రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీఆర్ఎస్ సహా ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో శక్తి వందన్ వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. భారతీయులు అంటే గతంలో విదేశాల్లో లెక్కచేయకపోయే వారని కానీ ఇప్పుడు భారత పాస్‌పోర్ట్ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం దక్కుతోందన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం తమ పార్టీపై, పార్టీ నేతలపై అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకులు కూడా కేసీఆర్ కుటుంబం మాదిరి మాట్లాడరన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణలో 32 జిల్లాలకు జాతీయ రహదారులను కేంద్రం అనుసంధానం చేసిందన్నారు. కేంద్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా బీజేపీ పాలన చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రంపై భారం మోపిందని ఆరోపించారు. ఫిబ్రవరి చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముందన్నారు. గతంలో తెలంగాణలో ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగాయని ఇప్పుడు వారం అటు ఇటుగా ఉండవచ్చునని… అందరు సిద్ధంగా ఉండాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.
Kcr
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 7న తన ఫాంహౌస్ బాత్రూంలో కాలు జారిపడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో ప్రమాణం చేయనున్నారు. గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45 వేల మెజార్టీతో విజయం సాధించారు. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పటికీ బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణా రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలామంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించ వలసిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి పార్లమెంటరీ పార్టీ నాయకులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిల జాప్యంపై నిరసన తెలుపుతూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలని , పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసేలా సీనియర్లు చొరవ తీసుకోవాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
గణతంత్ర దినోత్సవ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. సుమతి శతకం లో భాగంగా బద్దెన రాసిన పద్యం ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టిన శుభలగ్నమునం దొనగర బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ’ అనే పద్యాన్ని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ అంటూ కామెంట్స్ పెడుతుండగా మరికొంత మంది మాత్రం పదేళ్లు అధికారంలో కూర్చున్న మీకే ఈ పద్యం సరిపోతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల గొయ్యి తీసి బొంద పెడతామని, కేసీఆర్ కాస్కో అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ఈ ట్వీట్ చేసినట్లు భావిస్తున్నారు.
కరీంనగర్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కేటీఆర్ పై విమర్శలు కురిపించారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నానని భావిస్తున్నడు…అదే అహంకారం కన్పిస్తోంది. కేసీఆర్ పాలనలోని అరాచకాలను, అవినీతిని బయటపెట్టిందే బీజేపీ అంటు విమర్శించారు. అందుకే జనం ఆ పార్టీని బొందపెట్టారని, అయినా సిగ్గు లేకుండా అరువు జిల్లా నేతను తీసుకొచ్చి మొరుగుతున్నడు అని అన్నారు. బండి సంజయ్ ఏం చేసిండో కేసీఆర్ ను రమ్మను చర్చించేందుకు సిద్ధం అన్నారు. నువ్వెన్ని మొరిగినా నీ కుటుంబ గుత్తాధిపత్యాన్ని నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అయన తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే…బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు. ఇక్కడున్న సోకాల్డ్ మేధావి వినోద్ కుమార్ టిప్పర్ దరఖాస్తులు పంపిండు తప్ప ఒక్క పని చేయలేదు. కేసీఆర్ కుటుంబానికి ఆయన ఉపయోగపడ్డారే తప్ప కరీంనగర్ కు చేసిందేమీ లేదని బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్.. జగిత్యాల, వరంగల్ జాతీయ రహదారి పనులకు నిధులు తెచ్చిందెవరు? అంటూ ప్రశ్నించారు. ఆయన ఎంపీగా ఉన్నన్నాళ్లు కరీంనగర్…వరంగల్ రోడ్డు అధ్వాన్నంగా ఉండేవి… యాక్సిడెంట్స్ అవుతుంటే ఎన్నడైనా నిధులు తెచ్చినవా? నేను ఎంపీగా ఉంటూ కేంద్రంతో మాట్లాడి రిపేర్లకు రూ.41 కోట్లు తెచ్చిన అంటూ ఫేర్ అయ్యారు. ఈనెల 28న ఎస్సారార్ కాలేజీలో వేలాది మంది బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ కర్యక్రమానికి రానున్నారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపు నిచ్చారు.
