధవారం రైతులు, ప్రజలను ఆహ్వానించడానికి వెళ్ళగా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు బీసీవై పార్టీ శ్రేణులను అడ్డుకొని వాహనాలపై రాళ్లు వేసి దాడికి పాల్పడ్డారు. మా గ్రామంలో మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయరాదని, మేము చూస్తూ ఊరుకోమని రైతుభేరి కరపత్రాలు చింపివేసి, పలువురుపై దుర్భాషలాడుతూ దాడి చేశారు. సోమల ఎస్సై వెంకట నరసింహులు ఏకపక్షంగా దాడి చేసిన వారిని వదిలేసి ప్రశాంతంగా రైతుభేరి కి ఆహ్వానిస్తున్న బీసీవై పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలను సోమల పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వారిపై కేసులు నమోదు చేయడానికి ప్రయత్నించడం దారుణం. పోలీసులు మంత్రి ఒత్తిడితో వ్యవహరిస్తే హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తాం. పుంగనూరు ఏమైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరికే రాజకీయాలు చేయాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా, పుంగనూరులో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. పుంగనూరు లో మంత్రి పెద్దిరెడ్డి, వారి అనుచరులు, కార్యకర్తలు చేస్తున్న దురాగతాలు, దౌర్జన్యాలు, దాడులు, దాష్టికాలను ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం మూడు నెలల్లో ఇంటికి వెళ్లడం ఖాయం. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి, మంత్రికి వత్తాసు పలికి అక్రమాలను ప్రోత్సహించిన అధికారులకు భవిష్యత్తులో శిక్ష తప్పదు. వెంటనే సోమల పోలీస్ స్టేషన్లో ఉన్న బీసీవై పార్టీ మహిళలు, నాయకులను విడుదల చేసి, దాడి చేసిన వైసిపి వారిపై కేసులు నమోదు చేయాలి. ఈ దౌర్జన్యాలను గవర్నర్, డీజీపీ, హైకోర్టు, మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తాను.
పలమనేరు మున్సిపాలిటీ గంటావూరులో కబ్జాల పర్వం కొనసాగుతోంది. గంటావూరు లో కొంతమంది ప్రభుత్వ స్థలాలను అందినకాడికి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గంటావూరులో ప్రభుత్వ స్థలంలో ఓ నేత ఏకంగా సచివాలయం నిర్మిస్తున్నామంటూ ప్రజలను నమ్మబలికి రెండంతస్థుల భవనాన్ని నిర్మించాడు. మరోచోట ప్రభుత్వ లే ఔట్ స్కెచ్ లో ఉన్న రోడ్డునే ఏకంగా అమ్మేశారు. తాజాగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని హిటాచి వాహనంతో చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అక్కడకు వచ్చిన రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా తమకు తెలియదని సమాధానం చెప్పగా మీకు తెలియకుండా పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. రెవెన్యూ అధికారులు పనులను నిలిపివేశారు.
తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. వల్లివేడు పంచాయతీ పరిధిలో మామిడి తోటలపై విరుచుకు పడుతూ పంట నష్టానికి పాల్పడుతున్నాయి. అంతే కాకుండా ఏనుగుల గుంపు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళవారం ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మామిడి చెట్లను పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. పంట నష్ట తీవ్రతను అంచనా వేయాలని సూచించారు. అనంతరం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద ప్రజలు, బాధిత రైతులతో మాట్లాడారు. 10 ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో వచ్చి పంటను నష్టపరచడం ఇది మూడవ సారి అని తెలిపారు. కర్ణాటక సరిహద్దుల నుంచి ఏనుగుల గుంపు వస్తోందని, ఏ క్షణాన్నైనా గ్రామం వైపు వస్తాయేమోనన్న భయం నెలకొందని వారు తెలిపారు. అటవీ సరిహద్దు ప్రాంతాలైపైన అటవీ శాఖ అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరారు. వెంటనే చిత్తూరు, తిరుపతి జిల్లాల డీఎఫ్ఓ అధికారులతో మోహిత్ రెడ్డి మాట్లాడారు. అత్యవసరంగా చర్యలు చేపట్టాలని కోరారు. అధైర్య పడకండి.. ఐకమత్యంగా మెలిగి ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఏనుగుల గుంపును తరిమేద్దామని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం వేళల్లో పంట పొలాలకు వెళ్ళరాదని సూచించారు. ఏనుగులు కంట పడితే వెంటనే సంబంధిత పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఏనుగుల గుంపును త్వరితగతిన తరలింపునకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
విశాఖలో జనసేన పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖ టైకూన్ కూడలి సమస్యపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు బయలుదేరితే, ఆయనను మా నాయకులను బలవంతంగా అడ్డుకొని అరెస్టులు చేయడం అప్రజాస్వామ్యమని, శాంతియుతంగా, ట్రాఫిక్ లకు అడ్డు లేకుండా నిరసన తెలిపితే మీకు వచ్చిన నష్టమేముందని, ఒక పక్క పోలీసులకు చెప్తున్నా వినకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారని, విశాఖ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషాలు ఉండటంతో కూడలి క్లోజ్ చేయటం ఏమిటని? ప్రజా సమస్యలు తీర్చమంటే నిర్బంధిస్తారాఅని, ఈ ప్రభుత్వం తీరు మార్చుకొని ఎడల ఎంతటి ఉద్యమానికైనా జనసేన పార్టీ సిద్దమని, పోలీసులు ఐ.పి.సి సెక్షన్ల ను మాని వై.సీ.పీ సెక్షన్ల ను ఆచరిస్తున్నారని ఆరోపించారు, ఈ ప్రభుత్వానికి కాలపరిమితి ఇక మూడు నెలలు మాత్రమే ఉందని, ఈ విషయాన్ని వైసిపి నేతలతో సహా పోలీసులు కూడా గుర్తుంచుకోవాలని, తక్షణమే నాదేండ్ల మనోహర్ కు నాయకులకు క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, అకేపాటి సుభాషిని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
భవానీప్రసాద్, ఎపి హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాట్లాడుతూ.. వెలుగునీడల మధ్య దోబూచులాడే పరిస్థితిలో ఉన్నామని సాంఘిక బాధ్యత, సామాజిక స్పృహ ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన అన్నారు. సామాజిక విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి సమాధి కడుతున్నారని ఎపిలో నెలకొన్న పరిస్థితులు ప్రజాస్వామ్య వాదులకు బాధ కలిగిస్తోంది ఆయన అన్నారు.
ఎం.ఎన్.రావు, హిమాచల్ ప్రదేశ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ… న్యాయవ్యవస్థపై చాలామందికి మంచి అభిప్రాయం లేదని ఎమ్మెల్యేలు ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారని అన్నారు. చదువుకున్న వారు శాసనసభలో ఉంటే బాగుంటుందని ప్రస్తుతం ముఖ్యమంత్రి చెప్పిందే చట్టంగా మారిపోతోందని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాగా పనిచేశారని మహిళలకు ప్రాధాన్యమిచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ఎన్టీఆర్ నిర్ణయాలు చారిత్రాత్మకంగా మారాయని ప్రజల్లో మార్పు అవసరమని ఆయన అన్నారు.





Total views : 90017