పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో గుర్తింపు సంఘం నాయకులు ఉద్యోగాల పేరుతో కుంభకోణానికి పాల్పడుతున్నారని పాలకుర్తి జడ్పీటీసీ, బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మిక నాయకులు పరిశ్రమకు సంబంధించిన కొందరు అధికారులతో కుమ్మక్కై లక్షల కోట్ల రూపాయలు అమాయకులు, రైతుల నుంచి వసూలు చేస్తూ గోల్ మాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎరువుల కర్మాగారం విషయంలో కూడా కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, అలా కాకుండా ఉన్నతాధికారులు దీనిపై సీరియస్గా తీసుకొని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్టీపీసీ పరిశ్రమ ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన రైతులు, అర్హత కలిగిన యువకులను మోసం చేస్తూ డబ్బులు ఇచ్చిన వారికే తాత్కాలిక ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఎన్టీపీసీ యాజమాన్యం తప్పనిసరిగా ఉపాధి కల్పించాల్సి ఉండగా కార్మిక నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై నిర్వాసితుల నోట్లో మన్ను కొడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా పరిశ్రమ ఉన్నతాధికారులు స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Peddapally district news
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని, తెల్లవారి జామున భోగి పండగ వేడుకల్లో పాల్గొని, భోగి మంటలను వెలిగించి, భోగి సంబరాలను ప్రారంభించి అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరికి పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణ రావు గారు మాట్లాడుతూ…… సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో గత 13 సంవత్సరాల నుండి భోగి పండగ వేడుకలను, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, చిన్నారుల కోలాటాల మధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే సిరులు తెచ్చే పండుగ అని, గాంధీ నగర్ ఆదర్శ యూత్, వార్డ్ కౌన్సిలర్ అరుణ బాబురావు ఆధ్వర్యంలో భోగి పండుగ సంబరాలను ఏర్పాటు చేసుకొని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సంక్రాంతి పండుగ ఇంటిల్లిపాదికి ఆనందాన్నిచ్చే పండుగ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాల్లో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగ అని, భోగభాగ్యాలు తెచ్చే పండుగ భోగి పండుగ అని ప్రజలంతా సుఖసంతోషాలతో భోగి మంటలు వేసుకుంటారని అన్నారు. పాత వస్తులు అన్ని అగ్నికి ఆహుతిచేసి జీవితాలలో సుఖసంతోషాలు ఉండాలని భోగి మంటలు వేసుకుంటారు. చిన్నపిల్లలు అందరికి ఇంద్రధనస్సుల రంగవల్లులు వేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కాలనీ వాసులు, యూత్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
మంత్రిగా మొదటిసారి పెద్దపెల్లి జిల్లాకు వచ్చిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సుల్తానాబాద్ లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సుల్తానాబాద్ లోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దపల్లికి ర్యాలీగా బయలుదేరారు. పెద్దపల్లిలోని కమాన్ చౌరస్తా వద్ద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు సంపూర్ణ విశ్వాసం ఉంచి మమ్మల్ని భారీ మెజారిటీలతో గెలిపించారని, ఈప్రాంత అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులలోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని, మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచామని అన్నారు. పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని, ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందిస్తామని శ్రీధర్ బాబు అన్నారు.