తాము ఓడిపోయినంత మాత్రాన ప్రజలను వదిలేసేది లేదని… వారి పక్షాన పోరాడతామని… ప్రజలే తమకు దేవుళ్లని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదని… తెలంగాణ నుంచి కేసీఆర్‌ను ఎవరూ వేరు చేయలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి… చావునోట్లో తల పెట్టి తెలంగాణను సాధించారన్నారు. తెలంగాణ రావడం వల్లే మనకు నీళ్లు… నిధులు.. నియామకాలు వచ్చాయన్నారు. మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ రావడం వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు వచ్చాయన్నారు. వీటన్నింటికి కారణం కేసీఆర్ అని గుర్తుంచుకోవాలన్నారు. అయితే ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పని చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. కేసీఆర్ రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Read Also..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడా వెంకటరెడ్డి మాట్లాడారు. బీజేపీ హటావో దేశ్ కి బచావో నినాదంతో ఇండియా కూటమిలో భాగస్వామ్యమయి ఉన్నామని తెలిపారు. బీజేపీ అక్షింతల పేరిట రాముడిని రాజకీయం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. శ్రీరాముడు మంచివాడు కాదని ఎవరు కూడా అనరని, కానీ రాముని పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ అహంకారమే బీఆర్ఎస్ ను ఓడించిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో స్వీకరించిన దరఖాస్తులను, త్వరితగతిన పరిశీలించి ప్రజలకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ చేపట్టడం మంచి పరిణామమని పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాయి. సమీక్షలను నిర్వహిస్తూ గత పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గం నుంచి కవిత గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమిపాలయ్యారు. మరోవైపు ఆ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా సహకరించిందంటూ బీఆర్ఎస్ నేతలు అప్పట్లో విమర్శించారు. తాజాగా నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలతో కవిత సమావేశం నిర్వహించారు. 2019లో తాను ఓటమిపాలు కావడానికి సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల వైఖరే కారణమని ఆమె అన్నారు. ఆ సమయంలో నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సమయంలో ఆయనను కార్యకర్తలు కలవకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డంకులు సృష్టించారని చెప్పారు. తాను జిల్లాలో పర్యటించినప్పుడు కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ విషయమై తనకు ఫిర్యాదులు కూడా అందాయని చెప్పారు. తాను నిజామాబాద్ లోనే ఉంటానని… ఎవరైనా తనను కలవొచ్చని అన్నారు. అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
తెలంగాణలో గత ప్రభుత్వం 10 జిల్లాలను విభజించి మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేయడం తెలిసిందే. పరిపాలనా సౌలభ్యం పేరిట నాడు కేసీఆర్ సర్కారు ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం మారింది. కొత్త సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా, ఆయన జిల్లాల పునరీకరణ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి 33 జిల్లాలు అవసరం లేదన్న భావనతో ఉన్నారు. 33 జిల్లాల్లో బాగా చిన్న జిల్లాలను కలిపేసి, జిల్లాల సంఖ్యను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కోసం ఓ కమిషన్ ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లు పెట్టే అవకాశముంది.
తెలంగాణ సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల రీ ఆర్గనైజేషన్ కు త్వరలో కమిషన్ వేస్తామని వెల్లడించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన కమిషన్ వేస్తామని చెప్పారు. తెలంగాణ అంతటా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తీరులా చేస్తామని స్పష్టత ఇచ్చారు. కచ్చితమైన ప్రాతిపదికతో జిల్లాలు మారుస్తామన్నారు. డీవియేషన్ ఉండొచ్చు, వయోలేషన్ ఉండొద్దు కదా అని రేవంత్ ఓ కార్యక్రమంలో ప్రశ్నించారు. జిల్లాల ఏర్పాటు విషయంలో కేసీఆర్ సరైన విధానం అవలంబించ లేదన్నారు. ఎడాపెడా జిల్లాలను పెంచేశారని రేవంత్ విమర్శించారు. అదెలా ఉందంటే.. ఆ జిల్లాల పేర్లను కూడా కేసీఆర్ చెప్పలేరని ఎద్దేవా చేశారు. మూడు మండలాలకు ఓ జిల్లా చేశారని సీఎం వివరించారు. ఉదాహరణకు మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం ఏడు జిల్లాల పరిధిలో ఉందన్న రేవంత్.. అక్కడి ఎంపీ ఏడుగురు కలెక్టర్లతో మాట్లాడాలా అని ప్రశ్నించారు.





Total views : 89991