అవసరమైన సమయంలో విద్యుత్ సరాఫరా చేయడం లేదని, కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ కర్ణాటకలోని కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానికంగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్కు ట్రాక్టర్లో ఓ మొసలిని తీసుకొచ్చారు. కరెంట్ ఇస్తారా?.. సబ్ స్టేషన్లో మొసలిని వదలాలా? అంటూ సిబ్బందిని రైతులు ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాజాగా, ఈ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో’ అంటూ కాంగ్రెస్ సర్కారుపై సెటైర్లు సంధించారు.
congress
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని మనసులో మాట బయట పెట్టారు. ప్రజలు ఆశీర్వదిస్తే ఇంకో పది సంవత్సరాల్లో తాను సీఎం అవుతానని అన్నారు. దసరా ఉత్సవాలను సంగారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించగా, ఆ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్న అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. విజయదశమి నాడు తన మనసులో మాట చెబుతున్నానని అన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ వల్ల తన నోరు, చేతులు కట్టి పడేసినట్లు అయిందని, లేదంటే మరిన్ని విషయాలను చెప్పే వాడినని జగ్గారెడ్డి అన్నారు. తాను ఎల్లప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో ఉన్నా, లేకపోయినా.. తన భార్యతో పాటు అనుచరులు ఉంటారని చెప్పారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లిపోతానని అన్నారు. ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉండాలని జగ్గారెడ్డి కోరారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాయకులంతా, మళ్లీ నా వద్దకు వస్తారని నిర్మల జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ధీమీ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తే ,ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తానని అన్నారు. ఎమ్మెల్యే తన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను చేసిన మంచి పనుల వల్లే నన్ను ప్రజలంతా ఆశీర్వదిస్తారన్నారు.కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చిన పార్టీలో పని చేస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తన లక్ష్యమని ఉద్ఘాటించారు.
రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. గెలుపు గుర్రాల కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేయగా.. అటు బీజేపీ కూడా 83 మందితో రెండో జాబితాను ప్రకటించింది.రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై గత కొంతకాలంగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఆ ఊహాగానాలకు తెరదించుతూ నేడు వెల్లడించిన జాబితాలో రాజే పేరును భాజపా ప్రకటించింది. తన కంచుకోట ఝల్రాపటన్ నుంచే ఆమెను బరిలోకి దించింది. ఈ నియోజకవర్గం నుంచి ఆమె ఇప్పటికే 4 సార్లు విజయం సాధించారు.ఇక, మేవాఢ్ వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ వారసుడు విశ్వరాజ్ సింగ్ మేవాఢ్ను నాథ్ద్వారా నుంచి నిలబెట్టింది. ఇటీవలే విశ్వరాజ్ భాజపాలో చేరారు. అటు ప్రముఖ రాజకీయ నేత భైరాన్ సింగ్ షెఖావత్ అల్లుడు నర్పత్ సింగ్ రజ్వీకు కూడా తాజా జాబితాలో చోటు దక్కింది. బీజేపీఇప్పటివరకు 124 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. అటు కాంగ్రెస్ కూడా శనివారం 33 మందితో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే, ఇందులో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి, ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడి ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధం అని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. తనకు సొంత ఇల్లు లేకపోయినా బాధపడనని, కోట్లాది ప్రజల హృదయాల్లో తనకున్న స్థానం చాలని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటాయన్నారు. అసోం, రాజస్థాన్, మహారాష్ట్రలో మేం ఎక్కడ బీజేపీతో పోరాటం చేస్తుంటే అక్కడ ఎంఐఎం తన అభ్యర్థులను దింపుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ తీసుకువచ్చిన బిల్లులన్నింటికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందని, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటున్నారని రాహుల్ వివరించారు.